Begin typing your search above and press return to search.

బెల్లం వ్యాఖ్యలు.. వినాయక్ కు చేదు!

By:  Tupaki Desk   |   9 Aug 2019 11:20 AM GMT
బెల్లం వ్యాఖ్యలు.. వినాయక్ కు చేదు!
X
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ డెబ్యూ సినిమా ఏది అని అడిగితే వెంటనే 'అల్లుడు శీను' అని చెప్పేస్తారు. ఐదేళ్ళ క్రితం రిలీజ్ అయిన ఆ సినిమా అప్పట్లో టాలీవుడ్ లో ఒక సంచలనం. ఎందుకంటే అప్పట్లో స్టార్ కిడ్స్ సినిమాలను వీలైనంత తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసేవారు. కానీ తన కుమారుడి కోసం బెల్లంకొండ సురేష్ భారీ బడ్జెట్ పెట్టి సినిమాను నిర్మించాడు. అప్పట్లో మంచి ఫామ్ లో ఉన్న వినాయక్ దర్శకుడు.. సమంతా హీరోయిన్.. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచింది. ఆ తర్వాత బెల్లం కొండ బాబు చాలానే సినిమాలు చేసినా అంతో ఇంతో పేరు రావడానికి కారణం మొదటి సినిమానే.

అయితే ఇదంతా బెల్లకొండ తండ్రీకొడుకులు మర్చిపోయినట్టున్నారు. ఎందుకంటే బెల్లంకొండ సురేష్ రీసెంట్ గా 'రాక్షసుడు సినిమాతోనే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రేక్షకులకు నటుడిగా పరిచయం అయ్యాడు' అంటూ ఒక ప్రకటన చేయడం జరిగింది. ఇక శ్రీనివాస్ కూడా 'తనకు ఇదే మొదటి సినిమా' అని ఎగ్జైట్మెంట్ తో చెప్పుకున్నాడు. ఎందుకంటే ఈ ఐదేళ్ళలో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న బెల్లంకొండ ప్రాజెక్టు.. ఉన్నంతలో బెస్ట్ ప్రోడక్ట్ ఇదొక్కటే. ఆ మాత్రం ఆవేశపడడంలో తప్పేమీ లేదు. కానీ ఈ స్టేట్మెంట్ల పట్ల డైరెక్టర్ వినాయక్ గుర్రుగా ఉన్నాడట.

వినాయక్ ఈ బెల్లకొండవారి వ్యాఖ్యలపై స్పందిస్తూ 'అల్లుడు శీను' కోసం బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టామని.. ఇన్నేళ్ళ తర్వాత వారు ఇలా మాట్లాడడం సరికాదని తన అసహనం వ్యక్తం చేశాడు. అయినా బెల్లకొండ బాబు ఇదే మొదటి సినిమా అని అనుకుంటే సరిపోతుందా? చిత్రగుప్తుడి చిట్టాలాగా వికీపీడియాలో ఫిల్మోగ్రఫీ చిట్టా ఉంటుంది. దాన్ని చెరుపుదామన్నా వీలుకాదు. సినిమాల్లో జయాపజయాలు సహజం. "హిట్ తగిలితేనే నా సినిమా.. ఫ్లాపులు మీరు మర్చిపోండి" అంటే అదెలా కుదురుతుంది?