Begin typing your search above and press return to search.

ఆ కర్ణకఠోరమైన గొంతు ‘బిగ్ బాస్’లోకి..

By:  Tupaki Desk   |   7 Sep 2017 7:39 AM GMT
ఆ కర్ణకఠోరమైన గొంతు ‘బిగ్ బాస్’లోకి..
X
ధించక్ పూజా.. ఈ పేరు చెబితే చాలు సోషల్ మీడియాలో జనాలు ఉలిక్కి పడతారు. తన కర్ణ కఠోరమైన గొంతుతో పాటలు పాడుతూ యూట్యూబ్ ను షేక్ చేసేసింది పూజా. పబ్లిక్ లో ఎక్కడ పడితే అక్కడ పాటలు పాడుతూ.. బయట కూడా జనాల్ని బెంబేలెత్తించిందామె. ఈ మధ్య ఇలాగే స్కూటీ వేసుకుని పాటలు పాడుతూ.. దాన్ని వీడియో తీస్తుంటే ఎవరో న్యూసెన్స్ కేసు కూడా పెట్టినట్లు వార్తలొచ్చాయి. ఐతే మంచి కంటే కూడా చెడే జనాల్ని ఎక్కువ ఆకర్షిస్తుందనడానికి రుజువుగా.. తన కర్ణ కఠోరమైన గొంతుతో పాటలు పాడుతూ జనాల చేత ఛీకొట్టించుకుంటూనే సోషల్ మీడియాలో బాగానే పాపులారిటీ సంపాదించింది పూజా. ఈ ఫేమ్ తో ఆమె ‘బిగ్ బాస్’ షోలో పాల్గొనే అవకాశం కూడా పట్టేసినట్లు సమాచారం.

‘బిగ్ బాస్’ అంటే తెలుగులోనో.. తమిళంలోనో కాదు.. హిందీ ‘బిగ్ బాస్’లో ధించక్ పూజా పాల్గొనబోతోంది. ఆమెను ఇటీవలే షో నిర్వాహకులు సంప్రదించిన తన అంగీకారం తీసుకున్నారట. ఇప్పటికే 10 సీజన్లు పూర్తి చేసుకున్న హిందీ ‘బిగ్ బాస్’ షో అక్టోబర్ 1 నుంచి 11వ సీజన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవలే దీని టీజర్ కూడా విడుదల చేశారు. సల్మాన్ ఖానే దీనికి హోస్టుగా వ్యవహరించనున్నాడు. ధించక్ పూజాతో పాటుగా టీవీ ఆర్టిస్టు నియా శర్మ.. నీతీ టేలర్.. పరల్ వి. పూరి.. ‘కంచె’ విలన్ నికితిన్ ధీర్ తదితరులు షోలో హౌస్ మేట్స్ గా పాల్గొనే అవకాశముంది. టీవీ నటి ప్రత్యూష బెనర్జీ హత్య కేసులో నిందితుడైన ఆమె బాయ్ ఫ్రెండ్ రాహుల్ రాజ్ సింగ్ కూడా ఈ షోలో పాల్గొనబోతుండటం గమనార్హం.