Begin typing your search above and press return to search.

ప్రమోషన్స్ చెయ్యరు.. కానీ ప్రేక్షకులు పట్టించుకోవాలి!

By:  Tupaki Desk   |   25 Nov 2019 10:09 AM GMT
ప్రమోషన్స్ చెయ్యరు.. కానీ ప్రేక్షకులు పట్టించుకోవాలి!
X
ఈ మధ్య చిన్న సినిమాల విజయాల శాతం చాలా తగ్గి పోయింది. దీనిపై సినీ పరిశ్రమలో జోరుగా చర్చలు కూడా సాగుతున్నాయి. పెద్ద సినిమాలకు తప్ప చిన్న సినిమాల పై డబ్బు ఖర్చుపెట్టేందుకు అధిక శాతం ప్రేక్షకులు ఆసక్తి చూపడం లేదనే ఒక అభిప్రాయం వినిపిస్తోంది. ఈమధ్య సీనియర్ నిర్మాత సురేష్ బాబు కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేస్తూ థియేటర్ల మెయింటెనెన్స్ ఖర్చులు కూడా రావడం లేదని వెల్లడించారు. ఈ పరిస్థితికి పలు కారణాలు ఉన్నాయి కానీ చిన్న సినిమాల మేకర్స్ వైపునుంచి కూడా కొన్ని పొరపాట్లు వారి సినిమాలకు నష్టం కలిగిస్తున్నాయి.

వీటిలో ముఖ్యమైనది ప్రమోషన్స్ విషయం లో అశ్రద్ధ వహించడం. మహేష్ బాబు.. అల్లు అర్జున్ లాంటి టాప్ లీగ్ స్టార్ల సినిమా లు ఏమాత్రం ప్రమోషన్ చేయక పోయినా ప్రేక్షకులకు తెలిసిపోతుంది. అయినా భారీ కలెక్షన్స్ టార్గెట్ కాబట్టి అలాంటి పెద్ద స్టార్లే మూడు నెలల ముందు నుంచి ప్రమోషన్స్ తో హోరెత్తిస్తున్నారు. అయితే చిన్న సినిమాల మేకర్లు మాత్రం అక్కడే పప్పులో కాలేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం 'ఎవరికీ చెప్పొద్దు' అనే సినిమా రిలీజ్ అయింది. దిల్ రాజు లాంటి స్టార్ ప్రొడ్యూసర్ విడుదల చేసినప్పటికీ ప్రమోషన్స్ లేకపోవడంతో రిలీజ్ సంగతి ఎవరికీ తెలియలేదు. టైటిల్ కి తగ్గట్టే ఎవరికీ చెప్పలేదని.. అందుకే ప్రేక్షకులకు తెలియలేదని సోషల్ మీడియా తెగ జోకులు సర్క్యులేట్ అయ్యాయి. అదొక్కటే కాదు.. కొత్త సినిమాల విషయంలో కూడా అలాంటి పరిస్థితే రిపీట్ అవుతోంది.

'రాజావారు రాణిగారు' సినిమా విషయమే తీసుకోండి. ఈ సినిమా ఈ నెల 29 న విడుదల కానుంది. అసలే అన్ సీజన్.. పోటీలో ఉన్న సినిమా నిఖిల్ 'అర్జున్ సురవరం' అయినా 'రాజావారు రాణిగారు' టీమ్ ఇప్పటి వరకూ ప్రమోషన్స్ విషయంలో చేసిందేమీ లేదు. ఈ సినిమా రిలీజ్ అవుతోంది తెలుసా?.. అని అడిగితే చాలామంది 'తెలియదు' అంటున్నారు. ఈ సినిమా టీజర్.. ట్రైలర్లు స్లో గా ఉన్నాయి. ఇక మినిమం ప్రమోషన్స్ కూడా లేకుండా రేపు ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదని బాధపడి ప్రయోజనం ఏంటి? సినిమాకు ప్రచారం అనేది ఒక ముఖ్యమైన భాగం. సినిమా కంటెంట్ ఎలా ఉన్నప్పటికీ రిలీజ్ సంగతి సినిమాలు చూసేవారికి తెలియాలి కదా. ప్రమోషన్స్ ఏమాత్రం పట్టించుకోకుండా ప్రేక్షకులు మమ్మల్ని పట్టించుకోలేదు అని తీరిగ్గా బాధపడితే ఉపయోగం ఉంటుందా?