Begin typing your search above and press return to search.

వాట్సాప్ లీకురాయుళ్లు దొరికిన‌ట్టేనా పుష్పా?

By:  Tupaki Desk   |   17 Aug 2021 10:00 PM IST
వాట్సాప్ లీకురాయుళ్లు దొరికిన‌ట్టేనా పుష్పా?
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న‌ `పుష్ప` లీకుల వ్య‌వ‌హారంతో నిర్మాత‌లు క‌ల‌వ‌రానికి గుర‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఆన్ లొకేష‌న్ నుంచి ల్యాబుల నుంచి ఫోటోలు..వీడియోలు ఒక‌దాని వెంట ఒక‌టి రిలీజ్ అవ్వ‌డం సంచ‌ల‌నంగా మారింది. దాక్కో దాక్కో సాంగ్ అధికారిక రిలీజ్ కు కొన్ని గంట‌ల‌ ముందే లీకైంది. అదే పాట‌కు సంబంధించిన మేకింగ్ వీడియో కూడా బ‌య‌ట‌కు వచ్చింది. ఆ త‌ర్వాత సైకిల్ చైన్ ఫైట్ ... అటుపై ర‌ష్మిక‌పై షూట్ చేసిన చిన్న సాంగ్ బిట్ లీక‌య్యాయి. అనంత‌రం బ‌న్నీ ఫైట్ సీన్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో లీకైంది. ఇవ‌న్నీ చివ‌రికి యూట్యూబ్ కి కూడా ఎక్కేసాయి. ఇవి లీకైన వెంట‌నే నిర్మాత‌లు వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోలేదు.

లీకుల ప‌ని లీకుల‌దే..త‌మ ప‌ని త‌మ‌దే అన్న‌ట్లు పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. ఈ స‌న్నివేశం చూసి ఇదంతా అంద‌రికీ తెలిసే జ‌రుగుతోంది.. ప్ర‌చారస్టంట్ అని కూడా క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. కానీ ఇలా వ‌రుస పెట్టి లీకుల జ‌రిగితే న‌ష్టం ఎలా ఉంటుంద‌న్న‌ది స‌ద‌రు నిర్మాత‌ల‌కు ఆల‌స్యంగా తెలిసొచ్చిన‌ట్లుంది. తాజాగా ఈ లీకుల‌పై నిర్మాత‌లు సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు. లీకులు ఎలా జ‌రిగాయో క‌నిపెట్టాల్సిన బాధ్య‌త పోలీసుల‌పై పెట్టిన‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో లీకుల‌న్ని వాట్సాప్ తో పాటు మరికొన్ని ట్రాన్స‌ఫ‌ర్ విధానం ద్వారా లీకులు జ‌రిగిన‌ట్లు గుర్తించారుట‌.

ఇంకా పూర్తి స్థాయిలో విచార‌ణ జ‌రుపుతున్న‌ట్లు స‌మాచారం. ఇదంతా తేలిన త‌ర్వాత గానీ లీకుల‌కు గ‌ల అస‌లు కార‌ణాలేంటి? ఇందులో ఎవ‌రి పాత్ర ఎంత అన్న‌ది ఓ క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం లేదు. ఈ చిత్రాన్నికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే. మైత్రీ మూవీ మేక‌ర్స్ భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కిస్తోంది. మొత్తం రెండు భాగాలు పుష్ప తెర‌కెక్కుతోంది. ఫ‌స్టాఫ్‌ షూటింగ్ పూర్త‌యింది. సెకండాఫ్ కీల‌క భాగం షూట్ జ‌రుగుతుంది. ఇంత‌లోనే ఈ లీకుల‌న్ని బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఇక‌పై రాకుండా టీమ్ జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది.

స‌ర్కార్ వారి లీకులతోనూ టెన్ష‌న్:

పుష్ప‌తో పాటు `స‌ర్కార్ వారి పాట` లీకులపై ఇప్ప‌టికే మైత్రి సంస్థ సీరియ‌స్ గానే ఉంది. ఇదంతా ప‌నిగ‌ట్టుకుని చేస్తున్న ప‌నులు అనే విమ‌ర్శ ఉన్నా ఔత్సాహికుల అత్యుత్సాహం తెచ్చిన ముప్పు అని కూడా విశ్లేషిస్తున్నారు. అప్ డేట్స్ ఏవైనా అధికారికంగా రిలీజ్ చేయ‌డం వ‌ల్ల‌ వ‌చ్చే మైలేజ్ క‌న్నా లీకుల ద్వారా వ‌చ్చే మైలేజ్ ఎక్కువ. అలా అయితేనే విప‌రీతంగా ప్రేక్ష‌కుల నోళ్ల‌లో నానుతుంద‌న్న ఆలోచ‌న అన్న విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయితే ఇలాంటి లీకుల ప్ర‌చారం వ‌ల్ల నెగెటివిటీ ని మైత్రి సంస్థ ముందే ప‌సిగ‌ట్టి చ‌ర్చ‌లు చేప‌డుతున్నారు.

లిరిక‌ల్ వీడియో బిగ్ స‌క్సెస్

ఇక పుష్ప ఇంత‌కుముందు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్.. టీజ‌ర్ తోనే జ‌నాల్ని వెర్రెత్తించాడు. గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్ల‌ర్ పుష్ప‌రాజ్ పాత్ర‌లో క‌ర్క‌శుడిగా క‌నిపిస్తున్న బ‌న్ని పూర్తిగా మాస్ లుక్ లో మ్యాసివ్ ఫైట్స్ తో ర‌క్తి క‌ట్టించేందుకు వ‌స్తున్నాడు. అలాగే ఈ సినిమా థీమ్ ని ఎలివేట్ చేసేలా తొలి లిరిక‌ల్ వీడియో సాంగ్ మేక మేక‌.. ని రిలీజ్ చేయగా.. బ‌న్ని అభిమానుల్లో వైర‌ల్ గా మారింది. కొన్ని సెక‌న్ల టీజ‌ర్ లో బ‌న్ని రూపం చూస్తుంటే పూర్తి డీగ్లామ‌ర‌స్ అవ‌తార్ లో మాసీ లుక్ తో హీటెక్కించేస్తున్నాడు. గిర‌జాల జుత్తు మాసిన గ‌డ్డం మీసాల‌తో అత‌డి రూపం మాస్ కా బాస్ అనే రేంజులో ఉంది. అలా నోట్లో బండ‌క‌త్తిని క‌రిచి ప‌ట్టుకుని మేక‌ను కోసేందుకు దిగిన మృగంలా ఉన్నాడు. ఇక పూర్తి లిరిక‌ల్ వీడియో కోసం అభిమానులు ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. దేవీశ్రీ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ద‌స‌రా లేదా క్రిస్మ‌స్ కానుక‌గా ఈ ఏడాది రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధ‌మ‌వుతోంది. అత్యంత భారీ బ‌డ్జెట్ తో మైత్రి సంస్థ‌ నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే.