Begin typing your search above and press return to search.

మళ్ళీ డైరెక్ట్ ఓటీటీ రిలీజులు ఊపందుకోనున్నాయా..?

By:  Tupaki Desk   |   4 Jun 2021 10:00 AM IST
మళ్ళీ డైరెక్ట్ ఓటీటీ రిలీజులు ఊపందుకోనున్నాయా..?
X
కరోనా ఫస్ట్ వేవ్ నుంచి బయటపడి ఇండస్ట్రీ మళ్ళీ మామూలు స్థితికి వచ్చిందనుకుంటున్న సమయంలో సెకండ్ వేవ్ వచ్చి ఊహించని దెబ్బ కొట్టింది. వైరస్ విజృంభనతో థియేటర్స్ అన్నీ మూతపడి సినిమాలు వాయిదా పడుతున్నాయి. దీంతో గతేడాది పరిస్థితులు మళ్ళీ పునరావృతం అయ్యాయి. ఇప్పటికే థియేటర్లు మూతబడి నెల రోజులు గడిచింది. పాజిటివ్ కేసులు తగ్గుతున్నప్పటికీ, సినిమా హాళ్లు ఎప్పుడు తెరుస్తారనే దాని మీద క్లారిటీ రావడం లేదు. కొందరు ఆగస్టులో అంటే.. మరికొందరు అక్టోబర్ లో అంటే.. ఇంకొందరు ఏడాది చివర వరకూ కష్టమే అంటున్నారు.

అయితే థియేటర్స్ ఎప్పుడు రీ ఓపెన్ చేసినా వంద శాతం సీటింగ్ ఆక్యుపెన్సీకి అనుమతులు ఇవ్వడానికి సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పెద్ద సినిమాలు థియేట్రికల్ రిలీజ్ కోసం ఇంకొన్నాళ్లు వేచి చూడాలని నిర్ణయించుకుంటే.. చిన్న మీడియం బడ్జెట్ సినిమాలు ఓటీటీల వైపు చూస్తున్నాయి. గతేడాది కోవిడ్ పరిస్థితులు అంచనా వేయలేకపోవడంతో చాలా మంది మేకర్స్ థియేటర్స్ కోసం ఎదురుచూశారు. చివరకు ఇప్పట్లో కష్టమే అని భావించి డిజిటల్ రిలీజ్ కు మొగ్గుచూపారు. కానీ ఈసారి మాత్రం థియేటర్లు మూతబడిన వెంటనే డైరెక్ట్ ఓటీటీ విడుదల చేయడం మొదలుపెట్టారు.

థియేట్రికల్ రిలీజ్ ప్రకటించిన 'ఏక్ మినీ కథ' అమెజాన్ ప్రైమ్ లో.. 'థ్యాంక్ యు బ్రదర్' సినిమా ఆహా ఓటీటీలో విడుదల అయ్యాయి. వీటికి మంచి ప్రేక్షకాదరణ లభించడంతో మరికొన్ని సినిమాలు ఓటీటీలతో డీల్ చేసుకోడానికి రెడీ అయ్యారని తెలుస్తోంది. సాయితేజ్ నటిస్తున్న 'రిపబ్లిక్'.. నితిన్ 'మేస్ట్రో'.. తేజ సజ్జా 'ఇష్క్-నాట్ ఏ లవ్ స్టొరీ'.. వైష్ణవ్ తేజ్ - క్రిష్ సినిమాలతో పాటుగా సత్యదేవ్ 'తిమ్మరసు'.. విశ్వక్ సేన్ 'పాగల్' చిత్రాల మేకర్స్ తో ఓటీటీ ప్రతినిధులు చర్చలు జరుగుతున్నారని టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో ఏ సినిమాకు డిజిటల్ రిలీజ్ కు మొగ్గు చూపుతాయో చూడాలి.