Begin typing your search above and press return to search.

మళ్లీ ‘షో’ చేయబోతున్న నీలకంఠ

By:  Tupaki Desk   |   4 May 2017 12:58 PM IST
మళ్లీ ‘షో’ చేయబోతున్న నీలకంఠ
X
తెలుగు సినిమాకు జాతీయ అవార్డుల్లో ఉత్తమ ప్రాంతీయ చిత్రం కేటగిరీలో కూడా శూన్య హస్తమే మిగులుతున్న రోజులవి. అలాంటి సమయంలో ఉత్తమ ప్రాంతీయ చిత్రం పురస్కారమే కాదు.. ఏకంగా ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగంలోనూ జాతీయ పురస్కారాన్ని తెచ్చిపెట్టిన సినిమా ‘షో’. ఈ చిత్రంతో జాతీయ స్థాయిలో దర్శకుడు నీలకంఠ పేరు చర్చనీయాంశమైంది. ‘షో’ తర్వాత అతను చేసిన ‘మిస్సమ్మ’ అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ ఆకట్టుకుంది. కానీ ఆ తర్వాత తనపై పెట్టుకున్న అంచనాల్ని నిలబెట్టలేకపోయాడీ విలక్షణ దర్శకుడు. చివరగా నీలకంఠ తీసిన ‘మాయ’ విమర్శకుల ప్రశంసలందుకున్నా.. బాక్సాఫీస్ దగ్గర నిలబడలేదు.

మధ్యలో ముంబయి వెళ్లి ‘మాయ’ సినిమాను హిందీలో తీసే ప్రయత్నాలు జరిగినా అవి విజయవంతం కాలేదు. దీంతో టాలీవుడ్డుకే తిరిగొచ్చాడు నీలకంఠ. ఇప్పుడతను 15 ఏళ్ల కిందట దర్శకుడిగా తనకు లైఫ్ ఇచ్చిన ‘షో’ సినిమాకు సీక్వెల్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఈ చిత్రానికి ‘సెకండ్ షో’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశాడు. నటుడు.. దర్శకుడు శ్రీనివాస్ అవసరాల ఈ చిత్రానికి తన వంతు సహకారం అందిస్తుండటం విశేషం. స్క్రిప్ట్ వర్క్ లో సాయం చేయడమే కాదు.. ఆ సినిమాలో అవసరాల ఓ కీలక పాత్ర పోషించే అవకాశాలు కూడా ఉన్నాయట. త్వరలోనే ఈప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడవుతాయి. ఈ సినిమాతో మళ్లీ తనేంటో రుజువు చేసుకోవాలని భావిస్తున్న నీలకంఠ అందులో ఎంతమేర సక్సెస్ అవుతాడో చూద్దాం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/