Begin typing your search above and press return to search.

ధనుష్ దర్శకత్వంలో భారీ సినిమా

By:  Tupaki Desk   |   14 Dec 2017 9:00 PM IST
ధనుష్ దర్శకత్వంలో భారీ సినిమా
X
పెద్దగా బ్యాగ్రౌండ్ ఏమీ లేకున్నా.. కేవలం తన టాలెంట్‌ తోనే నటుడిగా తిరుగులేని స్థాయిని అందుకున్న తమిళ కథానాయకుడు ధనుష్. కేవలం నటనకు మాత్రమే పరిమితం కాకుండా.. తనలోని మల్టీ టాలెంట్స్ చూపించాడతను. అతను పాటలు రాశాడు.. పాడాడు.. కొన్ని సినిమాలకు రచనా సమకారం అందించాడు. ఈ ఏడాదే అతను దర్శకుడిగా కూడా అరంగేట్రం చేశాడు. అతడి దర్శకత్వంలో తెరకెక్కిన తొలి సినిమా ‘పవర్ పాండి’కి మంచి ఫలితం వచ్చింది. చక్కటి ఫీల్ ఉన్న సినిమాతో తమిళ ప్రేక్షకుల మనసు గెలిచాడు ధనుష్. ఈ చిత్రం తెలుగులో మోహన్ బాబు ప్రధాన పాత్రలో రీమేక్ కానున్నట్లు కూడా వార్తలొచ్చాయి.

దర్శకుడిగా ఇప్పుడు రెండో సినిమా చేయడానికి ధనుష్ రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఈసారి కొంచెం పెద్ద స్థాయిలోనే సినిమా చేయడానికి అతను రెడీ అవుతుండటం విశేషం. ఇదొక పీరియడ్ మూవీ అట. ఇటీవలే ‘మెర్శల్’ లాంటి భారీ సినిమాను నిర్మించిన తెండ్రాల్ ఫిలిమ్స్ సంస్థ భారీ బడ్జెట్లో ఈ సినిమాను నిర్మించనుందట. ఈ చిత్రంలో ధనుష్ స్వయంగా ఓ కథానాయకుడిగా నటిస్తాడట. ఇందులో మరో స్టార్ హీరో కూడా నటిస్తాడని అంటున్నారు. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్తుంది. ధనుష్ ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘ఎన్నై నొక్కి పాయుం తోటా’తో పాటు ‘వాడా చెన్నై’లోనూ నటిస్తున్నాడు. అతను చేసిన తొలి హాలీవుడ్ మూవీ ‘ది ఎక్స్ ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ఫాకిర్’ త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు రజినీ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘కాలా’కు ధనుషే నిర్మాత.