Begin typing your search above and press return to search.

రకుల్ దూకుడికి కళ్లెం పడిపోయినట్టేనా?

By:  Tupaki Desk   |   21 March 2021 5:00 AM IST
రకుల్ దూకుడికి కళ్లెం పడిపోయినట్టేనా?
X
రకుల్ ప్రీత్ సింగ్ .. తెలుగులో తన కెరియర్ ను చిన్న సినిమాతోనే మొదలుపెట్టింది. చిచ్చుబుడ్డిలా అక్కడే వెలుగుతూ కూర్చోకుండా తారాజువ్వలా దూసుకుపోయింది. వరుసగా స్టార్ హీరోల జోడీగా ఆడిపాడుతూ, వీలైనన్ని విజయాలను మూటగట్టేసింది. ఒకానొక దశలో ఎక్కే ఫ్లైట్ .. దిగేఫ్లైట్ అన్నట్టుగా ఆమె ఎడా పెడా షూటింగుల్లో పాల్గొంది. రకుల్ స్పీడ్ చూసి ఇతర కథానాయికలంతా కూడా మేకప్ వేసుకోవడం మరిచిపోయారు. బిజీగా ఉండటం వలన ఆమె ఏదైనా ప్రాజెక్టుకు నో చెబితే మురిసిపోయారు.

అయితే గోడకు కొట్టిన బంతి మాత్రమే కాదు .. ఆకాశంలోకి విసిరిన బంతి కూడా వెనక్కే వస్తుందన్న చందంగా, రకుల్ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. 'ధృవ' సినిమా తరువాత ఇంతవరకూ ఆమెకి సరైన హిట్ పడలేదనే చెప్పాలి. చాలా వేగంగా స్టార్ హీరోయిన్ అనిపించుకుని, అంతే వేగంగా ఆ ప్లేస్ నుంచి జారిపోయిన హీరోయిన్ గా రకుల్ కనిపిస్తుంది. ఎందుకు అంత ఫాస్టుగా ఆమె అవకాశాలను కోల్పోతూ వచ్చిందనేది ఒక పరిశోధనాత్మక అంశంగానే మిగిలిపోయింది. స్టార్ హీరోలతో అవకాశాలు తగ్గుతున్న సమయంలోనే, ఆ తరువాత వరుసలో ఉన్న హీరోల సినిమాలను కూడా ఆమె చేస్తూ వచ్చింది.

చైతూ .. సాయిధరమ్ తేజ్ .. బెల్లంకొండ శ్రీనివాస్ జోడీగా సినిమాలు చేసింది కానీ, అవి ఆశించినస్థాయిలో ఆడలేదు. ఆ సినిమాలో ఆమె వాళ్లకి జోడీగా కాకుండా సీనియర్ హీరోయిన్ గానే కనిపించడం మైనస్ అయింది. అంతలా ఆమె గ్లామర్ లోను మార్పు వచ్చింది .. ఆమె ఫేస్ లోని గ్లో తగ్గుతూ వచ్చింది. రీసెంట్ గా వచ్చిన 'చెక్' సినిమా కూడా ఇదే విషయాన్ని నిరూపించింది. ప్రస్తుతం తెలుగులో ఆమె చేతిలో ఒకే ఒక సినిమా ఉంది. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా నటించాడు. ఇది చాలా తక్కువ బడ్జెట్ లో .. 40 రోజులలోనే పూర్తి చేసిన సినిమా. వైష్ణవ్ జోడీగా రకుల్ ఎంతవరకూ సెట్ అవుతుందనేది సందేహమే. ఇదంతా చూస్తుంటే తెలుగులో ఆమె దూకుడుకి కళ్లెం పడినట్టుగానే కనిపిస్తోంది కదూ!