Begin typing your search above and press return to search.

మరో సెన్సేషన్ కు సిద్ధమవుతున్న తేజ

By:  Tupaki Desk   |   2 Sept 2015 7:08 PM IST
మరో సెన్సేషన్ కు సిద్ధమవుతున్న తేజ
X
టాలీవుడ్ లో సెన్సేషన్ అనే పదానికి సరైన అర్థం చెప్పిన దర్శకుల్లో తేజ ఒకడు. అతడి తొలి సినిమా 'చిత్రం' ఓ పెద్ద సెన్సేషన్. ఆ తర్వాత నువ్వు నేను, జయం సినిమాలు కూడా అంత కంటే పెద్ద సెన్సేషనే అయ్యాయి. మహేష్ బాబుతో చేసిన నిజం సినిమా ఫ్లాపైనప్పటికీ.. ప్రిన్స్ ను అలాంటి క్యారెక్టర్లో చూపించడం అప్పటికి సెన్సేషనే అయింది. ఐతే వరుసగా ఫ్లాపులు ఎదురవడంతో ఈ సెన్సేషనల్ డైరెక్టర్ నెమ్మది గా సైడైపోయాడు. ఇప్పుడు 'హోరాహోరీ' అనే సినిమాతో మరో సంచలనం సృష్టిస్తానని నమ్మకంగా ఉన్నాడు తేజ. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకెళ్లిపోయే తేజ... 'హోరాహోరీ' ఫలితం కోసం ఎదురు చూడకుండా.. తన తర్వాతి సినిమాకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.

ఈసారి తేజ టాలీవుడ్ లో ఎవ్వరూ టచ్ చేయని సబ్జెక్టు మీద దృష్టిపెట్టినట్లు సమాచారం. కృత్రిమ అవయవాలకు సంబంధించి 'బయోనిక్స్' మీద ఆయన పరిశోధనలు జరుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే యుఎస్ కు వెళ్లి దీని మీద అధ్యయనం చేసి వచ్చాడట తేజ. అక్కడి నుంచి కొన్ని పరికరాల్ని ఇంటికి తెప్పించుకుని వాటి మీద పరిశీలన జరుపుతున్నాడట. ప్రత్యర్థుల దాడిలో చేతులు కాళ్లు కోల్పోయిన వ్యక్తి.. సహజంగా అనిపించే కృత్రిమ అవయవాలు అమర్చుకుని.. తననీ స్థితికి తీసుకొచ్చిన శత్రువులపై ప్రతీకారం తీర్చుకునే నేపథ్యంలో ఈ కథ సాగుతుందని సమాచారం. ప్రస్తుతం బయోనిక్స్ గురించి తెలుసుకుంటూనే.. స్క్రిప్టు కూడా పూర్తి చేస్తున్నాడట. నిర్మాత ఎవరన్నది ఇంకా ఖరారవలేదు. 'హోరాహోరీ' మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్న తేజ.. ఆ సినిమా హిట్టయితే నిర్మాతను పట్టుకోవడం పెద్ద పని కాదని భావిస్తున్నాడు.