Begin typing your search above and press return to search.

రిలీజ్‌ కి ముందే 150కోట్లు లాభం

By:  Tupaki Desk   |   14 Aug 2015 6:50 AM GMT
రిలీజ్‌ కి ముందే 150కోట్లు లాభం
X
కింగ్‌ ఖాన్‌ షారూక్‌ నటించిన సినిమా అంటేనే బయ్యర్లు పోటీ పడుతుంటారు. రిలీజ్‌ కి ముందే అడ్వాన్సుల రూపంలోనే నిర్మాతలకు బోలెడంత లాభాల పంట పండుతుంది. దేశ విదేశాల్లో డిస్ట్రిబ్యూటర్ల నుంచి కోట్లలో దండుకోవచ్చు. ముందే శాటిలైట్‌ కి గిరాకీ ఉంటుంది. పైగా ఈసారి షారూక్‌ - కాజోల్‌ జంట నటించే సినిమా అంటూ క్రేజుని పీక్స్‌ కి తెచ్చారు. దిల్‌ వాలే దుల్హానియా లేజాయేంగా మ్యాజిక్‌ ని ఈ జోడీ రిపీట్‌ చేస్తోందన్న ప్రచారం కలిసొచ్చింది. అందుకే దిల్‌వాలే రిలీజ్‌ కి ముందే 150కోట్ల లాభాన్ని ఆర్జించింది.

అదెలాగంటే..?

రోహిత్‌ శెట్టి ప్రొడక్షన్స్‌ రెడ్‌ చిల్లీస్‌(షారూక్‌ సంస్థ)తో కలిసి ఈ చిత్రానికి పెట్టిన పెట్టుబడి 75కోట్లు. ఇప్పటికే ఇండిపెండెంట్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ నుంచి దాదాపు 130కోట్లు అమ్మకాల రూపంలో వచ్చింది. ఓవర్సీస్‌ నుంచి మినిమం 40 నుంచి 50కోట్లు రాబోతోంది. ఇప్పటికే యశ్‌ రాజ్‌ ఫిలింస్‌ ఆ మొత్తాన్ని చెల్లించేందుకు రెడీ అవుతోంది. ఈ మొత్తం కలిపితే కేవలం పంపిణీదారుల నుంచే 170కోట్లు పైగా వస్తోంది. ఇక సోని నుంచి మ్యూజిక్‌ హక్కుల రూపంలో మరో 20 నుంచి 30కోట్లు రానుంది. ఇక శాటిలైట్‌, టీవీ హక్కుల రూపంలో మరో 45కోట్లు అందుకోబోతున్నారు. ఇలా చూస్తే ఈ ప్రాజెక్టు ఇప్పటికే 230కోట్లకు అమ్ముడైనట్టే. అంటే పెట్టుబడులు 75కోట్లు తీసేస్తే, మిగిలే లాభం 150కోట్లు అన్నమాట! ఇక షారూక్‌ సినిమా అంటేనే 500కోట్ల క్లబ్‌ సినిమా కిందే లెక్క.. ఆ మేరకు పంపిణీదారులకు లాభాలే లాభాలు.