Begin typing your search above and press return to search.

'ఊర్వశివో రాక్షసివో' నుండి సిద్ శ్రీరామ్ పాడిన బ్యూటిఫుల్ మెలోడీ..!

By:  Tupaki Desk   |   10 Oct 2022 5:25 AM GMT
ఊర్వశివో రాక్షసివో నుండి సిద్ శ్రీరామ్ పాడిన బ్యూటిఫుల్ మెలోడీ..!
X
'కొత్తజంట' 'శ్రీరస్తు శుభమస్తు' 'ఒక్క క్షణం' 'ఎబిసిడి' వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు యంగ్ హీరో అల్లు శిరీష్. చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు "ఊర్వశివో రాక్షసివో" అనే సినిమాతో ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయ్యాడు. రాకేష్ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శిరీష్ సరసన అను ఇమ్మాన్యూల్ హీరోయిన్ గా నటించింది.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న 'ఊర్వశివో రాక్షసివో' చిత్రాన్ని వచ్చే నెలలో థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ భాగంగా ఇది వరకే రిలీజ్ చేసిన చిత్ర టీజర్ కు అనూహ్య స్పందన లభించింది. ఈ క్రమంలో తాజాగా సినిమాలోని 'దీంతననా' అనే ఫస్ట్ సింగిల్ ని చిత్ర బృందం ఆవిష్కరించింది.

''అనగననగా.. కనులే కనగలగా.. నిజమై మెరుపల్లే వాలెనా.. నా ఊపిరి నడకా.. తన ఊపిరి జతగా.. కలగలిసి మొదలయ్యే నాలో అలజడిగా..' అంటూ సాగిన ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంటోంది. అచ్చు రాజ‌మ‌ణి ఈ బ్యూటిఫుల్ మెలోడీకి ట్యూన్ సమకూర్చారు.

"నీ అడుగుల వెంటనే గురుతై ఉంటా.. నీ పాదమే దాటు ప్రతిచోటునా.. నీ పెదవులు తాకే నా పేరును వింటా.. ఓ స్పర్శకే పొంగిపోతానట.. కాలం కలిపింది ఈ జోడి బాగుందని..'' అంటూ లిరిసిస్ట్ పూర్ణచారి అర్థవంతమైన సాహిత్యం అందించారు.

యువ గాయకుడు సిద్ శ్రీరామ్ మరోసారి తన గాత్రంతో మంత్రముగ్దులను చేసాడు. అతని హిట్ లిస్ట్ మరో క్లాసీ మెలోడీ యాడ్ అయిందని చెప్పొచ్చు. 'దీంతననా' పాటలో శిరీష్ - అను ఇమ్మాన్యూల్ మధ్య కెమిస్ట్రీ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయింది. విజువల్ గానూ ఈ పాట ఆకర్షణనీయంగా ఉంది.

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ మరియు శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని రూపొందించారు. ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్న ఈ చిత్రానికి విజయ్ ఎం సహ నిర్మాతగా వ్యవహారించారు. త‌న్వీర్ మిర్ సినిమాటోగ్రఫీ అందించగా.. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. బాబు ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు.

'భలే భలే మగాడివోయ్' 'గీత గోవిందం' 'టాక్సీవాలా' 'ప్రతిరోజు పండగే' 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' లాంటి విజయవంతమైన సినిమాలను నిర్మించిన GA2 పిక్చర్స్ నుంచి రాబోతున్న "ఊర్వశివో రాక్షసివో" చిత్రంపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ న్యూ ఏజ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ని 2022 నవంబర్ 4న విడుదల చేయనున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.