Begin typing your search above and press return to search.

గ్రేట్ ఎస్కేపిస్ట్! డిజాస్టర్స్ నుంచి ఎస్కేప్!!

By:  Tupaki Desk   |   31 May 2021 5:39 AM GMT
గ్రేట్ ఎస్కేపిస్ట్! డిజాస్టర్స్ నుంచి ఎస్కేప్!!
X
మంచి క‌థ ఏది? చెడ్డ క‌థ ఏది? త‌న‌కు నప్పేది ఏది? సూట్ కానిది ఏది? మంచి ద‌ర్శ‌కుడు ఎవ‌రు? త‌న‌కు సూట‌య్యే ద‌ర్శ‌కుడు ఎవ‌రు? .. ఇలా స‌వాల‌క్ష లెక్కలుంటాయి హీరోల‌కు. అందునా స్టార్ హీరోలు ఒక క‌థ‌ను ఫైన‌ల్ చేయాలంటే దాని వెన‌క చాలా మార్కెటింగ్ స్టాటిస్టిక్స్ ని ప‌రిగ‌ణిస్తారు. భారీ బ‌డ్జెట్ల‌తో రిస్క్ చేయాలంటే చాలా భ‌య‌ప‌డతారు. నిర్మాత బ‌య్య‌రు బావుంటేనే ఏదైనా న‌డుస్తుంది. హిట్టు కొట్టి పాజిటివిటీ పెంచితేనే మ‌రో సినిమా ఉంటుంది. ఇక ఈ విష‌యంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తొలి నుంచి పూర్తిగా నిర్మాత‌ల వైపే ఉన్నారు. తన‌కు ప్ర‌యోగాలు చేసేందుకు కావాల్సినంత ఫ్లెక్సిబిలిటీ ఉన్నా కానీ ఏనాడూ ప్ర‌యోగాల జోలికి వెళ్ల‌లేదు. అందుకే ఆయ‌న న‌టించిన వాటిలో ఎక్కువ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలే ఉన్నాయి.

రంగ‌స్థ‌లం - ధృవ వంటి ప్ర‌యోగాల‌కు ఓకే చెప్పేందుకు చ‌ర‌ణ్ కి సుదీర్ఘ కాలం ప‌ట్టింది. అయితే అంత‌కుముందు త‌న వ‌ద్ద‌కు ప్ర‌యోగాత్మ‌క క‌థ‌లు రాలేదా? అంటే ఎందుకు రాలేదు. త‌న ఫేవ‌రెట్ ద‌ర్శ‌కులు గౌత‌మ్ మీన‌న్ .. మ‌ణిర‌త్నం మంచి క‌థ‌ల్నే త‌న వ‌ద్ద‌కు తెచ్చారు. కానీ వాటికి త‌న బాడీ లాంగ్వేజ్ స‌రిపోద‌ని చ‌ర‌ణ్ భావించాడు. అందువ‌ల్ల వాటిని సున్నితంగా తిర‌స్క‌రించాడు. నాని హీరోగా గౌత‌మ్ మీన‌న్ తెర‌కెక్కించిన ఎటో వెళ్ళిపోయింది మనసు కథను మొదట రామ్ చరణ్ కే వినిపించారు. కానీ వ‌ద్ద‌నుకున్నారు. ఈ సినిమా కంటెంట్ ప‌రంగా ఆక‌ట్టుకున్నా కానీ బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన రేంజుకు చేరుకోలేక‌పోయింది. చ‌ర‌ణ్ న‌టించినా ఇది సూట‌య్యేది కాద‌ని విశ్లేషించారు.

అలాగే దుల్కార్ స‌ల్మాన్ క‌థానాయ‌కుడిగా మ‌ణిర‌త్నం తెర‌కెక్కించిన ఓకే బంగారం క‌థ చ‌ర‌ణ్ కోసం అనుకున్న‌దే. కానీ మ‌ణి స‌ర్ ఆఫ‌ర్ ని చ‌ర‌ణ్ సున్నితంగా తిర‌స్క‌రించారు. నిజానికి ఓకే బంగారం క‌థ చాక్లెట్ బోయ్ లా ల‌వ‌ర్ బోయ్ లా ఉండేవాళ్లు చేయాల్సిన‌దే కానీ చెర్రీలా హార్డ్ గా ఉండే యాక్ష‌న్ హీరో ఇమేజ్ ఉన్న‌వాళ్లు చేయాల్సిన‌ది కానే కాదు. ప్రేమ‌క‌థ‌లోని ఆ సున్నిత‌మైన ఎలిమెంట్ చెర్రీకి క‌నెక్ట‌య్యి ఉండేది కాదు. ఇక చ‌ర‌ణ్ ఎంతో గొప్ప‌గా న‌టించిన ఆరెంజ్ లాంటి ప్రేమ‌క‌థా చిత్రాన్ని ఆడియెన్ రిసీవ్ చేసుకోని సంగ‌తి తెలిసిందే. గోవిందుడు అంద‌రివాడే లాంటి చ‌క్క‌ని ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలో న‌టించినా ద్వితీయార్థం న‌చ్చ‌క తిర‌స్క‌రించారు. కొన్ని చ‌ర‌ణ్ చేయ‌కూడ‌నివి చేసి విఫ‌ల‌మ‌య్యాడు.

నాని ద్విపాత్రాభిన‌యం చేసిన `కృష్ణార్జున యుద్ధం` క‌థ తొలుత చెర్రీ వ‌ద్ద‌కే వ‌చ్చింది. మేర్ల‌పాక గాంధీ చ‌ర‌ణ్ కి ఈ క‌థ వినిపించినా అత‌డు ఓకే చేయ‌లేదు. కానీ నాని ఓకే చేసినా అది ఫెయిలైంది. నాయ‌క్ త‌ర్వాత చ‌ర‌ణ్ కి వ‌రుస‌గా డ‌బుల్ రోల్స్ ని ఆఫ‌ర్ చేసేందుకు ద‌ర్శ‌కులు ఉత్సాహం చూపించినా వైవిధ్యం కోస‌మే చ‌ర‌ణ్ చాలా వ‌దులుకున్నారు.

ర‌వితేజ‌ నేల టిక్కెట్టు కథ చ‌ర‌ణ్ స‌హా ప‌లువురు మెగా హీరోల వ‌ద్ద‌కు వెళ్లింది. కానీ క‌ళ్యాణ్ కృష్ణ‌కు ప‌న‌వ్వ‌లేదు. అలా మాస్ రాజాకి జాక్ పాట్ త‌గిలింది. అల్లు అర‌వింద్ `రామాయ‌ణం` చిత్రంలో కీల‌క పాత్ర‌ను ఆఫ‌ర్ చేస్తే చ‌ర‌ణ్ ఓకే చెప్ప‌లేద‌ట‌. మంచి క‌థ‌ల్ని ఎంచుకోవ‌డంలోనే కాదు..త‌మ‌కు న‌ప్ప‌ని క‌థ‌ల్ని బాక్సాఫీస్ వ‌ద్ద వ‌ర్క‌వుట్ కాని వాటిని వ‌దులుకోవ‌డం కూడా చాలా ముఖ్యం. ఆ విష‌యంలో చ‌ర‌ణ్ గ్రేట్ ఎస్కేపిస్ట్ అన‌డంలో సందేహ‌మేం లేదు. ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. స‌రైన స‌మ‌యంలో స‌రైన ప్ర‌య‌త్న‌మిది. రాజ‌మౌళితో ఆర్.ఆర్.ఆర్ చేశాక వెంట‌నే శంక‌ర్ తో సినిమా చేయాల‌నుకోవ‌డం తెలివైన ప్ర‌ణాళిక‌. ఈ దెబ్బ‌కు పాన్ ఇండియా హీరోల రేస్ లో ప్ర‌భాస్ స‌ర‌స‌న అత‌డి పేరు మార్మోగుతుంద‌న‌డంలో సందేహమేమీ లేదు.