Begin typing your search above and press return to search.

బాలయ్య ని పిలవలేదా..? పిలిచినా నటసింహం వెళ్లలేదా..?

By:  Tupaki Desk   |   16 Aug 2021 7:00 PM IST
బాలయ్య ని పిలవలేదా..? పిలిచినా నటసింహం వెళ్లలేదా..?
X
తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన సమావేశాలకు తనను పిలవకుండా.. నిర్లక్ష్యం చేస్తున్నారంటూ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ పలు సందర్భాల్లో నిరాశను వ్యక్తం చేయడం మనం చూశాం. గతంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలతో ఇండస్ట్రీ పెద్దలు సమావేశమైనప్పుడు.. చిరంజీవి ఇంట్లో మీటింగ్ పెట్టుకున్నట్లు తనని పిలవలేదని బాలయ్య అసహనానికి గురైన సంగతి తెలిసిందే. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి టాలీవుడ్ పెద్దలకు పిలుపు వచ్చింది. ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి సుముఖత వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో చిరంజీవి అధ్యక్షతన టాలీవుడ్ ప్రముఖులు ఈరోజు సోమవారం సమావేశం అయ్యారు. ఏపీ ముఖ్యమంత్రితో భేటీలో ఏ అంశాలు ప్రస్తావించాలి.. ఏమేమి సమస్యలపై చర్చించాలి అనే విషయంపై ఈ మీటింగ్ లో మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో చిరంజీవి - అక్కినేని నాగార్జున - సోనాలి నారంగ్ - నారాయణ దాస్ నారంగ్ - అల్లు అరవింద్‌ - సురేశ్‌ బాబు - దిల్‌ రాజు - సుప్రియ - వి.వి.వినాయక్‌ - కొరటాల శివ - మెహర్‌ రమేశ్‌ - ఆర్‌.నారాయణమూర్తి - ఎన్వీ ప్రసాద్ - సి కళ్యాణ్ - కె.ఎస్.రామారావు - స్రవంతి రవి కిషోర్ - యూవీ క్రియేషన్స్ విక్కీ - వంశీ - జెమిని కిరణ్ - భోగవల్లి బాబీతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

అయితే ఇందులో బాలకృష్ణ కనిపించకపోవడం మరోసారి చర్చనీయాంశం అయింది. కరోనా వల్ల తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన ఇండస్ట్రీ సమస్యలపై చర్చించే సమావేశంలో సీనియర్ హీరో బాలయ్య ఎందుకు లేదని నందమూరి అభిమానులు ఆలోచిస్తున్నారు. బాలకృష్ణ ను మళ్ళీ ఇండస్ట్రీ మీటింగ్ కి ఆహ్వానించలేదా? లేదా పిలిచినా నటసింహం వెళ్లలేదా? అని కామెంట్స్ చేస్తున్నారు.