Begin typing your search above and press return to search.

జ‌గ‌ప‌తి- ర‌విశంక‌ర్ ల‌తో డిస్నీ డీల్

By:  Tupaki Desk   |   26 Jun 2019 6:10 AM GMT
జ‌గ‌ప‌తి- ర‌విశంక‌ర్ ల‌తో డిస్నీ డీల్
X
హాలీవుడ్ సినిమాల్ని భార‌త‌దేశంలోని అన్ని ప్రాంతీయ భాష‌ల్లో.. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. విజువ‌ల్ గ్రాఫిక్స్- యానిమేష‌న్స్-3డి నేప‌థ్యంలో భారీ బ‌డ్జెట్ చిత్రాలకు మ‌న దేశంలో అంత‌కంత‌కు ఆద‌రణ పెరుగుతుండ‌డంతో భారతీయ మార్కెట్ పై ఇరుగు పొరుగు దేశాల సినీప‌రిశ్ర‌మ‌లు క‌న్నేశాయి. నేరుగా ప్రాంతీయ భాష‌ల్లోకి అనువ‌దించి రిలీజ్ చేయ‌డం ద్వారా ఇక్క‌డ ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ అవుతోంది హాలీవుడ్ సినిమా. ఆ కోవ‌లో ఇప్ప‌టికే ఎన్నో భారీ హాలీవుడ్ చిత్రాలు రిలీజై బంప‌ర్ హిట్లు కొట్టాయి. కేవ‌లం భార‌త‌దేశంలో దాదాపు 300-500 కోట్ల మేర వ‌సూళ్ల‌ను సాధించే రేంజుకు చేరుకుంది హాలీవుడ్. ఇటీవ‌లే రిలీజైన అవెంజ‌ర్స్-4 భార‌త‌దేశంలో సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ప్రాంతీయ భాష‌ల నుంచి చ‌క్క‌ని వ‌సూళ్ల‌ను సాధించింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌తిష్ఠాత్మ‌క డిస్నీ సంస్థ `ది ల‌య‌న్ కింగ్` చిత్రాన్ని ఇండియాలో అంతే క్రేజీగా రిలీజ్ చేస్తోంది.

`ది ల‌య‌న్ కింగ్` చిత్రాన్ని అన్ని ప్రాంతీయ భాష‌ల్లోకి అనువ‌దించి రిలీజ్ చేస్తుండ‌డం ఆస‌క్తిక‌రం. హిందీ- తెలుగు- త‌మిళం స‌హా ప‌లు లోక‌ల్ భాష‌ల్లోకి అనువ‌దించి భారీగా రిలీజ్ చేస్తున్నారు. అడ‌వి .. అడ‌విలో రారాజు సింహం.. సింహం పిల్ల‌లు.. ఇత‌ర‌త్రా జంతుజాలం నేప‌థ్యంలో యానిమేష‌న్ వండర్ గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. అందుకే డిస్నీ ఇండియా ఈసారి ఈ సినిమాలో పాత్ర‌ల‌కు ప్ర‌ముఖ స్టార్ల‌చే అనువాదం చెప్పిస్తోంది. హిందీ వెర్ష‌న్ కి ఇప్ప‌టికే కింగ్ ఖాన్ షారూక్ .. అత‌డి వార‌సుడు ఆర్య‌న్ ఖాన్ డ‌బ్బింగ్ చెబుతున్నారు. మ‌ల‌యాళంలో ఇవే పాత్ర‌ల‌కు సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ ఆయ‌న కుమారుడు ప్ర‌ణ‌వ్ మోహ‌న్ లాల్ అనువాదం చెబుతున్నారు. క‌థ‌ను డ్రైవ్ చేసే కీల‌క పాత్ర‌లు ముసాఫా- సింబా పాత్ర‌ల‌కు తండ్రి కొడుకులు అనువాదం చెప్ప‌డం పెద్ద ప్ల‌స్ అని డిస్నీ సంస్థ భావిస్తోంది.

అలాగే తెలుగు వెర్ష‌న్ లో ఓ రెండు పాత్ర‌ల‌కు అనువాదం చెప్పేందుకు జ‌గ‌ప‌తిబాబు - డ‌బ్బింగ్ ర‌విశంక‌ర్ ల‌ను ఎంపిక చేసుకుంది. ముసాఫా పాత్ర‌కు జ‌గ‌ప‌తిబాబు డ‌బ్బింగ్ చెబుతారు. అలాగే గంభీర‌మైన స్వ‌రంతో ఎన్నో చిత్రాల‌కు డ‌బ్బింగ్ చెప్పి వాటి విజ‌యంలో కీల‌క భూమిక పోషించిన‌ ర‌విశంక‌ర్ ఈ చిత్రంలో స్కార్ అనే ఆస‌క్తిక‌ర పాత్ర‌కు డ‌బ్బింగ్ చెబుతున్నారు. `ది ల‌య‌న్ కింగ్` చిత్రం జూలై 19న రిలీజ‌వుతోంది. తెలుగు -త‌మిళం-హిందీ- ఇంగ్లీష్ వెర్ష‌న్ల‌లో రిలీజ్ చేయ‌నున్నారు. ఈ చిత్రానికి జాన్ ఫావ‌ర్యూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇదివ‌ర‌కూ రిలీజైన `ది జంగిల్ బుక్` సంచ‌ల‌న విజ‌యం సాధించి భార‌త దేశం నుంచి దాదాపు 300 కోట్ల వ‌సూళ్లు సాధించింది. ఆ సినిమా ఫ్యాన్స్ `ది ల‌య‌న్ కింగ్` రాక కోసం ఎంతో ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. మ‌రి ఈ చిత్రం ఏ స్థాయి విజ‌యం సాధిస్తుందో వేచి చూడాలి.