Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: ధర్మయోగి

By:  Tupaki Desk   |   29 Oct 2016 12:33 PM GMT
మూవీ రివ్యూ: ధర్మయోగి
X
చిత్రం : ‘ధర్మయోగి’

నటీనటులు: ధనుష్ - త్రిష - అనుపమ పరమేశ్వరన్ - ఎస్.ఎ.చంద్రశేఖర్ - శరణ్య పొన్ వన్నన్ తదితరులు
సంగీతం: సంతోష్ నారాయణన్
ఛాయాగ్రహణం: వెంకటేష్
నిర్మాత: సి.హెచ్.సతీష్ కుమార్
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: దురై సెంథిల్ కుమార్

తమిళంలో పెద్దగా బ్యాగ్రౌండ్ లేకుండానే పెద్ద స్టార్ హీరోగా ఎదిగిన ధనుష్.. తెలుగులోనూ మార్కెట్ సంపాదించుకోవడానికి చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాడు. గత ఏడాది ‘రఘువరన్ బీటెక్’ సినిమాతో అతడి కోరిక తీరింది. కానీ ఆ తర్వాత తెలుగులోకి వచ్చిన ధనుష్ సినిమాలేవీ పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి. ఐతే ధనుష్ కొత్త సినిమా ‘ధర్మయోగి’ మాత్రం బాగానే ఆసక్తి రేకెత్తించింది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

ధర్మ (ధనుష్).. యోగి (ధనుష్) కవల సోదరులు. ఐతే వీళ్లిద్దరి దారులు మాత్రం వేరు. యోగి తండ్రి వారసత్వాన్నికొనసాగిస్తూ రాజకీయాల్లో పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంటే.. ధర్మ మాత్రం ఇలాంటి వాటికి దూరంగా ఉంటూ చదువుకుని ఓ కాలేజీలో ప్రొఫెసర్ అవుతాడు. ప్రతిపక్ష పార్టీలో ఉండే యోగి.. అధికార పార్టీకి చెందిన రుద్ర (త్రిష)తో ప్రేమలో పడతాడు. వీళ్లిద్దరూ తమ రాజకీయ వైరుధ్యాల్ని పక్కనబెట్టి ప్రేమను కొనసాగించాలనుకుంటారు. ఐతే అనుకోకుండా వచ్చిన ఎన్నికల్లో వీళ్లిద్దరూ ప్రత్యర్థులుగా తలపడాల్సి వస్తుంది. ఆ సమయంలోనే యోగి హత్యకు గురవుతాడు. ఆ పరిస్థితుల్లో యోగి స్థానంలోకి వచ్చిన వచ్చిన ధర్మ.. తన సోదరుడి హత్య వెనుక మిస్టరీని ఎలా ఛేదించాడు.. అతడి రాజకీయ లక్ష్యాల్ని ఎలా సాధించాడు.. అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

ధనుష్ మనకు మామూలుగానే కనిపించొచ్చు. కానీ తమిళంలో అతను స్టార్ హీరో. మంచి మాస్ ఫాలోయింగ్ ఉందతడికి. కానీ అతను ఎంచుకునే కథలు వైవిధ్యంగా ఉంటాయి. కమర్షియల్ సినిమాలు చేసినా కథాకథనాల విషయంలో కాంప్రమైజ్ కాడు. అవి బలంగా ఉండేలా చూసుకుంటాడు. ‘ధర్మయోగి’ కూడా ఆ కోవలోని సినిమానే. ‘ధర్మయోగి’ కథలో భాగంగా ధనుష్ కనిపిస్తాడు తప్ప.. ఇది అతడి కోసం తీర్చిదిద్దిన కథ కాదు. యాజ్ యూజువల్ ధనుష్ పెర్ఫామెన్స్ ప్రేక్షకుడిపై బలమైన ముద్ర వేస్తుంది. ఈ కథ.. ఇందులోని మిగతా క్యారెక్టర్లు కూడా అంతే బలమైన ముద్ర వేయడమే ‘ధర్మయోగి’ ప్రత్యేకత.

ఇటు తెలుగులో అయినా.. అటు తమిళంలో అయినా.. రాజకీయాల నేపథ్యంలో పూర్తి స్థాయి సినిమాలు రావడం అరుదు. అందులోనూ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో థ్రిల్లర్స్ మరీ అరుదు. ఈ అరుదైన జానర్లో తెరెక్కిన పకడ్బందీ చిత్రం ‘ధర్మయోగి’. తమిళ నేటివిటీ.. మనకు పరిచయం లేని నటీనటులు.. అక్కడక్కడా కొన్ని అనవసర సన్నివేశాల్ని పక్కనబెట్టేస్తే.. ‘ధర్మయోగి’ చాలా వరకు మన ప్రేక్షకులనూ మెప్పిస్తుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ కు ఢోకా లేకుండానే.. ప్రేక్షకుడు కొత్తగా ఫీలయ్యే కథాకథనాలు ‘ధర్మయోగి’లో ఉన్నాయి. ఉత్కంఠ రేపే మలుపులతో.. రేసీ స్క్రీన్ ప్లేతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుందీ చిత్రం.

రాజకీయాల్లో ఉండే వ్యక్తులు తమ లక్ష్యాల కోసం ఏమైనా చేస్తారు.. ఎంతకైనా తెగిస్తారనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘ధర్మయోగి’. ఇందులో కొన్ని ఉపకథలు ఉన్నప్పటికీ రాజకీయాల నేపథ్యంలో సాగే థ్రిల్లర్ కథాంశం.. దాని చుట్టూ వచ్చే మలుపులు ప్రధానంగా ప్రేక్షకుడిని ఆకర్షిస్తాయి. ప్రధాన పాత్రల్ని చక్కగా తీర్చిదిద్దడం కూడా ‘ధర్మయోగి’కి బలంగా మారింది. ధనుష్ పోషించిన రెండు క్యారెక్టర్లలో యోగి ఆసక్తి రేపుతుంది. ఆ పాత్రలో అతడి నటన కూడా అద్భుతంగా సాగింది. ఈ పాత్రకు జోడీగా త్రిష పాత్రను మరింత రసవత్తరంగా తీర్చిదిద్దాడు దర్శకుడు. ఈ సినిమాలో అతి పెద్ద సర్ప్రైజ్ త్రిష క్యారెక్టరే. ఓవైపు రాజకీయాల్లో ప్రత్యర్థులుగా ఉంటూనే ప్రేమికులుగా కొనసాగే యోగి-రుద్ర పాత్రల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఆసక్తి రేకెత్తిస్తాయి. ఈ పాత్రలే ప్రథమార్ధాన్ని వేగంగా నడిపిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ ప్రేక్షకుడికి దిమ్మదిరిగేలా చేస్తుంది. దర్శకుడి ప్రతిభకు ఆ సన్నివేశం తార్కాణంగా నిలుస్తుంది.

ప్రథమార్ధంతో పోలిస్తే ద్వితీయార్దం కొంత నిరాశ పరుస్తుంది. కానీ ఇక్కడ కూడా ట్విస్టులు బాగానే పేలాయి. తన కవల సోదరుడి హత్య వెనుక మిస్టరీని ధర్మ పాత్ర ఛేదించే వైనం ఆసక్తి రేపుతుంది. ప్రి క్లైమాక్సులో త్రిష పాత్ర చుట్టూ వచ్చే సన్నివేశాలు బాగున్నాయి. కాస్త అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ ద్వితీయార్ధం కూడా బాగానే ఎంగేజ్ చేస్తుంది. కాకపోతే క్లైమాక్సే ‘ధర్మయోగి’కి అంత ఆకర్షణ కాలేకపోయింది. ఒక రకంగా సినిమాను ముగింపులో తేల్చేశాడు దర్శకుడు. అక్కడక్కడా కథనం నెమ్మదించినా.. కొన్ని అనవసర సన్నివేశాలు ఇబ్బంది పెట్టినా.. ఓవరాల్ గా ‘ధర్మయోగి’ ఒక చక్కటి పొలిటికల్ థ్రిల్లర్. తమిళ వాసనల్ని కూడా కొంచెం భరించాల్సి ఉంటుంది. సీరియస్ సినిమాల్ని ఇష్టపడేవాళ్లకు ఇది మంచి ఛాయిస్.

నటీనటులు:

నటుడిగా ధనుష్ స్థాయి ఏంటో చూపించే సినిమా ‘ధర్మయోగి’. కెరీర్లో తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన ధనుష్.. అలవోకగా రెండు పాత్రల్ని చేసుకుపోయాడు. లుక్ విషయంలో రెండు పాత్రలకు బాగా వేరియేషన్ చూపించాడు. ధర్మ పాత్రతో పోలిస్తే యోగి క్యారెక్టర్లో ధనుష్ ముద్ర బాగా కనిపిస్తుంది. ఆ పాత్ర గెటప్.. నటన అన్నీ ఆకట్టుకుంటాయి. కాకపోతే ఈ పాత్రలో కొన్నిచోట్లు తమిళ అతడి కనిపిస్తుంది. దాన్ని భరించాల్సి ఉంటుంది. ధనుష్ ఇప్పటికే ఎన్నో గొప్ప పాత్రలు చేశాడు కాబట్టి అతడి గురించి ఇప్పుడు కొత్తగా చెప్పేదేం లేదు కానీ..ఈ సినిమాలో త్రిష క్యారెక్టర్ గురించి మాత్రం ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ‘ధర్మయోగి’లో త్రిష చేసిన పాత్ర ఆమెకు కెరీర్ బెస్ట్ అంటే అతిశయోక్తి ఏమీ లేదు. ఆమెలోని మరో కోణాన్ని ఈ సినిమా చూపిస్తుంది. పాత్ర ఎంత బాగుందో త్రిష నటన కూడా అంతే బాగుంది. అనుపమ పరమేశ్వరన్ పాత్ర పరిమితమే కానీ.. ఆమె కూడా బాగా చేసింది. మిగతా నటీనటుల్లో చాలా వరకు మనకు పెద్దగా పరిచయం లేనివాళ్లే.

సాంకేతిక వర్గం:

సంతోష్ నారాయణన్ పాటలు పర్వాలేదు. రెండు పాటలు బాగున్నాయి. పాటల్లో కూడా తమిళ నేటివిటీ ఎక్కువ కనిపిస్తుంది. తెలుగు లిరిక్స్ అంత క్యాచీగా లేవు. బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం సంతోష్ అదరగొట్టాడు. తన ప్రత్యేకత చూపించాడు. ఆర్.ఆర్ ప్రేక్షకుడిని కథలో లీనం చేయిస్తుంది. వెంకటేష్ ఛాయాగ్రహణం కూడా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కు ఢోకా లేదు. దురై సెంథిల్ కుమార్ ఒక స్టార్ హీరోతో పని చేయడం ఇదే తొలిసారి. అయినా అతను కథకే ప్రాధాన్యమివ్వడం అభినందనీయం. ‘‘ధర్మయోగి’కి అతడి కథాకథనాలే ప్రధాన ఆకర్షణ. అందరూ వెళ్లే దారిలో కాకుండా విభిన్నమైన కథను ప్రయత్నించాడతను. కథలో ట్విస్టుల్ని అతను ప్లేస్ చేసిన తీరు.. వాటిని రివీల్ చేసిన వైనం ఆకట్టుకుంటుంది. ‘ధర్మయోగి’ డైరెక్టర్స్ మూవీ అనడంలో సందేహం లేదు.

చివరగా: ధర్మయోగి.. ఎంగేజింగ్ పొలిటికల్ థ్రిల్లర్

రేటింగ్: 3/5

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/


Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre