Begin typing your search above and press return to search.

కృష్ణ- శోభ‌న్ బాబుల స‌న్నిహిత ద‌ర్శ‌కుడు మృతి

By:  Tupaki Desk   |   3 Jan 2022 12:46 PM IST
కృష్ణ- శోభ‌న్ బాబుల స‌న్నిహిత ద‌ర్శ‌కుడు మృతి
X
ప్ర‌ముఖ సినీ ద‌ర్శ‌కుడు పి. చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి (86) క‌న్నుమూసారు. సోమ‌వారం ఉద‌యం చెన్నైలోని ఆయ‌న స్వ‌గృహంలో తుది శ్వాస విడిచారు. గ‌త కొన్ని రోజులుగా తీవ్ర అస్వ‌స్థ‌త బాధ‌ప‌డుతున్న ఆయ‌న ఆరోగ్యం మ‌రింత క్షీణించ‌డంతో క‌న్నుమూసిన‌ట్లు తెలుస్తోంది. పి.సి రెడ్డి పూర్తి పేరు పందిళ్ల‌ప‌ల్లి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి. ఆయ‌న 80 చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

ఎన్టీఆర్.. కృష్ణ‌.. శోభ‌న్ బాబు.. ఏఎన్నార్ లాంటి స్టార్ హీరోలతో ఎన్నో సినిమాలు తెర‌కెక్కించారు. ఎన్టీఆర్ తో `బ‌డిపంతులు`..సూప‌ర్ స్టార్ కృష్ణ తో `పాడి పంట‌లు` వంటి హిట్ చిత్రాలు తెర‌కెక్కించి టాలీవుడ్ లో త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

భలే అల్లుడు-మానవుడు దానవుడు-విచిత్ర దాంపత్యం-రగిలే గుండెలు- నవోదయం-బంగారు కాపురం-రాజకీయ చదరంగం-అన్నా వదిన-పట్నవాసం-అన్నా చెల్లులు-పెద్దలు మారాలి తదితర హిట్‌ చిత్రాలను ఆయన తెరకెక్కించారు. అయితే చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి ఎక్కువ‌గా కృష్ణ‌తోనే సినిమాలు తెర‌కెక్కించారు. సూప‌ర్ స్టార్ కృష్ణ‌తో ఆయ‌న‌కు ప్ర‌త్యేక‌మైన అనుబంధం ఉంది.

పి.సిరెడ్డి 1933 అక్టోబ‌ర్ 15న నెల్లూరు జిల్లా అనుమ‌సముద్రం గ్రామంలో జ‌న్మించారు. నార‌ప‌రెడ్డి..సుబ్బ‌మ్మ‌ ఆయ‌న త‌ల్లిదండ్రులు. 1959 లో అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా పి.సి సినీ ప్ర‌యాణం మొద‌లైంది. వి. మ‌ధుసూద‌న‌రావు..ఆదుర్తి సుబ్బారావు వ‌ద్ద స‌హాయ ద‌ర్శ‌కుడిగా ప‌నిచేసారు. ` అనురాధ` సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యారు. ఇందులో కృష్ణ‌-విజ‌య నిర్మ‌ల జంట‌గా న‌టించారు. `ఆనురాధ` అప్ప‌ట్లో పెద్ద విజ‌యం సాధించింది. ఆ స‌క్సెస్ త‌ర్వాత కృష్ణ పి.సికి చాలా అవ‌కాశాలు క‌ల్పించారు. ఇద్ద‌రి కాంబినేష‌న్ లో ఎన్నో హిట్ చిత్రాలు తెర‌కెక్కాయి.

ఇక న‌ట‌భూష‌ణ్ శోభ‌న్ బాబుకి మాస్ హీరోగా గుర్తింపు తెచ్చింది పి.సి సినిమాలే. క్లాస్ హీరోగా గుర్తింపు పొందిన శోభ‌న్ బాబుకి మాస్ ఫాలోయింగ్ ఆయ‌న‌తోనే వ‌చ్చింది. ఎన్టీఆర్ తో చేసిన `బ‌డిపంతులు` ఓ ప్ర‌యోగం అని చెప్పొచ్చు. రొమాంటిక్ హీరోగా పేరుగాంచిన రామారావు తో బ‌డ‌పంతులు వేషం వేయించిన ఘ‌న‌త పి.సి దే. దిగ్గ‌జ ద‌ర్శ‌కుడి మృతిప‌ట్ల టాలీవుడ్ ప్ర‌ముఖులు సంతాపాన్ని తెలియ‌జేస్తున్నారు.