Begin typing your search above and press return to search.
అర డజను అడ్వాన్సులు.. కిం కర్తవ్యం?
By: Tupaki Desk | 17 Aug 2018 10:23 AM ISTసినిమా ఇండస్ట్రీ లో సక్సెస్- ఫెయిల్యూర్ కు ఒకే తేడా. ఫెయిల్యూర్ లో ఉంటే మనం అవతలవాళ్ళ వెంటబడాలి. అదే సక్సెస్ లో ఉంటే అందరూ మన వెంటపడతారు. ఇక్కడ వెంటబడడం అనేది మాత్రం కామన్. ఈమధ్య ఒక డైరెక్టర్ తన తాజా చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఆ సినిమా సక్సెస్ అవుతుందని అనుకొని ఉండొచ్చు గానీ ఆ హిట్ రేంజ్ ను అతనేమాత్రం ఊహించలేదని టాక్. తన టాలెంట్ తో పాటు హీరో క్రేజ్ కూడా తోడవడంతో అది బ్లాక్ బస్టర్ అయి కూర్చుంది.
ఇంకేముంది ఒక్కసారి హాట్ షాట్ డైరెక్టర్ అయ్యాడు. ఇప్పుడిక ఇండస్ట్రీ అందరికీ ఆయనే కావాలి. కానీ ఇక్క చిన్న మతలబు ఏంటంటే మన ఘనాపాఠీ డైరెక్టర్ ఒక అరడజను టాప్ ప్రొడక్షన్ హౌసుల నుండి ఎడాపెడా అడ్వాన్సులు ఆల్రెడీ తీసుకున్నాడట. ఎందుకైనా మంచిది.. 'దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి'.. 'అడ్వాన్సుల రూపం లో లక్ష్మీ దేవి వస్తుంటే కాదని అంటామా" అనే ఉద్దేశం అయి ఉండొచ్చు. తన తాజా సినిమా రిలీజ్ కు కరెక్ట్ గా నెల ముందు కూడా ఒక ప్రముఖ ఫిలిం ఫ్యామిలీ నుండి అడ్వాన్సు తీసుకున్నాడని టాక్.
మరి ఇప్పుడు చూస్తే సినిమా బ్లాక్స్ బస్టర్ అయింది.. తన సీను మాత్రం రివర్స్ అయింది. తమ అడ్వాన్సు కమిట్ మెంట్ సంగతి సరిగా తేల్చకపోవడంతో ఒక ప్రముఖ హీరో ఫ్యామిలీ ఈ దర్శకుడిపై పీకలదాకా కోపంలో ఉన్నారట. అన్ని అడ్వాన్సులు తీసుకోవడం తెలిసిన మారాజు కు ఇలాంటి వాటినుండి తప్పించుకోవడం ఎలా అనే విషయం కూడా తెలిసే ఉంటుంది. అయినా ఆ అడ్వాన్సులు మాత్రం బొమ్మాళీ నిన్నొదల అంటూ సోనూ సూద్ లాగా అఘోరా గెటప్పుల్లో వెంటపడుతున్నాయట.
