Begin typing your search above and press return to search.

ఐసీయూలో ప్రముఖ నటుడు!

By:  Tupaki Desk   |   30 Jun 2021 1:30 PM IST
ఐసీయూలో ప్రముఖ నటుడు!
X
ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ మరోసారి ఆసుప‌త్రిలో చేరారు. ఈ నెల 6వ తేదీన ఛాతిలో నొప్పి, శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బంది కార‌ణంగా ఆసుప‌త్రిలో అడ్మిట్ అయ్యారు. ఆ త‌ర్వాత కోలుకున్నారు. ఇప్పుడు మ‌రోసారి ఆసుప‌త్రిలో చేరారు. ఈ 98 సంవ‌త్స‌రాల న‌ట దిగ్గ‌జానికి.. ఈ సారి శ్వాస సంబంధిత స‌మ‌స్య ఎక్కువ‌గా త‌లెత్తిన‌ట్టు స‌మాచారం.

ప్ర‌స్తుతం ఆయ‌న‌ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్న‌ట్టు తెలుస్తోంది. అయితే.. ఆయ‌న ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ లేదని, అంతా స‌వ్యంగానే ఉంద‌ని వైద్యులు తెలిపారు. గ‌తంలో ముంబైలోని హిందూజా ఆసుప‌త్రిలో దిలీప్ కుమార్ చికిత్స పొందారు. ఆ స‌మ‌యంలో లంగ్స్ లో స‌మ‌స్య‌కు కార‌ణ‌మైన ఫ్లూయిడ్ ను తొల‌గించిన‌ట్లు వైద్యులు తెలిపారు. జూన్ 11న ఆయ‌న డిశ్చార్జ్ అయ్యారు. అలాంటిది.. మ‌ళ్లీ ఐసీయూలో చేర‌డంతో అభిమానులు ఆందోళ‌న‌కు గుర‌య్యారు.

బాలీవుడ్ లో సూప‌ర్ స్టార్ గా వెలుగొందిన దిలీప్ కుమార్‌.. ప‌ద్మ‌భూష‌ణ్‌, దాదాసాహెబ్ ఫాల్కే, ఫిలింఫేర్ అవార్డుల‌ను ఆయ‌న అందుకున్నారు. 2000 సంవ‌త్స‌రంలో రాజ్య‌స‌భ‌కు సైతం నామినేట్ అయ్యారు. 1922లో ప్ర‌స్తుత‌ పాకిస్థాన్ లోని పెషావ‌ర్ లో జ‌న్మించిన దిలీప్ కుమార్‌.. దేశ విభ‌జ‌న అనంత‌రం భార‌త్ లో ఉండ‌డానికే మొగ్గు చూపారు.

‘కింగ్ ఆఫ్ ట్రాజెడీ’గా గుర్తింపు తెచ్చుకున్న దిలీప్.. ఎన్నో అద్భుత‌మైన చిత్రాల్లో న‌టించారు. దేవ్ దాస్‌, గంగాజ‌ము, మొఘ‌ల్ ఏ ఆజం వంటి అద్భుత‌మైన చిత్రాల్లో జీవించారు. త‌న‌దైన న‌ట‌న‌తో దేశ‌వ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల‌ను సొంతం చేసుకున్నారు.