Begin typing your search above and press return to search.

పూరి అంత‌మంది హీరోయిన్ల‌ను ప‌రిచ‌యం చేశారా?

By:  Tupaki Desk   |   31 May 2021 6:00 PM IST
పూరి అంత‌మంది హీరోయిన్ల‌ను ప‌రిచ‌యం చేశారా?
X
పూరి జగన్నాథ్ సినిమా అనగనే విజిల్స్ కొట్టించే మాస్ హీరోయిజం.. చప్పట్లు కొట్టించే డైలాగ్ లు గుర్తుకు వ‌స్తాయి. పూరి అంటే ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ ఫార్ములా. ఆయ‌న ఒక బ్రాండ్. త‌న‌దైన శైలిలో త‌న ఫిలాస‌ఫీని హీరో క్యారెక్ట‌రైజేష‌న్ కి ఆపాదించి డైలాగుల్ని చెప్పించేయ‌డం త‌న ప్ర‌త్యేక‌త‌. అందుకే జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా పూరి సినిమా అంటే అంత క్రేజు. ఇక త‌న సినిమాల ద్వారా ఇప్ప‌టికే పూరి దాదాపు 18 మంది హీరోయిన్ల‌ను ప‌రిచ‌యం చేసారంటే అర్థం చేసుకోవ‌చ్చు. ఆయ‌న ప‌రిచయం చేసిన హీరోయిన్ల‌లో ప‌లువురు అగ్ర క‌థానాయిక‌లుగా ఏలారు. కొంద‌రు హీరోయిన్ల‌ను రీలాంచ్ చేసి పెద్ద స్టార్ల‌ను చేసిన ఘ‌న‌త ఆయ‌న సొంతం.

పూరి జ‌గ‌న్నాథ్ ప‌రిచ‌యం చేసిన తొలి హీరోయిన్లుగా అమీషా పటేల్ - రేణు దేశాయ్ పేర్లు మార్మోగాయి. ప‌వ‌న్ స‌ర‌స‌న‌ బద్రి చిత్రంలో ఆ ఇద్ద‌రూ న‌టించారు. తొలి ప్ర‌య‌త్న‌మే అంద‌చందాల్లో న‌ట‌న‌లో మెప్పించిన నాయిక‌లుగా ఆ ఇద్ద‌రూ వెలిగిపోయారు. ఆ త‌ర్వాత అమీషా తెలుగులో మ‌హేష్ - బాల‌కృష్ణ స‌హా ప‌లువురు అగ్ర హీరోల స‌ర‌స‌న న‌టించ‌గా రేణు దేశాయ్ ప‌వ‌ర్ స్టార్ తో క‌లిసి ప‌ని చేశారు.

ఇట్లు శ్రావ‌ణి సుబ్ర‌మ‌ణ్యం సినిమాతో త‌నూరాయ్ ని .. సామ్రిన్ ని క‌థానాయిక‌లుగా ప‌రిచ‌యం చేశారు. ఆ ఇద్ద‌రిలో త‌నూరాయ్ వ‌రుస సినిమాల్లో ఆఫ‌ర్లు అందుకున్నారు. తెలుగు-త‌మిళం స‌హా ప‌లు భాష‌ల్లో న‌టించారు. మాస్ మ‌హారాజా ర‌వితేజ స‌ర‌స‌న ఇడియ‌ట్ చిత్రంతో ర‌క్ష‌ను క‌థానాయిక‌గా టాలీవుడ్ కి ప‌రిచ‌యం చేశారు. క‌న్న‌డ బ్యూటీ ర‌క్ష ఆ త‌ర్వాత మ‌హేష్ లాంటి స్టార్ హీరో స‌ర‌స‌న నిజం చిత్రంలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. తెలుగులో వ‌రుస సినిమాల్లో న‌టించి కొన్నేళ్ల పాటు రాణించారు.

ర‌వితేజ న‌టించిన అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి చిత్రంతో మ‌ల‌యాళ బ్యూటీ అశిన్ ని క‌థానాయిక‌గా టాలీవుడ్ కి ప‌రిచ‌యం చేశారు. అశిన్ ప‌రిశ్ర‌మ‌లో ప‌లు బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల్లో న‌టించి అగ్ర క‌థానాయిక‌గా ఓ వెలుగు వెలిగారు. సూప‌ర్ సినిమాతో నాగార్జున స‌ర‌స‌న క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైంది అనుష్క‌. పూరి డిస్క‌వ‌రీగా ఎదురే లేని నాయిక‌గా అనుష్క టాలీవుడ్ ని ఏలారు. ఇప్ప‌టికీ అగ్ర క‌థానాయిక‌గా కొన‌సాగుతున్నారు. టాలీవుడ్ లో క‌మ‌ర్షియ‌ల్ సినిమాలతో పాటు నాయికా ప్ర‌ధాన పాత్ర‌ల‌తోనూ అనుష్క మెప్పిస్తున్నారు. సూప‌ర్ సినిమాతోనే బాలీవుడ్ న‌టి అయేషా ట‌కియాని తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేశారు. ఈ అమ్మ‌డి అంద‌చందాల‌కు తెలుగు యువ‌త ముగ్ధులైపోయారు. కానీ అయేషా పూర్తిగా బాలీవుడ్ కే అంకిత‌మై తెలుగు ప‌రిశ్ర‌మ‌కు దూర‌మ‌య్యారు.

అల్లు అర్జున్ స‌ర‌స‌న దేశముదురు చిత్రంతో హ‌న్సిక‌ను తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేశారు. హిందీలో బాల‌న‌టిగా సుప‌రిచిత‌మైన ఆపిల్ బ్యూటీ హ‌న్షిక టాలీవుడ్ లో ద‌శాబ్ధం పైగానే కెరీర్ ని సాగించింది. త‌మిళంలోనూ స్తిర‌ప‌డింది.

చ‌ర‌ణ్ ని ప‌రిచ‌యం చేస్తూ పూరి తెర‌కెక్కించిన చిరుత చిత్రంతో ముంబై బ్యూటీ నేహాశ‌ర్మ క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైంది. ఆ త‌ర్వాత ఈ బ్యూటీ బాలీవుడ్ కే షిఫ్టయ్యింది. కొంత గ్యాప్ త‌ర్వాత నేహా కంబ్యాక్ పెద్ద‌గానే ఉంది. హార్ట్ ఎటాక్ చిత్రంతో ముంబై సోయ‌గం అదా శర్మను క‌థానాయిక‌గా ప‌రిచ‌యం చేసింది పూరీనే. ఆ త‌ర్వాత అదా చెప్పుకోద‌గ్గ సినిమాల్లోనే న‌టించింది. ప్ర‌స్తుతం తెలుగు -త‌మిళం- హిందీలో న‌టిస్తోంది. బాలీవుడ్ అగ్ర క‌థానాయిక‌ కంగనా రనౌత్ ని ఏక్ నిరంజన్ చిత్రంతో తెలుగు చిత్ర‌సీమ‌కు ప‌రిచ‌యం చేసింది పూరీనే. కంగ‌న ఇండ‌స్ట్రీలో అగ్ర నాయిక‌. ప్ర‌స్తుతం త‌లైవి లాంటి పాన్ ఇండియ‌న్ సౌత్ చిత్రంతో ఒక వేవ్ లా దూసుకెళుతోంది.

పూరి త‌న సోద‌రుడు సాయి రామ్ శంక‌ర్ హీరోగా తెర‌కెక్కించిన 143 చిత్రంతో సమీక్ష అనే అందాల భామ‌ను క‌థానాయిక‌గా ప‌రిచ‌యం చేశారు. స‌మీక్ష ఆ త‌ర్వాత ప‌లు భాష‌ల్లో న‌టించారు. ర‌వితేజ‌ నేనింతే చిత్రంతో సియా అనే డ్యాన్స‌ర్ ని క‌థానాయిక‌గా ప‌రిచ‌యం చేసారు. ఈ బ్యూటీ ఆ త‌ర్వాత ప‌లు చిత్రాల్లో నాయిక‌గా న‌టించింది. ఇజ‌మ్ చిత్రంతో అదితి ఆర్యను నాయిక‌గా ప‌రిచ‌యం చేశారు. ఆ సినిమా ఫ్లాప‌వ్వ‌డంతో ఈ బ్యూటీకి పెద్ద‌గా ఆఫ‌ర్లు రాలేదు.

బాల‌య్య `పైసా వాసూల్` చిత్రంతో ముస్కాన్ సేథిని పూరి ప‌రిచ‌యం చేశారు. ఇద్దరమ్మాయిల‌తో చిత్రంతో కేథ‌రిన్ థ్రెసా ప‌రిచ‌యమైంది. ఆ సినిమా ఫ్లాపైనా కేథ‌రిన్ కెరీర్ ప‌రంగా ఓ వెలుగు వెలిగింది. ప్ర‌స్తుతం బాలీవుడ్ యువ‌క‌థానాయిక అనన్య పాండేను తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేస్తున్నారు. ఫైటర్ లో రౌడీ విజ‌య్ స‌ర‌స‌న అన‌న్య న‌టిస్తోంది. ఇది పాన్ ఇండియా సినిమా కావ‌డంతో సౌత్ అంత‌టా అన‌న్య పాండే ప‌రిచ‌య‌మ‌వుతోంది.

కేవ‌లం ఈ 18 మంది క‌థానాయిక‌ల్ని ప‌రిచ‌యం చేయ‌డ‌మే కాదు.. ఇలియానాను పోకిరి చిత్రంతో రీలాంచ్ చేసిన తీరును అభిమానులు మ‌ర్చిపోలేరు. ఇలియానా వైవియ‌స్ తెర‌కెక్కించిన‌ దేవ‌దాసు చిత్రంతో తెర‌కు ప‌రిచ‌య‌మైనా కానీ పూరి పోకిరితో స్టార్ హీరోయిన్ స్టాట‌స్ అందుకుంది. ఆ త‌ర్వాత ద‌శాబ్ధంన్న‌ర కాలం టాలీవుడ్ ని అగ్ర నాయిక‌గా ఏలింది. ఇలియానా-అశిన్-అనుష్క లాంటి అగ్ర నాయిక‌ల్ని తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేసిన గ్రేట్ క‌మ‌ర్షియ‌ల్ మూవీ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్. ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రంతో న‌భా న‌టేష్ .. నిధి అగ‌ర్వాల్ కెరీర్ ని రీలాంచ్ చేసింది పూరీనే. ఆ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టాక కెరీర్ ప‌రంగా ఆ ఇద్ద‌రూ ఫుల్ బిజీ అయిన సంగ‌తి తెలిసిందే.