Begin typing your search above and press return to search.

మహేశ్ కథ విజయ్ దేవరకొండకి వెళ్లిందా?

By:  Tupaki Desk   |   27 March 2021 9:00 PM IST
మహేశ్ కథ విజయ్ దేవరకొండకి వెళ్లిందా?
X
కొన్ని రోజులుగా ఫిల్మ్ నగర్లో ఒక టాక్ వినిపిస్తోంది .. మహేశ్ బాబు కోసం అనుకున్న ఒక కథ, విజయ్ దేవరకొండకు వెళ్లిందనేది ఆ ప్రచారంలో సారాంశం. ఆ మధ్య వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ బాబు కథానాయకుడిగా 'మహర్షి' సినిమా వచ్చింది. ఈ సినిమా మహేశ్ బాబును కొత్త కోణంలో ఆవిష్కరించింది .. ఆయన కెరియర్లోనే గుర్తుపెట్టుకోదగిన హిట్ ను నమోదు చేసింది. దర్శకుడు వంశీ పైడిపల్లికి కూడా ఈ సినిమా సక్సెస్ మంచి బూస్ట్ ను ఇచ్చింది. ఆయన నుంచి వచ్చిన వైవిధ్యభరితమైన చిత్రంగా ప్రశంసలు అందుకుంది.

కమర్షియల్ అంశాలకు ఒక సందేశాన్ని ఏ స్థాయివరకూ జోడించవచ్చు అనే విషయంలో కొరటాల తరువాత వంశీ పైడిపల్లినే అనే టాక్ వినిపించింది. ఈ సినిమా తరువాత కూడా మళ్లీ మహేశ్ బాబుతోనే మరో ప్రాజెక్టు చేయాలని వంశీ పైడి పల్లి అనుకున్నాడు. అందుకు సంబంధించిన స్క్రిప్ట్ పై గట్టిగానే కసరత్తు చేశాడు. మహేశ్ బాబు కూడా వంశీ పైడిపల్లితో చేయడానికే మొగ్గు చూపాడు. ఈ ప్రాజెక్టు దాదాపు ఖరారైపోయినట్టేనని అంతా అనుకున్నారు. అయితే సెకండాఫ్ నచ్చకపోవడం వలన మహేశ్ బాబు .. పరశురామ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ప్రస్తుతం ఆయన ఆ ప్రాజెక్టుపైనే ఉన్నాడు.

ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండతో వంశీ పైడిపల్లి ఒక సినిమా చేయనున్నాడనే వార్త బయటికి వచ్చింది. దాంతో కొంతకాలం క్రితం ఆయన మహేశ్ బాబు కోసం తయారు చేసిన కథనే విజయ్ దేవరకొండతో చేయనున్నట్టుగా చెప్పుకుంటున్నారు. కథలో మార్పులు చేసేసి సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో వంశీ పైడిపల్లి ఉన్నాడని అంటున్నారు. అయితే ఇది మహేశ్ బాబు కోసం అనుకున్న కథ కాదనేది తాజా సమాచారం. మహేశ్ బాబు బాడీ లాంగ్వేజ్ కి .. విజయ్ దేవరకొండ బాడీ లాంగ్వేజ్ కి ఎంతమాత్రం పొంతన ఉండదు. ఇద్దరికీ ఉన్న ఇమేజ్ వేరు .. వాళ్లకి నప్పే కథలు వేరు. అందువలన విజయ్ దేవరకొండకి వంశీ పైడిపల్లి వినిపించిన కథ కొత్తదేనని అంటున్నారు. విజయ్ దేవరకొండ కమిట్ మెంట్స్ పూర్తయిన తరువాత ఈ సినిమా పట్టాలెక్కుతుందేమో చూడాలి.