Begin typing your search above and press return to search.

'స్టైలిష్ స్టార్'ను మర్చిపోండి.. ఐకానిక్ మాస్టర్ వస్తున్నాడు: డైరెక్టర్ సుకుమార్

By:  Tupaki Desk   |   11 March 2021 2:30 AM GMT
స్టైలిష్ స్టార్ను మర్చిపోండి.. ఐకానిక్ మాస్టర్ వస్తున్నాడు: డైరెక్టర్ సుకుమార్
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా క్రియేటివ్ సినిమాల డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ పుష్ప. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా నుండి ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు మేకర్స్. ఇటీవలే పుష్ప విడుదల తేదీ కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టు 13న పుష్ప సినిమా థియేట్రికల్ రిలీజ్ అవుతుందని అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు సుకుమార్. విడుదల తేదీతో పాటు కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అందులో అల్లు అర్జున్ కాలుమీద కాలేసుకొని కూర్చొని చేతిలో గొడ్డలితో కనిపిస్తున్న లుక్ అదిరిపోయిందనే చెప్పాలి. మొత్తానికి పోస్టర్ చూసి అల్లు అర్జున్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా బన్నీ గీతాఆర్ట్స్ నిర్మించిన 'చావుకబురుచల్లగా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుకలో పాల్గొన్నాడు. ఈ సందర్బంగా ఫంక్షన్ మొత్తానికి బన్నీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. అయితే బన్నీతో పాటు డైరెక్టర్ సుకుమార్, డాన్స్ మాస్టర్ జానీ కూడా ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు. ఈ సందర్బంగా డైరెక్టర్ సుక్కు వేదికపై మాట్లాడుతూ పుష్ప సినిమా గురించి క్రేజీ అప్డేట్స్ బయటపెట్టాడు. ఆయన మాట్లాడుతూ.. 'ఇంకా మీరు స్టైలిష్ స్టార్ ను మర్చిపోండి. పుష్పతో ఐకానిక్ మాస్టర్ అయిపోతాడు.. ఇంతకుమించి చెప్పలేను. మీ హీరో వద్దంటున్నాడు' అంటూ అల్లు ఫ్యాన్స్ లో ఆసక్తి రేకేత్తించాడు. అసలే ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు సినిమా థియేటర్లోకి వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఇలాంటి టైంలో అలా అంచనాలు పెంచేసరికి ఫ్యాన్స్ రచ్చ మాములుగా లేదు. పుష్ప సినిమాను మైత్రి మూవీస్ నిర్మిస్తుండగా.. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది.