Begin typing your search above and press return to search.

దసరాకి థియేటర్లలో దిగిపోనున్న 'దృశ్యం 2'

By:  Tupaki Desk   |   21 Sept 2021 2:12 PM IST
దసరాకి థియేటర్లలో దిగిపోనున్న దృశ్యం 2
X
ప్రేక్షకులను అలరించాలంటే .. ఆకట్టుకోవాలంటే కావలసినది ఖర్చు కాదు .. కథ అని నిరూపించిన చిత్రం 'దృశ్యం'. ఈ సినిమా చూస్తుంటే తెరపై చూస్తున్నట్టుగా కాకుండా, మన కళ్లముందు జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. అంత సహజంగా .. సజీవంగా ఆ పాత్రలు ప్రేక్షకుల మనసుకు దగ్గరగా తిరుగాడతాయి. అధికారం .. డబ్బు ఉన్నవారి నుంచి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఒక మధ్యతరగతి ఆడపిల్ల తండ్రి పడిన కష్టం ప్రతి ఒక్కరిని కదిలించి వేస్తుంది. ఆ ప్రయత్నంలో కుటుంబ సభ్యులు ఆయనకి సహకరించిన తీరు ఆశ్చర్యచకితులను చేస్తుంది.

అన్ని భాషలకు .. అన్ని ప్రాంతాలకు కనెక్ట్ అయ్యే కథా వస్తువు ఇది. అందువల్లనే ఏ భాషలో రీమేక్ అయితే ఆ భాషలో భారీ విజయాలను సాధించింది .. భారీ వసూళ్లను రాబట్టింది. అలా తెలుగులో కూడా ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకుల నుంచి ఆదరణ పొందింది. ఆ సినిమాకి సీక్వెల్ గా మలయాళంలో వచ్చిన 'దృశ్యం 2' కూడా అక్కడ సంచనలన విజయాన్ని నమోదు చేసింది. మొదటిభాగం ముందు తేలిపోకుండా.. అంతకుమించి ఆకట్టుకుంది. నిజంగా ఆ క్రెడిట్ దర్శకుడు జీతూ జోసెఫ్ ఖాతాలోకి చేరుతుందనే చెప్పాలి.

ఆయన దర్శకత్వంలోనే తెలుగు 'దృశ్యం 2' కూడా నిర్మితమైంది. వెంకటేశ్ .. మీనా ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, సురేశ్ బాబు కూడా ఒక నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించాడు. రీసెంట్ గా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. 'నారప్ప' మాదిరిగానే 'దృశ్యం 2' సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలనే ఆలోచనలో సురేశ్ బాబు ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆ దిశగానే ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకున్నారు.

కానీ ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. థియేటర్లకు వచ్చే జనం పెరుగుతున్నారు. 'లవ్ స్టోరీ' సినిమా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. దాంతో 'దృశ్యం 2' ను కూడా థియేటర్లలో రిలీజ్ చేయాలనే నిర్ణయానికి సురేశ్ బాబు వచ్చారని చెప్పుకుంటున్నారు. దసరా బరిలో దిగే అవకాశం కూడా లేకపోలేదనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా ఓటీటీకి వెళుతుందా? దసరాకి థియేటర్లకు వస్తుందా? అనే సందేహలకు త్వరలోనే తెరపడనున్నట్టు తెలుస్తోంది.