Begin typing your search above and press return to search.

మలయాళ నటి కిడ్నాప్ కేసులో కీలక మలుపు

By:  Tupaki Desk   |   1 Aug 2017 11:44 AM GMT
మలయాళ నటి కిడ్నాప్ కేసులో కీలక మలుపు
X
మలయాళ నటి కిడ్నాప్.. లైంగిక దాడి కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక సాక్షి అవుతాడనుకున్న హీరో దిలీప్ మేనేజర్ అప్పుణ్ని ఎట్టకేలకు పోలీసులకు లొంగిపోయాడు. దిలీప్ అరెస్టయినప్పటి నుంచి అప్పుణ్ని కనిపించట్లేదు. అతను కేరళ విడిచి ఎక్కడికో వెళ్లిపోయాడు. తన సన్నిహితులందరితో కాంటాక్ట్స్ కట్ చేసి గుర్తు తెలియని ప్రాంతానికి వెళ్లిపోయాడు. అతను దొరికితే కేసుకు సంబంధించి అనేక కీలక విషయాలు తెలుస్తాయని పోలీసులు భావించారు. అతడి కోసం తమిళనాడు సహా పలు ప్రాంతాల్లో గాలించారు. ఐతే పోలీసులు పట్టుకునే లోపే.. అప్పుణ్ని వాళ్ల దగ్గరికొచ్చి లొంగిపోయాడు.

దిలీప్ కు సంబంధించిన సినిమా పనులే కాక.. అతడి రియల్ ఎస్టేట్ బిజినెస్.. ఇతర వ్యక్తిగత వ్యవహారాల్ని కూడా అప్పుణ్ని చక్కబెడతాడని సమాచారం. హీరోయిన్ కిడ్నాప్ వ్యవహారానికి సంబంధించి కూడా అప్పుణ్నికి చాలా విషయాలు తెలుసని.. ఆ సంఘటన జరిగే ముందు దిలీప్ ఎవరెవరితో సంప్రదింపులు జరిపాడు.. ఏం మాట్లాడాడు.. కిడ్నాప్ సూత్రధారి అయిన పల్సర్ సునితో డీల్స్.. ఈ విషయాలన్నీ అప్పుణ్నికి తెలుసని భావిస్తున్నారు. నటిపై కార్లో దాడి జరిగినపుడు తీసిన ఫొటోలున్న మెమొరీ కార్డు సంగతి కూడా అప్పుణ్నికి తెలిసి ఉంటుందని అంటున్నారు. దీంతో దిలీప్ మరింతగా చిక్కుల్లో పడ్డట్లే. మరోవైపు ఒకటికి రెండుసార్లు తనకు స్థానిక కోర్టు బెయిల్ నిరాకరించిన నేపథ్యంలో తన లాయర్ల ద్వారా సుప్రీం కోర్టును సంప్రదించాలని దిలీప్ భావిస్తున్నట్లు సమాచారం.