Begin typing your search above and press return to search.

శోకంలో మంచేసి వెళ్లిపోయిన సినారె!

By:  Tupaki Desk   |   12 Jun 2017 5:14 AM GMT
శోకంలో మంచేసి వెళ్లిపోయిన సినారె!
X
మ‌రో తెలుగు ధ్రువ‌తార నేల రాలింది. తెలుగు సాహితీ ప్ర‌పంచంలో చెర‌గ‌ని త‌న ముద్ర‌ను వేసేసిన ప్ర‌ముఖ క‌వి జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత సి. నారాయణరెడ్డి(85) క‌న్నుమూశారు. గ‌డిచిన కొంత‌కాలంగా అనారోగ్యంగా ఉన్న ఆయ‌న హైద‌రాబాద్‌లోని కేర్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ క‌న్నుమూశారు. సోమ‌వారం ఉద‌యం ఆయ‌న తుదిశ్వాస విడిచిన‌ట్లుగా వైద్యులు వెల్ల‌డించారు. క‌రీంన‌గ‌ర్ జిల్లా హ‌నుమాజీపేట‌లో జ‌న్మించిన సింగిరెడ్డి నారాయ‌ణ‌రెడ్డి త‌ర్వాతి కాలంలో "సినారెష‌గా సుప‌రిచితుల‌య్యారు. సాహితీ లోకంలోనూ.. సినిమా రంగంలోనూ త‌న‌దైన ముద్ర‌లు వ‌దిలివెళ్లిన ఆయ‌న తీరు తెలుగువాడి గుండెల్లో విషాదాన్ని నింపింది.

1953లో న‌వ‌మిపువ్వు పేరుతో తొలి ర‌చ‌న చేసిన సినారె.. 1962లో సినీరంగ ప్ర‌వేశం చేశారు. దాదాపు మూడు వేల పాట‌లు రాసిన ఆయ‌న 1977లో ప‌ద్మ‌పుర‌స్కారాన్ని అందుకున్నారు. 1988లో ఆయ‌న ర‌చించిన విశ్వంభ‌ర కావ్యానికి ప్ర‌తిష్ఠాత్మ‌క జ్ఞానపీఠ్‌ అవార్డును అందుకున్నారు. ఈ కావ్యం గొప్ప‌త‌నం ఏమిటంటే.. పోస్ట్ గ్రాడ్యుయేష‌న్లో.. సివిల్స్ లోనూ పాఠ్యాంశంగా నేటికి ఉంది. ఆయ‌న గొప్ప‌త‌నానికి ఇదొక్క ఉదాహ‌ర‌ణ స‌రిపోతుందేమో.

తెలుగు సినిమాలో ఆయ‌న రాసిన ఎన్నో పాట‌లు.. తెలుగువాడి నాలుక చివ‌ర్లో ఉంటాయ‌న‌టంలో సందేహం లేదు. ఎన్నో పుర‌స్కారాల్ని పొందిన ఆయ‌న‌.. 1992లో అత్యున్న‌త పుర‌స్కార‌మైన ప‌ద్మ‌విభూష‌ణ్ ను పొందారు. 1997లో రాజ్య‌స‌భ స‌భ్యుడిగా వ్య‌వ‌హ‌రించారు. ఆయ‌న్ను రాష్ట్రప‌తి నామినేట్ చేశారు. త‌న ఆరేళ్ల ప‌ద‌వీకాలంలో స‌భ‌లో ఆయ‌న అడిగిన ప్ర‌శ్న‌లు.. ప్ర‌సంగాలు.. చ‌ర్చ‌లు.. ప్ర‌స్తావ‌న‌లు అంద‌రి మ‌న్న‌న‌లు పొందాయి. ప‌లు బాధ్య‌త‌లు స్వీక‌రించిన ఆయ‌న‌.. 1981లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ అధికార భాషా సంఘం అధ్య‌క్షులుగా వ్య‌వ‌హ‌రించారు. 1985లో అంబేడ్క‌ర్ విశ్వ‌విద్యాల‌యం ఉపాధ్య‌క్షులుగా.. 1989లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాల‌యం ఉపాధ్య‌క్షులుగా వ్య‌వ‌హ‌రించారు. 1982లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ సాంస్కృతిక వ్య‌వ‌హారాల స‌ల‌హాదారులుగా వ్య‌వ‌హ‌రించిన ఆయ‌న‌.. ఏపీ రాష్ట్ర సాంస్కృతిక మండ‌లి అధ్య‌క్షులుగా కూడా సేవ‌లు అందుకున్నారు.

సినారె అకాల మ‌ర‌ణంపై రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు చంద్ర‌బాబు నాయుడు.. కేసీఆర్ లు త‌మ తీవ్ర సంతాపాన్ని వ్య‌క్తం చేశారు. ఆయ‌న‌తో త‌మ‌కున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సినారె క‌న్నుమూత‌పై ప‌లువురు ప్ర‌ముఖులు త‌మ ప్ర‌గాఢ సానుభూతిని ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు తెలియ‌జేశారు. ఆయ‌న్నుక‌డ‌సారి చూసేందుకు పెద్ద ఎత్తున ఆయ‌న నివాసానికి వెళుతున్నారు.

సినారె అందుకున్న అత్యుత్త‌మ సాహితీ పుర‌స్కారాల్లో కొన్నింటిని చూస్తే..

- జ్ఞానపీఠ్‌ అవార్డు

- కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం

- ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ పురస్కారం

- భారతీయ భాషా పరిషత్‌

- రాజ్యలక్ష్మీ పురస్కారం

- సోవియట్‌-నెహ్రూ పురస్కారం

- ఆసాన్‌ పురస్కారం

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/