Begin typing your search above and press return to search.

ఓవర్ ది టాప్ అనిపించుకుంటున్న డిజిటల్ వేదికలు..!

By:  Tupaki Desk   |   28 Jun 2022 4:23 AM GMT
ఓవర్ ది టాప్ అనిపించుకుంటున్న డిజిటల్ వేదికలు..!
X
కరోనా పాండమిక్ నేపథ్యంలో డిజిటల్ వేదికల సందడి మొదలైంది. థియేటర్లు క్లోజ్ అవడంతో వినోదం కోరుకునే ప్రేక్షకులు ఓటీటీలను ఆశ్రయించారు. ఆ సమయంలోనే నెట్ ఫ్లిక్స్ - అమెజాన్ ప్రైమ్ - హాట్ స్టార్ - జీ5 వంటి పలు ఓటీటీలు అందరికీ పరిచయమయ్యాయి. ఇవన్నీ తెలుగు మీద స్పెషల్ ఫోకస్ పెట్టి ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ ను అందించడానికి పోటీ పడ్డాయి. ఈ క్రమంలో 100 శాతం తెలుగు కంటెంట్ తో అలరించడానికి 'ఆహా' ఓటీటీ కూడా వచ్చింది.

నిజానికి భారతీయ ప్రేక్షకులకు అన్నిటి కంటే ముందుగా బాగా దగ్గరైన ఓటీటీ అంటే అమెజాన్ ప్రైమ్ వీడియో అని చెప్పొచ్చు. కోవిడ్ టైంలో సరికొత్త సినిమాలతో డైరెక్ట్ ఓటీటీ రిలీజులతో అందరినీ ఆకట్టుకుంది. ఏ పెద్ద సినిమా వచ్చినా ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుంటూ కొన్నాళ్లపాటు టాప్ ప్లేస్ లో దూసుకుపోయింది. అయితే నెట్ ఫ్లిక్స్ - ఆహా - జీ5 ఓటీటీల నుంచి గట్టి పోటీ ఎదురవడంతో.. కిందికి పడిపోయే పరిస్థితి వచ్చింది.

నెట్ ఫ్లిక్స్ కాస్త ఆలస్యంగా పెద్ద సినిమాలపై దృష్టిసారించినప్పటికీ.. ఈ ఏడాదిలో 'రాధే శ్యామ్' (హిందీ) - 'బీస్ట్' - 'గంగూబాయి కతియావాడి' - 'జన గణ మన' - 'డాన్' - RRR (హిందీ) వంటి సినిమాలను కొనుగోలు చేయగలిగింది. కేవలం 'ఆర్.ఆర్.ఆర్' హిందీ రైట్స్ మాత్రమే తీసుకున్నప్పటికీ.. ఈ సినిమా గ్లోబల్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించడం దిగ్గజ ఓటీటీకి బాగా ప్లస్ అయింది.

ఇక 'మేజర్' 'విరాట పర్వం' 'అంటే సుందరానికి' వంటి సినిమాలతో పాటుగా త్వరలో విడుదల కానున్న 'పక్కా కమర్షియల్‌' చిత్రాన్ని కూడా నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. తెలుగు ఓటీటీ ఆహా సైతం కొత్త సినిమాలతో ఆడియన్స్ ను తనవైపు తిప్పుకుంటోంది. 'డీజే టిల్లు' 'భీమ్లా నాయక్' చిత్రాలతో పాటుగా 'అశోకవనంలో అర్జున కల్యాణం' వంటి పలు సినిమాలు వీక్షకులను అలరించాయి.

జీ5 ఓటీటీ కూడా ఇటీవల కాలంలో తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకుంటోంది. ఈ ఏడాది 'బంగార్రాజు' 'వలిమై' 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమాలతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇదే క్రమంలో ఇటీవల RRR సినిమాకు సంబంధించిన నాలుగు దక్షిణాది వెర్షన్ల స్ట్రీమింగ్ తో జాతీయ స్థాయిలో సత్తా చాటింది.

అలానే 'అఖండ' 'భీమ్లా నాయక్' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న డిస్నీ + హాట్ స్టార్.. త్వరలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ 'విక్రమ్' మూవీని స్ట్రీమింగ్ చేయబోతోంది. ఇలా ప్రతి ఒక్క ఓటీటీ పోటాపోటీగా క్రేజీ మూవీస్ ను కొనుగోలు చేస్తున్నాయి. ఒకప్పుడు భారీ చిత్రాలకు ప్రధాన పోటీదారుగా ఉండే అమెజాన్ ప్రైమ్ ను వెనక్కి నెట్టి ముందుకు దూసుకెళ్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో ఏ ఓటీటీ టాప్ లో నిలుస్తుందో చూడాలి.