Begin typing your search above and press return to search.

సమ్మర్ లో పెద్ద సినిమాల మధ్య క్లాష్ వచ్చే ప్రసక్తే లేదంటున్న దిల్ రాజు

By:  Tupaki Desk   |   27 Jan 2022 11:30 AM GMT
సమ్మర్ లో పెద్ద సినిమాల మధ్య క్లాష్ వచ్చే ప్రసక్తే లేదంటున్న దిల్ రాజు
X
కరోనా థర్డ్ వేవ్ ప్రభావం వల్ల సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాలేవీ పోటీ పడలేదు. పండక్కి రావలనుకున్న 'ఆర్.ఆర్.ఆర్' 'రాధేశ్యామ్' 'భీమ్లా నాయక్' వంటి చిత్రాలు వాయిదా పడ్డాయి. దీంతో 2022 సమ్మర్ లో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తీవ్ర పోటీ ఏర్పడే పరిస్థితి వచ్చింది.

సంక్రాంతి క్లాష్ ని నివారించడానికి వాయిదా వేసుకున్న 'సర్కారు వారి పాట' చిత్రాన్ని ఏప్రిల్ 1న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. అదే డేట్ కి వస్తున్నట్లు 'ఆచార్య' అధికారికంగా అనౌన్స్ చేశారు. ఫిబ్రవరి 25న విడుదల కావాల్సిన 'భీమ్లా నాయక్' సినిమా కూడా ఇప్పుడు పరిస్థితులు సానుకూలంగా లేకపోవడంతో మరో తేదీ కోసం చూస్తోంది.

RRR చిత్రాన్ని మార్చి 18న లేదా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. 'రాధేశ్యామ్' చిత్రాన్ని మార్చి మొదటి రెండు వారాల్లో లేదా ఏప్రిల్ ఫస్ట్ వీకెండ్ లో థియేట్రికల్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఏప్రిల్ 14న 'కేజీయఫ్ 2' 'లాల్ సింగ్ చద్దా' 'బీస్ట్' వంటి సినిమాల విడుదలలు ఉన్నాయి.

'ఎఫ్ 3' చిత్రాన్ని ఏప్రిల్ 28న థియేటర్లలోకి తీసుకొస్తామని మేకర్స్ ఇది వరకే ప్రకటించారు. మధ్యలో 'వలిమై' 'థాంక్యూ' వంటి సినిమాల విడుదల తేదీలను ఖరారు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇలా సమ్మర్ సీజన్ లోనే క్రేజీ చిత్రాలన్నీ థియేటర్ల కోసం క్యూ కడుతున్నాయి. దీంతో మరోసారి క్లాష్ ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఇదే విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దిల్ రాజు వద్ద ప్రస్తావించగా.. వేసవిలో సినిమాల మధ్య క్లాష్ ఉండే అవకాశం లేదని కూల్ గా సమాధానమిచ్చారు. ''సంక్రాంతి సీజన్ లో సర్దుబాటు చేసుకోవడం టఫ్.. కానీ సమ్మర్ కి కాదు. ఎందుకంటే ఇది 50 రోజుల సీజన్. ఇది మే నెలాఖరు వరకు ఉంటుంది. మేము ప్రతి రెండు వారాలకు ఒక భారీ చిత్రాన్ని విడుదల చేసుకోవచ్చు'' అని దిల్ రాజు అభిప్రాయపడ్డారు.

''సమ్మర్ లో ఎన్ని సినిమాలైనా రిలీజ్ చేసుకోడానికి అవకాశం ఉంటుంది. సమస్యల్లా మూడు రోజులు ఉండే సంక్రాంతి సీజన్ లోనే. ఇప్పుడు RRR మార్చి 18న వస్తే అన్ని థియేటర్లలో వేస్తాం. మొదటి వారంలో కొన్ని థియేటర్లు తగ్గుతాయి. రెండో వారానికి ఆటోమేటిక్ గా ఇంకా తగ్గుతాయి. ఈ థియేటర్లన్నీ మరో సినిమాకు అందుబాటులోకి వస్తాయి''

''రెండు వారాల గ్యాప్ ఉంటుంది కాబట్టి ఇబ్బందేమీ ఉందడు. డేట్స్ క్లాష్ వచ్చినా మాట్లాడుకొని సర్దుబాటు చేసుకుంటాం. స్టార్ హీరోలందరూ దీనిని అర్థం చేసుకుంటారు'' అని యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్‌ సభ్యుడైన దిల్ రాజు అన్నారు. దీనిని బట్టి సమ్మర్ లో క్లాష్ లేకుండా రెండు వారాల గ్యాప్ తో పెద్ద సినిమాల విడుదలకు ప్లాన్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.