Begin typing your search above and press return to search.

సినారె గురించి ఈ తరానికేం తెలుసు?

By:  Tupaki Desk   |   12 Jun 2017 3:13 PM GMT
సినారె గురించి ఈ తరానికేం తెలుసు?
X
సింగిరెడ్డి నారాయణరెడ్డి.. ఇలా చెబితే ఎంత మందికి తెలుసో కాదో చెప్పలేం కానీ.. సినారె అంటే మాత్రం టక్కున ఓ స్ఫురద్రూపి కళ్ల ముందు మెదులుతారు. ఆయన పాటలు చెవిలో గింగిర్లు తిరుగుతాయి. అంతటి మహనీయుడు.. ఇప్పుడు కాలం చేశారు.. తిరిగిరాని లోకాల దరికి చేరారు.

బహుశా ఈ తరం వారికి సినారె గురించి అంతగా తెలియకపోవచ్చు. కానీ తెలుగు పాటల ఒరవడిని మార్చి.. దేశవ్యాప్తంగా వాటి స్థాయిని చేర్చిన ఘనత ఆయనదే. 1962లో వచ్చిన గులేబకావళిలోని 'నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని' నుంచి 2008లో వచ్చిన అరుంధతిలోని 'జేజమ్మా జేజమ్మ' వరకూ ఎన్నెన్నో మధురమైన గేయాలని అందించారు సినారె. ముఖ్యంగా అమ్మ మీద ఆయన రాసిన పాటలు మధురాలుగా మిగిలిపోయాయి. ప్రేమించు చిత్రంలో 'కంటేనే అమ్మ అని అంటే ఎలా.. కరుణించే ప్రతి దేవత అమ్మే కదా.. కన్న అమ్మే కదా' అంటూ రాసిన పాట మరిచిపోవడం అసాధ్యం. 'లాలీ లాలీ.. వటపత్రసాయికి వరహాల లాలి' అంటూ స్వాతిముత్యంలో పాట ఆయన అందించిన అద్భుతాలలో ఒకటి.

దేశభక్తి పాటల విషయంలోను ఆయన ప్రతిభా పాటవాలు అసామాన్యం. 'తెలుగు జాతి మనది.. నిండుగ వెలుగు జాతి మనది' అంటూ తల్లా పెళ్లామా చిత్రంలో సాగే పాట.. ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. ఈ తరంలో చాలా మంది రచయితలు ప్రాసల కోసం పాకులాడుతూ అర్ధవంతం లేని పాటలతో చెవులను హోరెత్తిస్తున్నా.. అర్ధవంతమైన పాటలతో తెలుగు పాట స్థాయిని పెంచిన సినారె ఇప్పటికే కాదు.. ఎప్పటికీ చిరస్మరణీయుడే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/