Begin typing your search above and press return to search.

కీర‌వాణి వార‌సులు స‌క్సెస్సేనా?

By:  Tupaki Desk   |   27 Dec 2019 4:50 AM GMT
కీర‌వాణి వార‌సులు స‌క్సెస్సేనా?
X
మ‌ర‌క‌త‌మ‌ణి ఎం.ఎం.కీర‌వాణి వార‌సులు శ్రీ‌సింహా కోడూరి- కాల‌భైర‌వ‌ల‌ను ప‌రిచ‌యం చేస్తూ తెర‌కెక్కించిన `మ‌త్తు వ‌ద‌ల‌రా` ఇటీవ‌లే థియేట‌ర్ల‌లోకి రిలీజైన సంగ‌తి తెలిసిందే. సింహా హీరో కాగా.. కాల భైర‌వ సంగీత ద‌ర్శ‌కుడి గా ప‌రిచ‌యం అయ్యారు. రితేష్ రానా అనే కొత్త కుర్రాడు ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవ్వ‌డం విశేషం. మ‌త్తు వ‌ద‌ల‌రా చిత్రానికి అన్ని వ‌ర్గాల నుంచి పాజిటివ్ టాక్ వ‌చ్చింది. ముఖ్యం గా డెబ్యూ ద‌ర్శ‌కుడి ప‌నిత‌నానికి విమ‌ర్శ‌కులు హ్యాట్సాఫ్ చెప్పారు. అంద‌రు డెబ్యూల మాదిరే కొన్ని త‌ప్పులు చేసిన రితేష్ రాణా.. వాట‌న్నిటినీ క‌ప్పి పుచ్చేలా సినిమా ఆద్యంతం హిలేరియ‌స్ కామెడీతో ర‌క్తి క‌ట్టించ‌డం లో స‌ఫ‌ల‌మ‌య్యాడ‌న్న ప్ర‌శంస‌లు ద‌క్కాయి.

ఈ చిత్రంలో టీవీ సీరియ‌ల్ కి సంబంధించిన ఎపిసోడ్ పెద్ద రేంజు లో వ‌ర్క‌వుటైంది. ఇంత‌కు ముందు వాట్సాపుల్లో వైర‌ల్ అయిన ఓ వీడియో ఆధారం గా.. ద‌ర్శ‌కుడు రితేష్ టీవీ సీరియ‌ల్ ఎపిసోడ్ ని డిజైన్ చేశారు. థ్రిల్ల‌ర్ డ్రామాలో.. మ‌ధ్య మ‌ధ్య‌లో కొంత రిలీఫ్ ఇచ్చేలా ఈ టీవీ సీరియ‌ల్ కామెడీ ఎపిసోడ్ ని రిపీట్ చేశారు. దీనిని ఆడియెన్ పిచ్చ‌గా ఎంజాయ్ చేస్తున్నారు. జ‌బ‌ర్ధ‌స్త్ రోహిణి.. ఇత‌ర న‌టీన‌టులు ఇందులో అద్భుతమైన డ్ర‌మ‌టిక‌ల్ పెర్ఫామెన్స్ తో న‌వ్వించారు. టీవీ సీరియ‌ళ్లు ఎలా చేస్తారు? అన్నదానిపై తీర్చిదిద్దిన‌ వాస్త‌విక‌త‌పై ఎపిసోడ్ అంతే బాగా పేలింది. అందుకే థియేట‌ర్ల‌లో ఆద్యంతం న‌వ్వులు కురిసాయి.

కీర‌వాణి వార‌సుడు సింహా హీరోగా త‌న‌ని తాను మ‌రింత మెరుగులు దిద్దుకునేందుకు ఆస్కారం ఉంది. అలాగే కాల‌భైర‌వ సంగీత ద‌ర్శ‌కుడిగా ఎదిగేందుకు ఛాన్సుంద‌న్న పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వ‌చ్చింది. ఇక డెబ్యూ ద‌ర్శ‌కుడిపై ప‌లువురు ప్ర‌ముఖులు ప్ర‌శంస‌లు కురిపించారు. మొత్తానికి ముగ్గురు డెబ్యూలు అలా స‌క్సెస‌య్యార‌న్న టాక్ వ‌చ్చింది.