Begin typing your search above and press return to search.

MEGA154 సెట్స్‌ లో బ్రిలియంట్ డైరెక్టర్..!

By:  Tupaki Desk   |   17 Jun 2022 12:36 PM GMT
MEGA154 సెట్స్‌ లో బ్రిలియంట్ డైరెక్టర్..!
X
మెగాస్టార్ చిరంజీవి మరియు డైరెక్టర్ బాబీ (కేఎస్ రవీంద్ర) కాంబినేషన్ లో ఓ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో #MEGA154 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ మీదకు తీసుకెళ్లిన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

తాజా షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్‌ లో జరుగుతోంది. ఇందులో సినిమాలోని ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. చిరంజీవి - శృతి హాసన్ లతో పాటుగా రాజేంద్ర ప్రసాద్ - వెన్నెల కిషోర్ కూడా షూటింగ్ లో పాల్గొంటున్నారు. అయితే ఈరోజు శుక్రవారం స్టార్ డైరెక్టర్ సుకుమార్ #మెగా154 సెట్స్‌ ని సందర్శించారు.

ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించిన బాబీ.. సుకుమార్ సెట్స్ లో ఉన్న ఓ ఫోటోని షేర్ చేశారు. ఇందులో బాబీ తన ల్యాప్ టాప్ లో సుకుమార్ కి ఏదో చూపుతుండగా.. సుక్కూ దాన్ని ఆసక్తిగా చూస్తున్నాడు. పుష్ప దర్శకుడు రషెస్ చూసి బాబీని అభినందించినట్లు తెలుస్తోంది. సుకుమార్ లవ్లీ వర్డ్స్ ఎంతో ప్రోత్సాహాన్ని అందించాయని బాబీ తెలిపారు.

#మెగా154 చిత్రాన్ని అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ మంచి స్పందన తెచ్చుకుంది. బాబీ ఈ సినిమాకు స్వయంగా కథ - మాటలు రాయగా.. కోన వెంకట్ మరియు కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ ప్లే అందిస్తున్నారు. హరి మోహన కృష్ణ మరియు వినీత్ పొట్లూరి రైటింగ్ డిపార్ట్‌మెంట్‌ లో వర్క్ చేస్తున్నారు.

మైత్రీ ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని - వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జికె మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చిరంజీవికి అనేక చార్ట్‌ బస్టర్ ఆల్బమ్స్ అందించిన రాక్‌ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ #Mega154కి సంగీతం సమకూరుస్తున్నారు.

ఆర్థర్ ఎ విల్సన్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా.. ఎఎస్‌ ప్రకాష్‌ ప్రొడక్షన్‌ డిజైనింగ్ చేస్తున్నారు. నిరంజన్‌ దేవరమానె ఎడిటర్‌ గా.. మెగా డాటర్ సుస్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి 'వాల్తేరు వీరయ్య' అనే టైటిల్ ను లాక్ చేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.