Begin typing your search above and press return to search.

పవన్‌ కు హిట్‌ ఇస్తే బన్నీ పిలుపు ఖాయం!!

By:  Tupaki Desk   |   5 April 2021 7:30 AM GMT
పవన్‌ కు హిట్‌ ఇస్తే బన్నీ పిలుపు ఖాయం!!
X
అల్లు అర్జున్‌ హీరోగా వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో 'ఐకాన్‌' సినిమా ప్రకటన వచ్చి దాదాపు మూడేళ్లు అవుతుంది. అల వైకుంఠపురంలో సినిమాకు ముందే ఐకాన్‌ పట్టాలెక్కే అవకాశం ఉందనుకున్నారు. కాని దర్శకుడు వేణు శ్రీరామ్‌ పై నమ్మకం కలగక పోవడంతో సినిమా ఆలస్యం అవుతుందని కొందరు దిల్‌ రాజుతో పారితోషికం విషయంలో ఒప్పందం కుదరలేదంటూ మరి కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు. కారణం ఏదైనా ఐకాన్‌ సినిమా ఆలస్యం అవుతోంది. ఇప్పుడు మరోసారి ఐకాప్‌ సినిమా వార్తల్లో నిలిచింది. దర్శకుడు వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో రూపొందిన 'వకీల్‌ సాబ్‌' చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. బాలీవుడ్‌ హిట్‌ మూవీ పింక్‌ ను కమర్షియల్‌ టచ్‌ ఇచ్చి రీమేక్‌ చేసి వకీల్‌ సాబ్‌ గా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. వకీల్‌ సాబ్‌ రీమేక్‌ అయినా కూడా సక్సెస్‌ అయితే క్రెడిట్‌ ఖచ్చితంగా దర్శకుడు వేణు శ్రీరామ్‌ కు దక్కనుంది.

లేడీ ఓరియంటెడ్‌ మూవీని కాస్త కమర్షియల్‌ మూవీగా మార్చాడు. సినిమా కథ ఆత్మ మారిపోకుండా కమర్షియల్‌ టచ్‌ ఇచ్చి దర్శకుడు వేణు శ్రీరామ్‌ వకీల్‌ సాబ్‌ గా తెరకెక్కించాడు. కనుక వకీల్‌ సాబ్‌ సక్సెస్‌ అయినా మరేదైనా ఆయనకే వెళ్లాలి. వకీల్‌ సాబ్‌ కనుక కమర్షియల్‌ గా సక్సెస్‌ అయితే ఖచ్చితంగా ఆయన కోసం ఒక భారీ ఆఫర్‌ వెయిట్‌ చేస్తుంది. ఆ ఆఫర్‌ కోసం దాదాపు రెండేళ్లుగా వేణు శ్రీరామ్‌ వెయిట్‌ చేస్తున్నాడు. అదే 'ఐకాన్‌' సినిమా. వకీల్‌ సాబ్‌ సక్సెస్‌ అయితే ఐకాన్‌ సినిమాను వెంటనే పట్టాలెక్కించేందుకు బన్నీ నుండి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా టాక్‌ వినిపిస్తుంది.

దిల్‌ రాజు ఇప్పటికే వేణు శ్రీరామ్‌ పై నమ్మకంతో బన్నీ తో సినిమాకు సిద్దం అవుతున్నాడని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ప్రస్తుతం బన్నీ 'పుష్ప' సినిమాను చేస్తున్నాడు. సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పుష్ప పూర్తి అయిన వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో బన్నీ ఒక సినిమాను చేయబోతున్నాడు. కేవలం మూడు నాలుగు నెలల్లోనే ఆ సినిమాను పూర్తి చేయాలనేది బన్నీ మరియు కొరటాల ప్లాన్‌. వకీల్‌ సాబ్‌ హిట్‌ అయితే బన్నీ ఖచ్చితంగా కొరటాల శివ మూవీ తర్వాత వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో 'ఐకాన్‌' మూవీ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.