Begin typing your search above and press return to search.

'ధ‌మ్కీ' ట్రైలర్ చూస్తుంటే ఇన్ని సినిమాలు గుర్తొస్తున్నాయా..?

By:  Tupaki Desk   |   19 Nov 2022 6:37 AM GMT
ధ‌మ్కీ ట్రైలర్ చూస్తుంటే ఇన్ని సినిమాలు గుర్తొస్తున్నాయా..?
X
'ఈ నగరానికి ఏమైంది' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్.. 'ఫ‌ల‌క్‌ నుమా దాస్' చిత్రంతో డైరెక్టర్ గా సక్సెస్ అందుకున్నాడు. అప్పటి నుంచి తాను నటించే ప్రతీ సినిమా విషయంలోనూ దర్శకులను ఎంతో కొంత ఇన్ పుట్స్ అందిస్తూ వస్తున్నాడు. మాస్ కా దాస్ కాస్త గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్ళీ మెగా ఫోన్ పట్టుకొని ''దాస్ కా ధ‌మ్కీ'' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

విశ్వక్ సేన్ తన స్వీయ దర్శకత్వంలో సైలెంట్ గా 'ధ‌మ్కీ' సినిమా షూటింగ్ ని పూర్తి చేసి ఇటీవల ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఆవిష్కరించారు. ఇది పాన్ ఇండియా మూవీ అని.. తెలుగు తమిళ హిందీ మలయాళ భాషల్లో విడుదల అవుతుందని ప్రకటించారు. ఈ క్రమంలో శుక్రవారం ఏఎంబీ సినిమాస్ లో నటసింహం నందమూరి బాల‌కృష్ణ చేతుల మీదుగా గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్ నిర్వహించారు.

'దాస్ కా ధ‌మ్కీ' లో విశ్వక్ డబుల్ యాక్షన్ లో కనిపించి అందరినీ ఆశ్చర్య పరిచాడు. ఇది తన మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ అని ట్రైలర్ ద్వారా తెలియజెప్పాడు. అయితే ఈ ట్రైలర్ 1.0 చూసిన తర్వాత ఇది ఎన్నో ఏళ్లగా చూస్తున్న రొటీన్ లైన్ తో తెరకెక్కిందనే కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ట్రైలర్ చూసిన వెంటనే ఎన్నో పాత సినిమాలు గుర్తుకు వస్తున్నాయని అంటున్నారు.

'ధ‌మ్కీ' ట్రైలర్ ని బట్టి చూస్తే వెయిట‌ర్‌ గా ప‌ని చేసే విశ్వక్ సేన్.. కొన్ని వేల కోట్ల‌కు వారసుడైన మరో విశ్వక్ స్థానంలోకి వెళ్ల‌డం.. విలన్స్ తో ఫైట్ చేసి కంపెనీని నిలబెట్టడం.. ఫ్యామిలీలో మళ్ళీ సంతోషాన్ని నింపడానికి ప్రయత్నాలు చేయడం వంటివి కనిపిస్తున్నాయి. ఇలాంటి ప్లాట్ తోనే గతంలో గోపీచంద్ మరియు సంప‌త్ నంది కాంబినేషన్ లో 'గౌత‌మ్ నంద' అనే సినిమా తెరకెక్కింది.

'గౌత‌మ్ నంద' చిత్రంలో గోపీచంద్ ద్విపాత్రాభినయం చేసారు. మధ్యతరగతికి చెందిన గోపీచంద్.. డబ్బున్న గోపీచంద్ స్థానంలోకి రావడం.. కంపెనీ వ్యవహారాలన్నీ చూసుకుంటూ డ‌బ్బు మీద ఆశ‌తో అత‌డి స్థానంలోనే శాశ్వితంగా ఉండిపోవాలని ప్లాన్ చేయడం ఆ సినిమాలో ప్రధాన కథాంశం. కాకపోతే ఇక్కడ రెండు పాత్రలు బ్రతికే ఉంటాయి. క్లైమాక్స్ లో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారక్టర్ చనిపోతుంది.

కాకపోతే 'దాస్ కా ధ‌మ్కీ' లో ఒక విశ్వక్ సేన్ మిస్సైన తర్వాత ఆ ప్లేస్ లోకి మరో విశ్వక్ వచ్చి అన్ని పనులు చక్కదిద్దినట్లు కనిపిస్తోంది. ఈ రెండు సినిమాల సెటప్ అంతా దాదాపుగా ఒకేలా ఉందని నెటిజన్స్ అభిప్రాయ పడుతున్నారు. మరికొందరు మాత్రం ఇది నాని హీరోగా ఇంద్రగంటి మోహన కృష్ణ తీసిన 'జెంటిల్ మ్యాన్' చిత్రాన్ని గుర్తు చేస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి 'జెంటిల్ మ్యాన్' సినిమాకి 'ధ‌మ్కీ' కి కూడా దగ్గర పోలికలు కనిపిస్తున్నాయి.

అలానే మెగాస్టార్ చిరంజీవి నటించిన 'రౌడీ అల్లుడు' మరియు 'దొంగ మొగుడు' చిత్రాలు కూడా ఇదే టెంప్లేట్ లో ఉంటాయనే కామెంట్స్ కూడా వచ్చాయి. రవితేజ నటించిన 'దరువు' సినిమా గుర్తుకు వస్తోందని కొందరు అంటే.. అప్పుడెప్పుడో SV కృష్ణారెడ్డి స్వీయ దర్శకత్వంలో వచ్చిన 'అభిషేకం' సినిమా ఇలానే ఉంటుందని మరికొందరు అంటున్నారు. ఇంకా కొన్ని ఇతర భాషల సినిమాల పేర్లను కూడా ప్రస్తావిస్తున్నారు.

అంతేకాదు డబుల్ రోల్ అనేది పక్కన పెడితే 'అల వైకుంఠపురములో' మరియు 'అజ్ఞాతవాసి' సినిమాలు కూడా జ్ఞప్తికి వస్తాయని వ్యాఖ్యానిస్తున్నారు. డబుల్ రోల్ చేస్తున్నప్పుడు గతంలో అలాంటి నేపథ్యంలో వచ్చిన సినిమాలతో పోలికలు రావడం సహజమే. కాకపోతే ఇక్కడ ఎక్కువ సిమిలారిటీస్ కనిపిస్తున్నాయని అంటున్నారు. స్టోరీ కొత్తగా లేకపోయినా.. టేకింగ్ మరియు స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేయగలిగితే చాలని మాస్ కా దాస్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

'దాస్ కా ధ‌మ్కీ' ట్రైలర్ లో విజువల్స్ - బ్యాగ్రౌండ్ స్కోర్ - లొకేషన్స్ మరియు క్వాలిటీ చాలా రిచ్ గా టాప్ నాచ్ గా ఉన్నాయని.. సినిమా కూడా ఖచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిస్తున్నారు. మరి విశ్వక్ ఈ చిత్రంతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి. వన్మయే క్రియేషన్స్ మరియు విశ్వక్సేన్ సినిమాస్ పతాకాలపై రూపొందుతోన్న ఈ చిత్రాన్ని 2023 ఫిబ్రవరిలో పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.