Begin typing your search above and press return to search.

దేవిశ్రీపై వేటు.. తప్పని ఒప్పుకున్నట్లేగా

By:  Tupaki Desk   |   17 May 2017 10:36 AM GMT
దేవిశ్రీపై వేటు.. తప్పని ఒప్పుకున్నట్లేగా
X
‘సింగం’ సిరీస్ లో తొలి రెండు సినిమాలకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. అతడి పాటలు.. నేపథ్య సంగీతం ఆ రెండు సినిమాలకు ఎంత ఆకర్షణగా నిలిచాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సింగం సింగం.. అనే ఆ హమ్మింగ్ వింటేనే మాస్ ప్రేక్షకులకు పూనకం వచ్చేస్తుంది. ఐతే అంత మంచి ఔట్ పుట్ ఇచ్చి.. ఆ సినిమాల విజయంలో తన వంతు పాత్ర పోషించిన దేవీని ‘సింగం-3’కి తప్పించేసి పెద్ద షాకే ఇచ్చాడు దర్శకుడు హరి. ఆ చిత్రానికి హారిస్ జైరాజ్ సంగీతం అందించాడు. ఐతే ‘సింగం-3’కి మ్యూజిక్కే పెద్ద మైనస్ అయింది. దేవిశ్రీ లేని లోటు సినిమా అంతటా స్పష్టంగా కనిపించింది. మాస్ పల్స్ పట్టుకోవాలంటే.. వాళ్లలో ఊపు తెచ్చే మ్యూజిక్ ఇవ్వాలంటే దేవిశ్రీనే సరైనోడు అని మరోసారి రుజువైంది.

‘సింగం-3’ నుంచి దేవిశ్రీని తప్పించడం ఎంత పెద్ద తప్పో హరికి బాగానే తెలిసొచ్చినట్లుంది. దానికి అతను పరిహారం చెల్లించుకుంటున్నాడు. విక్రమ్ హీరోగా తెరకెక్కబోయే ‘సామి’ సీక్వెల్ కోసం అతను దేవిశ్రీని సంగీత దర్శకుడిగా ఎంచుకున్నాడు. విశేషం ఏంటంటే.. ‘సింగం-3’కి దేవిని రీప్లేస్ చేసిన హారిస్ జైరాజే.. ‘సామి’ సినిమాకు సంగీతాన్నందించాడు. దీని సీక్వెల్ కు హారిస్ ను కాదని.. దేవిని ఎంచుకోవడం ద్వారా ఇంతకుముందు తాను చేసిన తప్పును దిద్దుకున్నాడన్నమాట హరి. ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘ధృవ నక్షత్రం’ సినిమా చేస్తున్న విక్రమ్.. త్వరలోనే ‘సామి-2’ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ‘సింగం-3’ నిరాశ పరిచిన నేపథ్యంలో ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు హరి. వచ్చే ఏడాది వేసవికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుందట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/