Begin typing your search above and press return to search.

ఇంతకీ ప్రభాస్ జాతకాలు నమ్ముతాడా?

By:  Tupaki Desk   |   1 Jan 2022 2:35 PM IST
ఇంతకీ ప్రభాస్ జాతకాలు నమ్ముతాడా?
X
సాధారణంగా ఏ సినిమాలోనైనా కథానాయకుడు రిక్షా దగ్గర నుంచి విమానం నడిపే పాత్ర వరకూ ఏవైనా చేయవచ్చు .. చేశారు కూడా. కానీ జాతకాలను సీరియస్ గా నమ్మేసి .. తప్పకుండా అది జరిగి తీరుతుందనే పాత్రలను మాత్రం తెలుగు తెరపై పెద్ద హీరోలెవరూ చేయలేదు. అలాంటి ఒక అరుదైన పాత్రను 'రాధే శ్యామ్' సినిమాలో ప్రభాస్ పోషించాడు. ఈ పాయింట్ వినగానే అందరి మనసులో సహజంగానే ఒక ప్రశ్న మెదులుతుంది. ఇంతకీ ప్రభాస్ జాతకాలు నమ్ముతాడా లేదా? అని. ఈ ప్రశ్నకి సమాధానం ఎలా దొరుకుతుందా అని వాళ్లంతా వెయిట్ చేస్తున్నారు.

తాజా ఇంటర్వ్యూలో దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దగ్గర ఇందుకు సంబంధించిన ప్రస్తావన వచ్చింది. అందుకు ఆయన స్పందిస్తూ .. "ప్రభాస్ జాతకాలు నమ్ముతాడా లేదా? అనేది మీరు ఆయనని అడిగితేనే బాగుంటుంది. జాతకాలపై నా అభిప్రాయం ఏమిటనేదే ఈ సినిమా. జాతకాలు ఉన్నాయా .. లేవా అనే విషయాన్ని గురించి మనం మాట్లాడుకుంటే, అవి అబద్ధమైతే ఇన్ని వేల సంవత్సరాలుగా అవి ఎందుకు కొనసాగుతూ వస్తాయి. ఎప్పుడైనా ఎందులోనైనా నిజం లేకపోతే ఎక్కడో ఒక చోట అది అంతరించిపోతుంది. ఒకవేళ నిజం ఉంటే ఎంత పెర్సెంట్ ఉందనేది చూడాలి.

మనకు అర్థం కానివి .. మనకి తెలియనివి .. మనచుట్టూ చాలా చాలా జరుగుతూ ఉంటాయి. మనకి తెలిసినవి రైట్ అనడం .. తెలియనివి తప్పు అనడం సాధారణంగా జరుగుతూ ఉంటాయి. దేవుడు .. అంతరిక్షం .. జాతకం .. మొదలైన వాటికి సంబంధించిన ప్రశ్నలు మనిషి దగ్గర నుంచే పుడతాయి. అలాంటి వాటికి మనషి దగ్గర నుంచే ఆన్సర్ రావలసి ఉంటుంది. ఈ కథను ప్రభాస్ ను దృష్టిలో పెట్టుకునే రాశాను .. హీరోయిన్ ఎవరనేది మాత్రం ముందుగా అనుకోలేదు. స్క్రిప్ట్ అంతా అయిపోయిన తరువాత అనుకోకుండా నేను పూజ హెగ్డేని 'పార్క్ హయత్' హోటల్లో కలిశాను. ఆమెను చూడగానే ఒక ప్రిన్సెస్ లా అనిపించింది.

ఈ సినిమాలో హీరోయిన్ గా ఆమె అయితే బాగుంటుందని అనుకుని, కథను వినిపించాను. కథ వినగానే వెంటనే ఆమె ఓకే చెప్పేసింది. ఈ సినిమా చూసిన తరువాత 'రాధే శ్యామ్'కి ముందు .. ఆ తరువాత అని ఆమె గురించి అంతా మాట్లాడుకుంటారు. తెరపై ఈ జోడీ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా అనిపిస్తుంది. నేను చూసినవారిలో ప్రభాస్ చాలా సెన్సిటివ్. ఎవరైనా తన కళ్ల ముందు బాధపడుతుంటే .. అది చూసి ఆయనకి కూడా అంతే బాధ కలుగుతుంది. తాను ఆనందంగా ఉండాలి .. తనచుట్టూ ఉన్నవాళ్లంతా ఆనందంగా ఉండాలి .. అదే ఆయన పద్ధతి. దగ్గరగా ఉంటూ ఆయనలో నేను గమనించినది అదే" అంటూ చెప్పుకొచ్చాడు.