Begin typing your search above and press return to search.

స్టార్ హీరోకు బాబాయ్ గా డా. రాజ‌శేఖ‌ర్‌?

By:  Tupaki Desk   |   10 Jan 2022 9:00 PM IST
స్టార్ హీరోకు బాబాయ్ గా డా. రాజ‌శేఖ‌ర్‌?
X
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - కొర‌టాల శివ క‌ల‌యిక‌లో రూపొందిన చిత్రం `జ‌న‌తా గ్యారేజ్‌`. 2016 సెప్టెంబ‌ర్ 1న విడుద‌లైన ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించి ఎన్టీఆర్ కెరీర్‌లోనే ది బెస్ట్ మూవీగా నిలిచింది. ఈ మూవీలో రాజీవ్ క‌న‌కాల‌కు మ‌ద్ద‌తుగా నిలిచిన సంద‌ర్భంలో `బ‌ల‌వంతుడు బ‌ల‌హీనుడిని భ‌య‌పెట్టి బ్ర‌త‌క‌డం ఆన‌వాయితీ బ‌ట్ ఫ‌ర్ ఏ ఛేంజ్ ఆ బ‌ల‌హీనుడి ప‌క్క‌న కూడా ఓ బ‌ల‌ముంది... జ‌న‌తా గ్యారేజ్‌.. అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ లు థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల చేత విజిల్స్ వేయించాయి.

అంతే కాకుండా ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ఇందులో హీరో ఎన్టీఆర్ ని చూపించిన విధానం గ‌త చిత్రాల‌కు పూర్తి భిన్నంగా వుండ‌టంతో మ‌ళ్లీ వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో సినిమా ఎప్పుడొస్తుందా అని ప్రేక్ష‌కులు, అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూడ‌టం మొద‌లుపెట్టారు. వారి ఎదురుచూపుల్ని నిజం చేస్తూ కొర‌టాల శివ - ఎన్టీఆర్ మ‌ళ్లీ క‌లిస ప‌ని చేస్తున్నామంటూ ఇటీవ‌ల ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో వుంటుంద‌ని, `జ‌న‌తా గ్యారేజ్‌`కి మించి వుంటుంద‌ని ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ఈ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని యువ సుధా ఆర్ట్స్ బ్యాన‌ర్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్స్ పై మిక్కినేని సుధాక‌ర్ తో క‌లిసి హీరో నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించ‌బోతున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా న‌టించ‌నుందంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఇదిలా వుంటే తాజాగా ఈ మూవీకి సంబంధించిన మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన వార్త ఇప్పుడు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో చక్క‌ర్లు కొడుతోంది. `జ‌న‌తా గ్యారేజ్‌` కోసం మ‌ల‌యాళ సూపర్ స్టార్ మోహ‌న్ లాల్ తో ప్ర‌త్యేక పాత్ర చేయించి ఆ సినిమాకు ప్ర‌త్యేక‌త‌ని, క్రేజ్ ని తీసుకొచ్చిన కొర‌టాల శివ తాజా ప్రాజెక్ట్ కోసం మ‌రో సీనియ‌ర్ హీరోని రంగంలోకి దింపేస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఆ హీరో డా. రాజ‌శేఖ‌ర్ అని తెలిసింది. `జ‌న‌తా గ్యారేజ్‌`లో హీరో మోహ‌న్ లాల్ పెద‌నాన్న‌గా క‌నిపించిన విష‌యం తెలిసిందే. తాజా చిత్రంలో డా. రాజ‌శేఖ‌ర్ .. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కు బాబాయ్ గా కీల‌క పాత్ర‌లో క‌నిపిస్తార‌ని, ఆయ‌న పాత్ర కూడా ప‌వ‌ర్ ఫుల్ గానే వుంటుంద‌ని తాజాగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ వార్త ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియ‌దు కానీ ఇది నిజ‌మైతే సినిమా ఓ రేంజ్ లో వుంటుద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

ఇప్ప‌టికే ఈ మూవీ రిలీజ్ డేట్ ని మేక‌ర్స్ ప్ర‌క‌టించేశారు. ఏప్రిల్ 22, 2022న ఈ మూవీని విడుద‌ల చేయ‌బోతున్నాం అంటూ ప్ర‌క‌టించేశారు. అయితే తాజా ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఆ డేట్ మారే అవ‌కాశం వుంద‌ని తెలిసింది. `జ‌న‌తా గ్యారేజ్` సూప‌ర్ డూప‌ర్ హిట్ కావ‌డంతో మ‌రోసారి ఎన్టీఆర్ - కొర‌టాల క‌లిసి చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. అందుకు త‌గ్గ‌ట్టే ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ముందు అనుకున్న స్క్రిప్ట్ లో కూడా మార్పులు చేస్తున్నార‌ట‌.