Begin typing your search above and press return to search.

కబీర్ సింగ్ పై కేసు.. కేంద్రానికి లేఖ!

By:  Tupaki Desk   |   26 Jun 2019 9:01 AM GMT
కబీర్ సింగ్ పై కేసు.. కేంద్రానికి లేఖ!
X
సందీప్ వంగా బాలీవుడ్ డెబ్యూ ఫిలిం 'కబీర్ సింగ్' సంచలనాలకు కేంద్రబిందువుగా మారుతోంది. షాహిద్ కపూర్.. కియారా అద్వాని హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఇప్పటికే 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఇంకా జోరు కొనసాగిస్తోంది. అయితే ఈ బాక్స్ ఆఫీస్ వసూళ్ళకు సంబంధం లేకుండా విమర్శలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. సగానికి పైగా బాలీవుడ్ క్రిటిక్స్ ఈ సినిమాపై విమర్శలు గుప్పించారు. రీసెంట్ గా సెన్సార్ బోర్డు సభ్యురాలు వీణా టిక్కూ 'కబీర్ సింగ్' పై మండిపడ్డారు. తాజాగా ఈ సినిమాపై ఒక కేసు కూడా నమోదైంది.

ఈ సినిమాలో హీరో షాహిద్ మద్యానికి బానిసైన సర్జన్ గా నటించాడు. డ్రగ్స్ కు ఎడిక్ట్ అయిన వ్యక్తిగా కూడా కనిపిస్తాడు. ఈ హీరో పాత్ర చిత్రణ పవిత్రమైన వైద్య వృత్తిని అవమానించేలా ఉందని.. ఇలా డాక్టర్లను కించపరిచే సినిమాను ప్రదర్శనకు అనుమతించరాదని కోరుతూ ఒక డాక్టర్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇలాంటి సినిమాలతో వైద్యులపై ప్రజలకు నమ్మకం సడలిపోయే అవకాశం ఉంటుందనే ఆయన అందోళన వ్యక్తం చేశాడు. ఈ సినిమాను నిషేధించాలని కోరుతూ కేంద్ర వైద్యశాఖ మంత్రి.. సమాచార ప్రసార శాఖా మంత్రి.. సెన్సార్ బోర్డుకు కూడా లేఖ రాసినట్టుగా ఆయన వెల్లడించాడు.

తెలుగులో సూపర్ హిట్ అయిన 'అర్జున్ రెడ్డి' కి రీమేక్ గా తెరకెక్కిన 'కబీర్ సింగ్' రిలీజ్ అయిన రోజు నుండి ఏదో ఒక రూపంలో చర్చనీయాంశం అవుతోంది. అయితే ఈ విమర్శలు.. కేసులు.. అన్నీ 'కబీర్ సింగ్' పై క్రేజ్ ను మరింతగా పెంచుతున్నాయి. ఈ సినిమా ఇప్పటికే షాహిద్ కపూర్ లో హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఫుల్ రన్ లో ఈ సినిమా 200 కోట్ల మార్కును దాటేస్తుందనే అంచనాలు ఉన్నాయి.