Begin typing your search above and press return to search.

మా క్ర‌మ‌శిక్ష‌ణా క‌మిటీకి చిరు రాజీనామా చేశారా?

By:  Tupaki Desk   |   7 April 2021 7:00 PM IST
మా క్ర‌మ‌శిక్ష‌ణా క‌మిటీకి చిరు రాజీనామా చేశారా?
X
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) అంత‌ర్గ‌త పోరు గురించి తెలిసిందే. న‌రేష్ వ‌ర్గం .. జీవిత వ‌ర్గం అంటూ రెండు వ‌ర్గాల మ‌ధ్య వివాదాలు క‌ల‌హాల‌తోనే కాలాన్ని నెట్టుకు రావ‌డంపై ఇటీవ‌ల మ‌రోసారి మా స‌భ్యుల్లో చ‌ర్చ సాగుతోంది. అయితే 2019-21 సీజ‌న్ ముగిసింది. 2021 మార్చిలో ఎన్నిక‌లు జ‌రిపి కొత్త అధ్య‌క్ష‌కార్య‌ద‌ర్శుల్ని ఎన్నుకోవాల్సి ఉండ‌గా అధ్య‌క్షుడు న‌రేష్ స్పందించ‌క‌పోవ‌డంపై ప‌లువురు గుర్రుమీద ఉన్నార‌ని గుస‌గుస‌లు వినిపించాయి.

ఇంత‌కుముందు మా క‌మిటీ స‌భ్యుల్లో ఒక కీల‌క వ్య‌క్తి మెగాస్టార్ చిరంజీవికి స్వ‌యంగా ఎన్నిక‌లు నిర్వ‌హించి కొత్త అధ్య‌క్షుడిని ఎన్నుకోవాల‌ని నివేదిస్తూ లేఖ రాయ‌డంపైనా గుస‌గుస‌లు వినిపించాయి. అయితే ఇటీవ‌ల సినీపెద్ద‌ల్లో ఎలాంటి స్పంద‌నా లేదు. క్ర‌మ‌శిక్ష‌ణా క‌మిటీ పెద్ద‌లైన చిరంజీవి- మోహ‌న్ బాబు - జ‌య‌సుధ - ముర‌ళీ మోహ‌న్ బృందంలో ఎవ‌రూ దీనిపై స్పందించిందేమీ లేదు.

తాజా స‌మాచారం మేర‌కు మెగాస్టార్ చిరంజీవి క్ర‌మ‌శిక్ష‌ణా క‌మిటీకి దూరంగా ఉంటున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఆయ‌న బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీగా ఉండ‌డం వ‌ల్ల అలా దూరంగా ఉన్నారా? లేక ఇంకేదైనా కార‌ణ‌మా? అంటూ ముచ్చ‌ట సాగుతోంది. అలాగే 2021-23 సీజ‌న్ కి మూవీ ఆర్టిస్టుల సంఘం ఎన్నిక‌లు నిర్వ‌హించేది ఎప్పుడు? దీనిపై చిరు స‌హా పెద్ద‌లు నిర్ణ‌యించుకోలేదా? అంటూ మ‌రోసారి అంత‌ర్గ‌త చ‌ర్చ వేడి పెంచుతోంది.

ఇప్ప‌టికే మా అసోసియేష‌న్ సొంత భ‌వంతి క‌ల అలానే మిగిలిపోయింది. శివాజీ రాజా అధ్య‌క్షుడిగా ఉన్న‌ప్పుడు కొంత నిధి జ‌మ అయినా ఆ త‌ర్వాత నిధి సేక‌ర‌ణ కార్య‌క‌లాపాలు నిలిచిపోయాయి. ప్ర‌స్తుత అధ్య‌క్షుడితో క‌ల‌త‌ల కాపురంతో అది ఎప్ప‌టికీ క‌ల‌గానే మిగిలిపోనుంద‌న్న ఆందోళ‌న అలానే ఉంది. మ‌రి సినీపెద్ద‌లు దీనికి ఏమ‌ని స‌మాధాన‌మిస్తారో చూడాలి.