Begin typing your search above and press return to search.

మాట మీద నిలబడ్డ దిల్ రాజు..!

By:  Tupaki Desk   |   12 July 2022 4:34 AM GMT
మాట మీద నిలబడ్డ దిల్ రాజు..!
X
ఇటీవల కాలంలో ఏ సినిమా అయినా థియేట్రికల్ రిలీజ్ చేయబడిన మూడు నాలుగు వారాలకే ఓటీటీలో ప్రత్యక్షం అవుతున్న సంగతి తెలిసిందే. చిన్న మీడియం రేంజ్ చిత్రాల సంగతి పక్కన పెడితే.. పెద్ద సినిమాలు కూడా నెల తిరక్కుండానే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుండటంతో థియేటర్ వ్యవస్థ మీదే ప్రభావం పడే ప్రమాదం ఏర్పడింది. ఓటీటీలకు అలవాటు పడిపోయిన జనాలు.. సినిమా హాళ్ల వైపు చూడటమే తగ్గించేశారు.

ఇలాంటి పరిస్థితుల్లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందిన 'ఎఫ్ 3' చిత్రాన్ని సాధారణ టికెట్ రేట్లతో రిలీజ్ చేయడానికి నిర్మాత దిల్ రాజు ముందుకొచ్చారు. అయితే ఫస్ట్ వీకెండ్ తర్వాత వసూళ్ళు డ్రాప్ అవ్వడంతో ఈ సినిమా కూడా మూడు వారాల్లోనే ఓటీటీలో వస్తుందంటూ వార్తలు గుప్పుమన్నాయి. అయితే మేకర్స్ మాత్రం వాటిని ఖండించారు.

"ఎఫ్ 3" సినిమా నాలుగు వారాల్లో ఓటీటీకి రాదని.. ఎనిమిది వారాల తర్వాతే వస్తుందని దర్శకుడు అనిల్ రావిపూడి మీడియా ముఖంగా తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోను ఎర్లీ స్ట్రీమింగ్ కాదని.. ముందుగా నిర్ణయించుకొన్న ప్రకారమే 50 రోజుల తర్వాతే ఓటీటీలోకి తీసుకొస్తామని దిల్ రాజు స్పష్టం చేశారు.

ఈ మధ్య అలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చిన సినిమాలు కూడా ఎర్లీగానే స్ట్రీమింగ్ చేయబడిన నేపథ్యంలో.. దిల్ రాజు కూడా అదే బాటలో వెళ్తాడని అందరూ అనుకున్నారు. అయితే స్టార్ ప్రొడ్యూసర్ మాత్రం చెప్పినట్లుగానే 'F3' సినిమాని 50 రోజుల తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు.

'ఎఫ్ 3' చిత్రాన్ని జూలై 22న ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు. డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్.. ఈ మేరకు అఫిషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చింది. థియేటర్ సిస్టమ్ మీద ఓటీటీల ఎఫెక్ట్ పడుతుందని ఆందోళన చెందుతున్న తరుణంలో.. దిల్ రాజు చెప్పిన మాటకు కట్టుబడి ఇతర నిర్మాతలకు మార్గదర్శకంగా నిలిచాడని చెప్పాలి.

టాలీవుడ్ లో 'పుష్ప: ది రైజ్' - 'రాధేశ్యామ్' - 'ఆచార్య' - 'సర్కారు వారి పాట' (పే పర్ వ్యూ) - 'విరాట పర్వం' - 'అంటే సుందరానికీ' వంటి సినిమాలు నెల తిరక్కుండానే ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యాయి. 'ఆర్.ఆర్.ఆర్' వంటి భారీ చిత్రం మాత్రం 50 రోజులకు ఓటీటీలోకి వచ్చింది. ఇప్పుడు 'ఎఫ్ 3' కూడా 8 వారాల తర్వాతే డిజిటల్ స్ట్రీమింగ్ కి రెడీ అవడం గమనార్హం.

కాగా, 'ఎఫ్ 3' అనేది బ్లాక్ బస్టర్ 'ఎఫ్ 2' ఫ్రాంచైజీలో తెరకెక్కిన సినిమా. విక్టరీ వెంకటేష్ మరియు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా.. తమన్నా భాటియా - మెహ్రీన్ కౌర్ హీరోయిన్లుగా నటించారు. సోనాల్ చౌహాన్ ప్రత్యేక పాత్రలో నటించగా.. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ లో కనిపించింది. సునీల్ - వెన్నెల కిషోర్ - రాజేంద్ర ప్రసాద్ - మురళీ శర్మ - అలీ ఇతర పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం సమకూర్చారు.

మే 27న థియేటర్లలోకి వచ్చిన 'ఎఫ్ 3' సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 53.94 కోట్ల షేర్ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ.70.94 కోట్ల షేర్ తో రూ. 134 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది. థియేటర్లలో నవ్వులు పూయించి మంచి వసూళ్ళు సాధించిన ఈ మల్టీస్టారర్.. డిజిటల్ వేదికలలో ఎలాంటి స్పందన తెచ్చుకుంటుందో చూడాలి.