Begin typing your search above and press return to search.

కన్నడ హీరోని తెలుగులో చూస్తారా..?

By:  Tupaki Desk   |   22 Oct 2021 5:11 AM GMT
కన్నడ హీరోని తెలుగులో చూస్తారా..?
X
'కేజీయఫ్' సినిమా తెలుగులో సంచలన విజయం సాధించిన తర్వాత కన్నడ హీరోలందరూ తమ చిత్రాలను డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. కాకపోతే ఆ సినిమా స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. అయితే ఇప్పుడు కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ ''K3 కోటికొక్కడు'' సినిమాతో తెలుగు మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నారు.

టాలీవుడ్ ప్రేక్షకులకు కిచ్చా సుదీప్ సుపరిచితమే. ఎన్నో తెలుగు సినిమాల్లో విభిన్న పాత్రల్లో కనిపించి అలరించారు. కానీ హీరోగా పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. ఇప్పుడు హీరోగా ''K3 కోటికొక్కడు'' అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌ తో పలకరించబోతున్నారు. శివ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

కన్నడలో 'కోటిగోబ్బ 3' పేరుతో ఇటీవలే విడుదలైన ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే దాదాపు 40 కోట్లు వసూలు చేసినట్లు శాండిల్ వుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇది సుదీప్ కెరీర్‌ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలవబోతోందని తెలుస్తోంది. ఇప్పుడు తెలుగులో కూడా అదే స్థాయి సక్సెస్ అందుకుంటుందని మేకర్స్ భావిస్తున్నారు.

స్పందన పాసం - శ్వేతన్ రెడ్డి సమర్పణలో గుడ్ సినిమా గ్రూప్ ''K3 కోటికొక్కడు'' సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. శ్రేయాస్ శ్రీనివాస్ - దేవేందర్ డీకే నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే డబ్బింగ్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని నవంబర్ 12న‌ థియేట్రికల్ రిలీజ్ చేయ‌నున్నట్లు అధికారికంగా ప్రకటించారు. లేటెస్టుగా రిలీజ్ చేసిన ట్రైలర్ ఆకట్టుకుంది. తెలుగులో వారానికి రెండు క్రేజీ మూవీస్ విడుదల అవుతున్న తరుణంలో ఈ కన్నడ సినిమా ఎలాంటి ప్రేక్షకాదరణ దక్కించుకుంటుందో చూడాలి.

కాగా, 'K3 కోటికొక్కడు' సినిమాలో సుధీర్ రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తున్నారు. మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్ గా నటంచిన ఈ చిత్రంలో శ్రద్ధాదాస్ కీలక పాత్రలో కనిపించనుంది. అబ్తాబ్ - రవి శంకర్ - అభిరామి - నవాబ్ షా తదితరులు ఇతర పాత్రలు పోషించారు. అర్జున్ జన్య ఈ చిత్రానికి సంగీతం సమకూర్చగా.. శేఖర్ చంద్రు సినిమాటోగ్రఫీ అందించారు.