Begin typing your search above and press return to search.

అజయ్ భూపతికి ఇప్పుడు ధనుశ్ దొరుకుతాడా?

By:  Tupaki Desk   |   19 Oct 2021 9:00 PM IST
అజయ్ భూపతికి ఇప్పుడు ధనుశ్ దొరుకుతాడా?
X
"నాకు పొగరు అనుకుంటారో .. అహంభావం అనుకుంటారో .. ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటారో అనుకోండి. ఈ నెల 8వ తేదీన ఇండస్ట్రీ మరో బ్లాక్ బస్టర్ ఇవ్వబోతోంది" .. 'మహాసముద్రం' ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై దర్శకుడు అజయ్ భూపతి చెప్పిన మాటలివి. నిజానికి ఒక సినిమా బ్లాక్ బస్టర్ అవునో కాదో చెప్పవలసింది ఆడియన్స్ .. ఆ సినిమా రాబట్టే వసూళ్లు. ఏ సినిమా హిట్టుకైనా కొలమానం అది తెచ్చే లాభాలే. అవి లేకపోతే అది వేరే కేటగిరిలోకి జారిపోయినట్టే. ఒక సినిమా టాక్ బాగుంటేనే ఎవరైనా థియేటర్ కి వెళతారు. లేదంటే టీజర్లతో .. ట్రైలర్లతో సరిపెట్టుకుంటారు.

అజయ్ భూపతికి తాను తయారుచేసుకున్న కథపై తనకి అంతటి నమ్మకం ఉండటంలో తప్పులేదు. కానీ తనకి నచ్చిన కథ అందరికి నచ్చాలన్నా రూలేం లేదు. ఒకే థియేటర్లో కూర్చున్నప్పటికీ ఒక సినిమాను ఎవరి కోణంలో వాళ్లు చూస్తారు.

నిజం చెప్పాలంటే ఇది మణిరత్నం మార్కు సినిమా. అజయ్ భూపతి పెట్టిన ఫ్రేమ్స్ అందుకు దగ్గరగా ఉన్నాయి. ఇక ప్రధాన పాత్రధారుల విషయానికి వస్తే, శర్వానంద్ కి చాలా కాలంగా సరైన హిట్ లేదు. సిద్ధార్థ్ ను ఈ స్టేజ్ పై చూసిన తరువాతనే చాలామందికి గుర్తుకు వచ్చాడు. ఇప్పటి యూత్ ఆయన కోసం 'బొమ్మరిల్లు' చూడవలసిన పరిస్థితి.

ఇక కథానాయికలు విషయానికి వస్తే, అదితీరావుకు గానీ .. అనూ ఇమ్మాన్యుయేల్ కి గాని ఇక్కడ క్రేజ్ లేదు. జగపతిబాబు మంచి ఆర్టిస్ట్ .. పబ్లిసిటీ పరంగా ఆయన పాత్రను హైలైట్ చేసి ఉంటే ఏమైనా కలిసొచ్చేదేమో. అంతో ఇంతో ఇమేజ్ ఉన్న ఒక్క శర్వానంద్ ను పట్టుకుని 'మహా సముద్రం' ఈదాలనుకోవడం సాహసమే అవుతుంది. ఈ సినిమా ఫలితం కూడా అదే విషయాన్ని స్పష్టం చేసింది. ఇప్పటి ప్రేక్షకులకు బరువైన సన్నివేశాలను మోయలేరు .. భారమైన ఫ్లాష్ బ్యాక్ లు చూడలేరు. వాళ్లకి కావలసింది నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అంతే.

ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ .. అంతే అంటూ శిలాశాసనం చేసినట్టుగా అజయ్ భూపతి చెప్పడం వల్లనేనేమో, ఆయన దర్శకత్వంలో ధనుశ్ హీరోగా అనిల్ సుంకర ఒక సినిమా ప్లాన్ చేశాడు. ఈ సినిమా రిజల్టు తరువాత చూద్దామని ధనుశ్ వెయిటింగులో పెట్టాడు. మరి ఇప్పుడు ఈ ప్రాజెక్టు ఉంటుందా అనేది సందేహమేనని అంటున్నారు. అనిల్ సుంకర ఓకే అన్నా, అవతల ధనుశ్ దొరకాలిగా? ఆయనకున్న అనుభవం ఎక్కువాయే. ఈ నేపథ్యంలో అజయ్ భూపతి తదుపరి సినిమాకి ఎలాంటి కథను రెడీ చేసుకుంటాడో .. ఏ హీరోతో ముందుకు వెళతాడో. తనకి ఈ సినిమాలో ఛాన్స్ ఇవ్వనందుకు అలుగుతున్నట్టు ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై చెప్పిన కార్తికేయ .. తనతో తొందరగా ఒక సినిమా చేయమని కోరిన కార్తికేయతోనే అజయ్ ముందుకెళతాడేమో చూడాలి.