Begin typing your search above and press return to search.

ద‌స‌రాకి గిఫ్ట్ రెడీ చేస్తున్న వెంకీ మామ‌

By:  Tupaki Desk   |   12 Sep 2021 5:30 AM GMT
ద‌స‌రాకి గిఫ్ట్ రెడీ చేస్తున్న వెంకీ మామ‌
X
విక్ట‌రీ వెంకటేష్ క‌థానాయ‌కుడిగా మలయాళ ఫ్యామిలీ థ్రిల్లర్ `దృశ్యమ్ 2`ని అదే పేరుతో రీమేక్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి మోహన్ మాతృక ద‌ర్శ‌కుడు జీతు జోసెఫ్ దర్శకత్వం వహించారు. ఇటీవ‌ల‌ దృశ్యం 2 .. OTTలో డైరెక్ట్ గా విడుదలవుతుందనే ఊహాగానాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు నిర్మాత‌ల ఆలోచ‌న మారింది. ఈ చిత్రాన్ని ముందుగా థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని దసరా పండుగ కానుకగా అక్టోబర్ 13 న ప్రేక్షకుల ముందుకు రావచ్చని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే రిలీజ్ తేదీని అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంటుంది.

దృశ్యం 2 మాలీవుడ్ లో బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించింది. తెలుగు వెర్స‌న్ పైనా భారీ అంచ‌నాలున్నాయి. వెంకీ దృశ్యం 2 డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ+హాట్‌స్టార్ కొనుగోలు చేసింది. సురేష్ బాబు- ఆంటోనీ పెరుంబవూర్- రాజ్ కుమార్ సేతుపతి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

థ‌ర్డ్ వేవ్ భ‌యాలు లేన‌ట్టేనా?

క‌రోనా క్రైసిస్ క‌ష్ట‌కాలంలో సినీనిర్మాత‌లు గ‌ట్టెక్కేదెలా? న‌ష్ట‌పోవ‌డం త‌ప్ప వేరే మార్గం లేదా? అంటే సినిమాల్ని థియేట్రిక‌ల్ రిలీజ్ కోసం ఆప‌డం కంటే ఓటీటీల‌లో రిలీజ్ చేయ‌డ‌మే బెట‌ర్ అని భావించారు. అందుకు అగ్ర నిర్మాత డి.సురేష్ బాబు అతీతులేం కాదు. ఆయ‌న త‌మ సినిమాల్ని ఓటీటీల్లో రిలీజ్ చేసేందుకే ఆస‌క్తిని క‌న‌బ‌రిచారు. మునుముందు పొంచి ఉన్న థ‌ర్డ్ వేవ్ భ‌యాల న‌డుమ థియేట‌ర్ల‌ను తెరిచినా కానీ జ‌నం అంత‌గా రార‌ని ఆయ‌న నమ్మారు. అందుకే ఎవ‌రు ఎన్నిర‌కాలుగా హెచ్చ‌రించినా ద‌గ్గుబాటి కాంపౌండ్ సినిమాలన్నిటినీ ఓటీటీల‌కు విక్ర‌యిస్తున్నార‌ని గుస‌గుస‌లు వినిపించాయి.

ఇంత‌కుముందు ఓటీటీ లోనే `నార‌ప్ప` చిత్రాన్ని రిలీజ్ చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియో లో జూలై 20న నార‌ప్ప విడుద‌లైంది.ఈ చిత్రం భారతదేశం స‌హా 200 పైగా దేశాలు భూభాగాలలో ప్ర‌సార‌మైంది. ఒక ర‌కంగా నార‌ప్ప‌ను ఓటీటీలో రిలీజ్ చేయ‌డం వ‌ల్ల‌నే ఎక్కువ‌మంది ఆడియెన్ వీక్షించార‌ని సురేష్ బాబు సంతృప్తిని వ్య‌క్తం చేశారు. థియేట‌ర్ల‌లో రిలీజ్ చేసినా ప్ర‌యోజ‌నం లేద‌ని న‌మ్మారు ఆయ‌న‌.

ఇక సురేష్ ప్రొడ‌క్ష‌న్ నుంచే వ‌స్తున్న `విరాట‌ప‌ర్వం` డీల్ కోసం నెట్ ఫ్లిక్స్ తో మంత‌నాలు సాగిస్తున్నార‌న్న గుస‌గుస‌లు వినిపించాయి. ఒప్పందం దాదాపు ఖరారైందని టాక్ వినిపించింది. ఈ మూవీ పెండింగ్ చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుని ఇత‌ర ప‌నుల్ని ముగించేందుకు ప్ర‌ణాళిక‌ల్లో ఉన్నారు. రానా- సాయిప‌ల్ల‌వి జంట‌గా వేణు ఉడుగుల ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

ఎగ్జిబిట‌ర్ల బాధ‌ల‌ను దృష్టిలో ఉంచుకుని నిర్మాత‌లు ఎవ‌రూ త‌మ సినిమాల‌ను ఓటీటీల్లో రిలీజ్ చేయొద్ద‌ని ఇంత‌కుముందు తెలంగాణ ఫిలింఛాంబ‌ర్ హెచ్చ‌రించింది. ఓటీటీల‌కు విక్ర‌యిస్తే ప‌రిణామాలు తీవ్రంగా ఉంటాయ‌ని ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారంగ్ హుకుం జారీ చేశారు. కానీ దానిని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ అంత‌గా ప‌ట్టించుకోలేద‌ని కూడా క‌థ‌నాలొచ్చాయి.

అయితే `నారప్ప` బాట‌లోనే `దృశ్యం 2`..`విరాట‌ప‌ర్వం` చిత్రాల‌ను ఓటీటీల్లో రిలీజ్ చేయ‌నున్న‌ట్టు ద‌గ్గుబాటి కాంపౌండ్ ఇంకా ప్ర‌క‌టించ‌క‌పోవ‌డంతో డి సురేష్ బాబు ఆలోచ‌న‌లో ప‌డ్డార‌ని భావించాల్సి వ‌చ్చింది. ఇక డి.సురేష్ బాబు లో థ‌ర్డ్ వేవ్ భ‌యాలు అలానే ఉన్నా ఇప్పుడు దృశ్యం 2ని థియేట‌ర్ల‌లో విడుద‌ల చేసేందుకు డేర్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

టిక్కెట్టు రేటు ప్ర‌ధాన స‌మ‌స్య‌..?

ఓటీటీ ఇప్పుడు నిర్మాత‌ల‌కు-ఎగ్జిబిట‌ర్ల మ‌ధ్య‌ కాక‌లు పుట్టిస్తోంది. మ‌రోవైపు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప‌రిస్థితిలు ఇండ‌స్ట్రీకి ఇబ్బందిక‌రం అన్న చ‌ర్చ సాగుతోంది. స‌వ‌రించిన జీవోతో ప‌రిశ్ర‌మ‌ ఎంత‌గా అభ్య‌ర్థించినా టిక్కెట్ రేట్లు పెంచుకోవ‌డానికి ఏపీ ప్ర‌భుత్వం అనుమతివ్వ‌లేదు. ప్ర‌భుత్వ అధికారులు-నిర్మాత‌ల మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రిగినా అవి సంతృప్తిక‌రంగా లేవని క‌థ‌నాలొచ్చాయి. మ‌ళ్లీ ప్ర‌భుత్వం చ‌ర్చ‌ల‌కు పిలుస్తుంద‌ని ఆశిస్తున్నా ఇంకా అది జ‌ర‌గ‌లేదు. ప్ర‌భుత్వాధీశులు త‌మ‌ ప‌ట్టుద‌లను వీడ‌లేం అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారని విమ‌ర్శ‌లొస్తున్నాయి. ఇక ఏపీలో టిక్కెట్టు రేటు ప‌రిష్కారం లేక‌పోవ‌డంపైనా డి.సురేష్ బాబు స‌హా నిర్మాత‌లు పూర్తి అసంతృప్తితో ఉన్నారు.