Begin typing your search above and press return to search.

అందగాడైన అబ్బాస్ అన్ని కష్టాలు పడ్డాడా?!

By:  Tupaki Desk   |   7 Feb 2022 8:30 AM GMT
అందగాడైన అబ్బాస్ అన్ని కష్టాలు పడ్డాడా?!
X
తమిళ ఇండస్ట్రీని చాలామంది హీరోలు ఏలేశారు. తిరుగులేని క్రేజ్ తో ఎదురులేని స్టార్ డమ్ ను చాలామంది చూశారు. అయితే హ్యాండ్సమ్ లుక్ తో మనసులు కొల్లగొట్టేసిన హీరోల పేర్లు చెప్పమని అడిగితే, ముగ్గురి పేర్లను మాత్రం చాలామంది చెబుతారు. ఆ ముగ్గురే అబ్బాస్ .. అజిత్ .. అరవింద్ స్వామి. ఈ ముగ్గురి పేర్లు కూడా 'A' అనే అక్షరంతో మొదలుకావడం విశేషం. ప్రస్తుతం అజిత్ .. అరవింద్ స్వామి ఇద్దరూ కూడా వెండితెరపై తమ జోరును కొనసాగిస్తూనే ఉన్నారు. కానీ అబ్బాస్ మాత్రం సినిమాలకి చాలా దూరమైపోయాడు.

1996లో 'కాదల్ దేశం' అనే సినిమాతో తమిళ తెరకి అబ్బాస్ పరిచయమయ్యాడు. 'ప్రేమదేశం' పేరుతో ఈ సినిమా తెలుగులోను విడుదలైంది. ఈ సినిమాలో అబ్బాస్ ను చూసిన ప్రేక్షకులు 'అందగాడు' అంటూ ఆయనకి సర్టిఫికెట్ ఇచ్చేశారు. అబ్బాస్ హైట్ .. ఆయన ఫిజిక్ చూసి ఇకపై ఆయన జోరు కొనసాగడం ఖాయమని అంతా అనుకున్నారు. అబ్బాయిలు ఆయన హెయిర్ స్టైల్ ను ఫాలో అయితే, అమ్మాయిలు పొలోమంటూ మనసులు పారేసుకున్నారు. ఆ తరువాత ఆయన తెలుగులో చేసిన 'ప్రియా ఓ ప్రియా' సినిమా కూడా హిట్ కావడంతో ఆయన క్రేజ్ మరింత పెరిగిపోయింది.

కెరియర్ తొలినాళ్లలోనే అమ్మాయిలలో విపరీతమైన ఫాలోయింగ్ ను తెచ్చుకున్న హీరోల్లో అబ్బాస్ ఒకరిని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఆయన తనకి వచ్చిన హిట్లను .. క్రేజ్ ను బట్టి ఆ తరువాత సినిమాలను ప్లాన్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. హీరోగా సరైన కథలను ఎంచుకోకపోగా, సెకండ్ హీరోగా .. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వెళ్లాడు. అలా ఆయన చేసిన 'రాజహంస' .. 'శ్వేతనాగు' సినిమాలు పరాజయాలను చవిచూశాయి. ఆ తరువాత ఆయన ఎక్కువగా తమిళ .. మలయాళ .. కన్నడ సినిమాలపై దృష్టిపెట్టేసి అటువైపు వెళ్లాడు.

ఆ తరువాత ఆయన పూర్తిగా తన రూట్ ను మార్చేస్తూ న్యూజిలాండ్ వెళ్లాడు. అక్కడ కొంతకాలం పాటు పెట్రోల్ బంక్ లో పనిచేసిన ఆయన, ఆ తరువాత బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించిన పనులు కూడా చేశాడట. అలా అక్కడ పనిచేసిన అనుభవంతో ప్రస్తుతం అదే ఫీల్డ్ లో కొనసాగుతూ, మరో వైపున మోటివేషనల్ స్పీకర్ గా కూడా వర్క్ చేస్తున్నాడు. ఇక అబ్బాస్ ప్రకృతి ప్రేమికుడు .. ఏ మాత్రం తీరిక దొరికినా బైక్ పై సరదాగా ఎక్కడెక్కడికో వెళ్లి వస్తుంటాడు. అయితే వివిధ భాషల్లో 50 సినిమాల వరకు చేసిన ఆయన, హఠాత్తుగా సినిమాలను ఎందుకు వదిలేయవలసి వచ్చింది?

ఇతర దేశానికి వెళ్లి అక్కడ అంతగా అవస్థలు ఎందుకు పడవలసి వచ్చింది? అనేది అర్థం కాని ప్రశ్న. ఏదేమైనా అబ్బాస్ వంటి ఒక మంచి ఆర్టిస్ట్ వెండితెరకి దూరం కావడం ఆయన అభిమానులకు అసంతృప్తిని కలిగించే విషయమే