Begin typing your search above and press return to search.

#టీకా విన్న‌పం.. బాలీవుడ్ లానే టాలీవుడ్ లోనూ?

By:  Tupaki Desk   |   15 May 2021 1:00 PM IST
#టీకా విన్న‌పం.. బాలీవుడ్ లానే టాలీవుడ్ లోనూ?
X
తెలుగు చిత్ర‌సీమ‌పై ఆధార‌ప‌డి వేలాది మంది కార్మికులు జీవ‌నం సాగిస్తున్నారు. ఓ స‌ర్వే ప్ర‌కారం...24శాఖ‌లు స‌హా టాలీవుడ్ పై ఆధార‌ప‌డిన ఇత‌ర రంగాల్ని క‌లుపుకుంటే 50 వేలు పైగా కార్మికులు ఉపాధి పొందుతున్నారు. వీరంతా సేఫ్ గా ఉంటేనే ఇండ‌స్ట్రీ మ‌నుగ‌డ సాగేది.

షూటింగుల‌కు వెళ్లే కార్మికులు స‌హా థియేట్రిక‌ల్ రంగంలో కార్మికుల‌కు వ్యాక్సినేష‌న్ అయితేనే ముప్పు చాలా వ‌ర‌కూ త‌గ్గిన‌ట్టు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 1700 థియేటర్లు (సినిమా హాళ్లు.. మల్టీప్లెక్స్ స్క్రీన్లు కలిపితే) ఉన్నాయని ఓ అంచనా. వీటి ద్వారా 25 వేలమంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. పంపిణీ రంగం ద్వారా 10 వేల మంది... ఫిలిం ఫెడ‌రేష‌న్ లో 15వేల మంది ఉన్నారు. మొత్తం 35 వేల మంది ప్ర‌త్య‌క్షంగా ఉపాధి పొందుతున్నారు. టీవీ రంగంలో సుమారు 7 వేలమంది కార్మికులున్నారు. ఎలా చూసినా 50-60 వేల మంది ప్ర‌త్య‌క్ష ప‌రోక్షంగా ఈ రంగంలో ఆధార‌ప‌డి జీవిస్తున్నారు.

వీళ్లంద‌రికీ వ్యాక్సినేష‌న్ కావాల‌నేది సినీప్ర‌ముఖుల నివేద‌న. తెలంగాణ‌- ఏపీ ప్ర‌భుత్వాల‌కు ఆ మేర‌కు సినీపెద్ద‌లు విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. దీన‌ర్థం దాదాపు 60 వేల వ్యాక్సినేష‌న్ డోసుల్ని మొదటి ద‌శ‌లో.. అలాగే మ‌రో 60వేల డోసుల్ని రెండో ద‌శ‌లో కేవ‌లం సినీరంగానికి అందించాల్సి ఉంటుంద‌ని అంచ‌నా.

బాలీవుడ్ లో బడా నిర్మాణ సంస్థల్లో ఒకటైన యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ అధినేత ఆదిత్యా చోప్రా తమ కంపెనీలో కార్మికులంద‌రికీ వ్యాక్సినేష‌న్ చేయించే ప‌నిలో ఉన్నారు. అలాగే రిల‌య‌న్స్ అంబానీ సార‌థ్యంలో త‌మ కంపెనీ ఉద్యోగుల‌కు ఈ సౌక‌ర్యం ఏర్పాటు చేస్తున్నారు. రిల‌య‌న్స్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ .. స‌హా బాలీవుడ్ లో బ‌డా నిర్మాణ సంస్థ‌ల‌న్నీ ప్ర‌భుత్వాల‌ను అభ్య‌ర్థించి వ్యాక్సినేష‌న్లు ఏర్పాటు చేయించే ప‌నిలో ఉన్నాయి.

మహారాష్ట్ర ప్రభుత్వానికి ఇండియన్‌ మోషన్‌ పిక్చర్స్‌ అసోసియేషన్‌- ఫెడరేషన్‌ ఆఫ్‌ వెస్ట్రన్‌ ఇండియా సినీ ఎంప్లాయిస్‌- ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా విజ్ఞప్తులు పంపించాయి. ఇప్పుడు అదే త‌ర‌హాలో టాలీవుడ్ లోని ప‌లు బ‌డా నిర్మాణ సంస్థ‌లు వ్యాక్సినేష‌న్ల‌ను ప్రయివేటు గానూ కొనుగోలు చేయించి త‌మ ఉద్యోగుల‌కు అందించే ప్ర‌ణాళిక‌లో ఉన్నాయ‌ని తెలిసింది.

తెలుగు సినీరంగంలో బ‌డా నిర్మాణ సంస్థ‌ల్లో సురేష్ ప్రొడ‌క్ష‌న్స్-గీతా ఆర్ట్స్-శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్-యువి క్రియేషన్స్- మైత్రి మూవీ మేక‌ర్స్- డీవీవీ ఎంట‌ర్ టైన్ మెంట్స్- కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ కంపెనీ- వారాహి చిల‌న‌చిత్రం- సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ -హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్.. ఇలా దిగ్గ‌జ సంస్థ‌ల‌న్నీ త‌మ ఉద్యోగుల్ని సుర‌క్షితంగా వ్యాక్సినేష‌న్ తో చూడాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నాయ‌ని సమాచారం. ప్ర‌భుత్వాలు స‌ద‌రు బ్యాన‌ర్ లు స‌హా సినీప‌రిశ్ర‌మ‌కు చేత‌నైన సాయం చేస్తే ఈ రంగంలో ఉపాధి క‌రువ‌వ్వ‌కుండా ఇండ‌స్ట్రీని కొంత‌వ‌ర‌కూ స‌స్టెయిన్ అయ్యేందుకు వీలుంద‌ని ఓ అంచ‌నా. అయితే వ్యాక్సినేష‌న్ ప్ర‌స్తుతం క్లిష్టంగా ఉంది. మ‌రో రెండు మూడు నెల‌ల్లో కొత్త ఆల్ట‌ర్నేట్ వ్యాక్సినేష‌న్స్ అందుబాటులోకి వ‌స్తున్నాయి కాబ‌ట్టి టీకా ప్ర‌క్రియ మ‌రింత స‌ర‌ళ‌త‌రం అవుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అంత‌వ‌ర‌కూ ఇండ్ల‌లోనే సేఫ్ గా ఉండాల‌నేది ఓ నివేద‌న‌.