Begin typing your search above and press return to search.

బాలయ్యతో ప్రతి సినిమా ఒక ప్రయోగమే!

By:  Tupaki Desk   |   13 March 2022 2:38 AM GMT
బాలయ్యతో ప్రతి సినిమా ఒక ప్రయోగమే!
X
బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్లో రూపొందిన 'అఖండ' డిసెంబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జనవరి 20వ తేదీ నాటికి 50 రోజుల మైలురాయిని దాటిన ఈ సినిమా, నిన్నటితో 100 రోజులను పూర్తిచేసుకుంది.

ఈ సందర్భంగా ఈ సినిమాకి ఈ స్థాయి విజయాన్ని అందించిన కారణంగా ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పేందుకు కర్నూల్ లో 'కృతజ్ఞత సభ'ను ఏర్పాటు చేశారు. ఈ సినిమా టీమ్ అంతా కూడా ఈ వేడుకకు తరలివచ్చారు. భారీ జన సందోహం మధ్య జరిగిన ఈ వేడుకలో బోయపాటి మాట్లాడారు.

"నా మొదటి సినిమా 'భద్ర' .. రెండవ సినిమా 'తులసి' మూడో సినిమా బాలయ్యతో ఓకే అయింది. అప్పటికి ఆయన 90 సినిమాలను చేసి ఉన్నారు. ఆయన ఏం చేయలేదా అని ఆలోచన చేస్తే ఆ చివరి నుంచి ఈ చివరి వరకూ అన్నీ చేసేశారు. పౌరాణికం .. జానపదం .. ఫ్యాక్షన్ అండ్ యాక్షన్ .. ఫ్యామిలీ డ్రామాలు అన్నీ చేసేసి ఉన్నాయి. అలాంటి ఆయనతో ఎలాంటి సినిమా చేయాలి? ఎలా ఆయన అభిమానులను మెప్పించాలి? అనే ఆలోచన చేస్తే వచ్చిన సినిమానే 'సింహా'.

బాలయ్యతో 2009లో 'సింహా'తో నా మొదటి అడుగుపడింది. 2014లో 'లెజెండ్'తో నా రెండో అడుగుపడింది. 2022లో 'అఖండ'తో నా మూడో అడుగుపడింది. 13 సంవత్సరాలుగా మా ప్రయాణం కొనసాగుతోంది. ఈ మూడింటిలో ప్రతి సినిమా ఒక ప్రయోగమే .. దానిని ఆదరించింది మీరే.

ఈ మూడు సినిమాలే నన్ను మీ కుటుంబ సభ్యుడిని చేశాయి. మీలాంటి అభిమానులను సంపాదించుకున్న బాలయ్య బాబు నిజంగా చాలా అదృష్టవంతుడు. అద్భుతమైన ఈ ప్రయాణంలో మాతో పాటు కొనసాగిన నటీనటులకు .. సాంకేతిక నిపుణులకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

ఈ సినిమాను పిల్లల నుంచి పెద్దలవరకూ .. పామరుల నుంచి పండితులవరకూ అంతా ఆదరించడం వల్లనే ఇంతటి అఖండ విజయాన్ని సాధించింది. ఒక మాస్ కమర్షియల్ సినిమాలో ప్రకృతి గురించి .. దైవం గురించి .. ధర్మం గురించి చెప్పే అవకాశం రావడం చాలా రేర్.

అలాంటి ఒక అవకాశం నాకు వచ్చినందుకు .. ఇచ్చినందుకు ఆ భగవంతుడికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. దర్శకుడి ఆలోచనలను నిజం చేసేది నిర్మాతలే. ఆలా నా వెన్నంటి నిలబడిన నిర్మాతలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

ఒక కమర్షియల్ సినిమాను టెస్టు చేయడానికి కావలసిన గౌండ్ రాయలసీమ. ఇక్కడివారికి నచ్చిన ప్రతి సినిమా ప్రపంచం మొత్తానికి నచ్చుతుంది. అందువల్లనే ఈ సినిమా 100 రోజుల ఫంక్షన్ ను రాయలసీమ ప్రజల మధ్యనే చేద్దామని బాలకృష్ణ అన్నారు. నాలుగు సెంటర్లలో ఈ సినిమా 100 డేస్ ఆడితే అందులో మూడు సెంటర్లు మన కర్నూల్ లోనే ఉన్నాయి. బాలయ్యగారితో నా జర్నీ ఎప్పటికీ ఇలాగే సాగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని కోరుకుంటున్నాను" అని చెప్పుకొచ్చాడు.