Begin typing your search above and press return to search.

'దృశ్యం 2' సస్పెన్స్ కంటిన్యూ

By:  Tupaki Desk   |   6 Oct 2021 10:30 AM GMT
దృశ్యం 2 సస్పెన్స్ కంటిన్యూ
X
మలయాళ సూపర్ హిట్ మూవీ దృశ్యం 2 కు రీమేక్ గా రూపొందిన తెలుగు దృశ్యం 2 విడుదల విషయంలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. వెంకటేష్‌.. మీనాలు ప్రథాన పాత్రల్లో నటించిన దృశ్యంకు మంచి స్పందన వచ్చింది. ఆ సినిమా ఘన విజయం సాధించిన నేపథ్యంలో సహజంగానే సీక్వెల్‌ పై ఆసక్తి మరింతగా పెరిగింది. అంచనాలు అందుకునేలా ఒరిజినల్‌ దృశ్యం 2 ను తెరకెక్కించిన దర్శకుడు జీతూ జోసెఫ్‌ తెలుగు లో రీమేక్ చేయడం జరిగింది. ఈ సినిమా విడుదల విషయంలో గత కొన్ని నెలలుగా సస్పెన్స్ కొనసాగుతోంది. షూటింగ్‌ పూర్తి అయ్యి నెలలు నెలలు గడుస్తున్నా విడుదల విషయంలో సస్పెన్స్ ఎందుకు అంటూ వెంకీ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేస్తున్నారు.

మొదట దృశ్యం 2 ను థియేటర్లలోనే విడుదల చేయాలనుకున్నారు. కాని కరోనా కారణంగా థియేటర్లు ఎప్పటికి ఓపెన్ అవుతాయో తెలియని పరిస్థితి. దాంతో నారప్ప మాదిరిగానే ఓటీటీ లో విడుదల చేస్తామని అనధికారికంగా క్లారిటీ ఇచ్చారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌ లో వినాయక చవితి సందర్బంగా దృశ్యం 2 విడుదల కన్ఫర్మ్‌ అని అంతా అనుకున్నారు. కాని వినాయక చవితికి సినిమా విడుదల కాలేదు. ఇదే సమయంలో థియేటర్లు పూర్తి స్థాయిలో ఓపెన్‌ అయ్యి మంచి సినిమాలకు మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి. దృశ్యం 2 వంటి ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌ కు ఖచ్చితంగా మంచి వసూళ్లు నమోదు అవుతాయనే నమ్మకంను అంతా వ్యక్తం చేశారు. అందుకే థియేటర్లలో విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.

దృశ్యం 2 మేకర్స్ నిర్ణయం మార్చుకుని థియేటర్లలో రావాలనుకోవడం పట్ల అంతా కూడా ఆనందం వ్యక్తం చేశారు. ఈ సమయంలోనే దృశ్యం 2 ను మళ్లీ ఓటీటీ అంటూ ప్రచారం జరుగుతోంది. అసలు దృశ్యం 2 విడుదల విషయంలో మేకర్స్ ఆలోచన ఏంటీ అనేది అఫిషియల్ గా తెలియడం లేదు. థియేటర్ల ద్వారా విడుదల చేసేందుకు డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ నుండి వ్యతిరేకత వస్తుందని.. నిర్మాతలు ఓటీటీ వాళ్లను ఒప్పించడంలో విఫలం అవ్వడం వల్ల థియేటర్‌ రిలీజ్ సాధ్యం అవ్వడం లేదు అంటూ టాక్ వినిపిస్తుంది. క్లీన్‌ యూ సెన్సార్‌ దక్కించుకున్న దృశ్యం 2 ను థియేటర్లలో విడుదల చేయడం దాదాపుగా అసాధ్యం అని తేలిపోయింది. ఒకటి రెండు రోజుల్లో దసరా లేదా దీపావళికి దృశ్యం 2 ను ఓటీటీ ద్వారా విడుదల చేస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.