Begin typing your search above and press return to search.

టిల్లు అన్న డీజే పెడితే.. మాస్ ఆడియన్స్ డిల్లా డిల్లా ఆడాలా..!

By:  Tupaki Desk   |   6 Jan 2022 12:30 PM GMT
టిల్లు అన్న డీజే పెడితే.. మాస్ ఆడియన్స్ డిల్లా డిల్లా ఆడాలా..!
X
టాలెంటెడ్ యాక్టర్ సిద్ధు జొన్నలగడ్డ - యంగ్ బ్యూటీ నేహాశెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ''డీజే టిల్లు''. 'అట్లుంటది మనతోని' అనేది దీనికి ట్యాగ్ లైన్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ లో రూపొందిన ఈ చిత్రానికి విమల్‌ కృష్ణ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - టీజర్ యూత్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను పూర్తి చేసిన మేకర్స్.. రిలీజ్ కు రెడీ చేశారు.

పెద్ద సినిమాలన్నీ సంక్రాంతి రేసు నుంచి తప్పుకోవడంతో ''డీజే టిల్లు'' చిత్రాన్ని జనవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ప్రచార కార్యక్రమాల స్పీడ్ పెంచారు. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా 'టిల్లు అన్న డీజే పెడితే' అనే సాంగ్ ను చిత్ర బృందం విడుదల చేసింది.

'లాలాగూడ అంబర్ పేట.. మల్లేపల్లి మలక్ పేట.. టిల్లు అన్న డీజే పెడితే డిల్లా డిల్లా ఆడాల.. మల్లేష్ అన్నా దావత్ లా బన్నూ గాని బారత్ లా.. టిల్లు అన్న దిగిండంటే.. డించక్ డించక్ దుంకాలా..' అంటూ సాగిన ఈ పాట మాస్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటోంది. హైదరాబాదీ శైలి లిరిక్స్ తో వచ్చిన ఈ డీజే సాంగ్.. యూత్ తో స్టెప్పులు వేయిస్తోంది.

'టిల్లు అన్న డీజే పెడితే' పాటకు చౌరస్తా రామ్ మిరియాల ట్యూన్ కంపోజ్ చేయడమే కాకుండా.. హుషారుగా ఆలపించారు. గీత రచయిత కాసర్ల శ్యామ్ దీనికి లిరిక్స్ రాశారు. భాను మాస్టర్ కొరియోగ్రఫీలో సిద్ధు జొన్నలగడ్డ వేసిన డ్యాన్స్ ఆకట్టుకుంటోంది. సినిమాలో హీరో క్యారక్టర్ - పాత్ర తీరుతెన్నులు ఎలా ఉంటాయనేది ఈ పాట ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశారు. సిద్దు ఇందులో పక్కా హైదరాబాద్ కుర్రాడి స్టైల్ లో అలరించాడు.

''డీజే టిల్లు'' చిత్రంలో మిగతా పాటలకు శ్రీ చరణ్ పాకాల బాణీలు సమకూర్చగా.. ఎస్ ఎస్ థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రానికి స్టోరీ - స్క్రీన్ ప్లే - డైలాగ్స్ హీరో సిద్ధు జొన్నలగడ్డ అందించడం విశేషం.

పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో ప్రిన్స్ - బ్రహ్మాజీ - ప్రగతి - నర్రా శ్రీనివాస్ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ''డీజే టిల్లు'' సినిమా లవ్ - ఎంటర్టైన్మెంట్ మరియు మ్యాడ్ నెస్ తో కూడిన క్రేజీ రైడ్‌ అని మేకర్స్ చెబుతున్నారు. సంక్రాంతి సందర్భంగా థియేటర్లలోకి వస్తున్న అర డజను చిత్రాల్లో 'గుంటూర్ టాకీస్' హీరో సినిమా ఎలాంటి ప్రత్యేకత చాటుకుంటుందో చూడాలి.