Begin typing your search above and press return to search.

అగ్ర దర్శకుడి కూతురు హీరోయిన్ గా రాణించేనా..?

By:  Tupaki Desk   |   5 Aug 2022 3:30 PM GMT
అగ్ర దర్శకుడి కూతురు హీరోయిన్ గా రాణించేనా..?
X
దక్షిణాది అగ్ర దర్శకుడు శంకర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. సౌత్ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన డైరెక్టర్ ఆయన. ఇప్పటి వరకూ తమిళ చిత్రాలు చేసి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన జీనియస్ డైరెక్టర్.. ఇప్పుడు RC15 సినిమాతో నేరుగా టాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. అయితే శంకర్ తో పాటుగా ఆయన కూతురు కూడా తెలుగు చిత్ర పరిశ్రమపై దృష్టి పెడుతోందని తెలుస్తోంది.

శంకర్ చిన్న కుమార్తె అదితి కోలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. కార్తి హీరోగా తెరకెక్కిన 'విరుమాన్' సినిమాతో ఆమె తెరంగ్రేటం చేస్తోంది. తొలి చిత్రం విడుదల కాకముందే అదితి మరో క్రేజీ ప్రాజెక్ట్ లో నటించే అవకాశం దక్కించుకుంది. శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న 'మహావీరుడు' అనే బైలింగ్విల్ మూవీలో శంకర్ డాటర్ హీరోయిన్ గా ఎంపికైంది.

మడోన్ అశ్విన్ దర్శకత్వంలో శాంతి టాకీస్‌ బ్యానర్ లో రూపొందుతున్న 'మహావీరుడు' సినిమాని బుధవారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. దర్శకుడు శంకర్‌ ముఖ్య అతిథిగా హాజరై చిత్ర యూనిట్‌ కు శుభాకాంక్షలు తెలిపారు. అయితే అదితి ఇప్పుడు తెలుగులోనూ ఓ సినిమా చేయడానికి రెడీ అవుతోందని టాక్ వినిపిస్తోంది.

లేటెస్టుగా అదితి శంకర్ తెలుగులో ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్. అది కూడా ఓ స్టార్ హీరోతో బడా బ్యానర్ నిర్మించే ప్రాజెక్ట్ అని అంటున్నారు. ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. నిజానికి అదితి ఆల్రెడీ టాలీవుడ్ లో అడుగుపెట్టేసింది.

హీరోయిన్ గా కాకుండా ఒక సింగర్ గా అదితి శంకర్ తెలుగు వాళ్లకు పరిచయమైంది. వరుణ్‌ తేజ్‌ హీరోగా నటించిన 'గని' చిత్రంలో రోమియో జూలియట్ అనే సాంగ్‌ ను ఆమె ఆలపించింది. ఈ క్రమంలో త్వరలోనే కథానాయికగా ఎంట్రీ ఇవ్వబోతోందని తెలుస్తోంది. ఇక అదితి తమిళ్ లో చేస్తున్న రెండు చిత్రాలు తెలుగులోనూ విడుదల కానున్నాయి.

ఏదేమైనా డైరెక్టర్ శంకర్ స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయడమే కాదు.. తన కుమార్తెను ప్రోత్సహిస్తున్నాడని తెలుస్తుంది. బాలీవుడ్ ఫిలిం మేకర్స్ తమ కూతుర్లను హీరోయిన్లుగా పరిచయం చేయటం చూస్తుంటాం కానీ.. సౌత్ లో ఏ దర్శక నిర్మాత కూడా తమ డాటర్స్ ని కథానాయికలుగా ఇండస్ట్రీకి తీసుకురావడానికి ఆసక్తి కనబరచలేదు.

కమల్ హాసన్ - అర్జున్ లాంటి హీరోలు కూడా తమ కూతుర్లను హీరోయిన్లుగా ఇంట్రడ్యూస్ చేశారు. టాలీవుడ్ లో అక్కినేని ఫ్యామిలీ నుంచి సుప్రియ.. మెగా డాటర్ నిహారిక కొణిదెల - మంచు లక్ష్మీ - సూపర్ స్టార్ ఫ్యామిలీ నుండి మంజుల వంటి పలువురు నటీమణులుగా ఇండస్ట్రీకి వచ్చారు. కానీ దర్శక నిర్మాతల కుమార్తెలు హీరోయిన్లుగా రావడం చాలా అరుదనే చెప్పాలి. మరి ఇప్పుడు శంకర్ తనయ ఫీమేల్ లీడ్ గా ఎలా రాణిస్తుందో చూడాలి.