Begin typing your search above and press return to search.

రౌడీ నాధా ఇన్నాళ్లు ఏమ‌య్యారు.. నీకిది త‌గునా?

By:  Tupaki Desk   |   7 April 2020 9:40 AM IST
రౌడీ నాధా ఇన్నాళ్లు ఏమ‌య్యారు.. నీకిది త‌గునా?
X
క‌రోనా క‌ల్లోలం క‌లుగులోంచి ఎలుక‌ల్ని బ‌య‌టికి లాగుతోంది. ఎవ‌రెవ‌రో సోష‌ల్ మీడియాల్లోకి వ‌చ్చి పాపులారిటీ సంపాదిస్తున్నారు. మ‌రి అంత వైబ్రేంట్ గా ప‌బ్లిసిటీ చేసుకునే రౌడీగారికి ఏమైంది? అస‌లు క‌నిపించ‌డేం? ఎంట‌ర్ ది డ్రాగ‌న్ లా క‌రోనా ఎంట‌ర్ కాక‌ముందు ఎటు చూసినా రౌడీ రౌడీ రౌడీ అంటూ ఆ పేరే మార్మోగిపోయేది. కానీ ఎందుకనో ఇటీవ‌ల చ‌ప్పున చ‌ల్లారింది. అస‌లు సౌండ్ అన్న‌దే లేదు. ఇదీ రౌడీ స్టార్ ఫ్యాన్స్ ఫీలింగ్. అస‌లింత‌కీ ఏమైంది సారూ? అంటూ కొంద‌రైతే వ్యంగ్యంగానూ స్పందిస్తున్నారు.

రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ ఉన్న‌ట్టుండి ఒక్క‌సారిగా సైలెంట్ అయిపోయాడు. నిత్యం సోష‌ల్ మీడియాలో అభిమానుల‌కు ట‌చ్ లో ఉండే రౌడీ మౌనానికి కార‌ణమేంటో తెలియ‌క బుర్ర‌లు పీక్కుంటున్నారు. దేశం లాక్ డౌన్... తెలంగాణ లాక్ డౌన్.. అయినా కేసీఆర్ అభిమానిగా క‌నీస‌మాత్రంగా అయినా స్పందించ‌నే లేదు ఎందుక‌నో. ఇంట్లోనే ఉన్నా...క‌రోనా పంజా విసిరినా బాధ్య‌త గ‌ల సెల‌బ్రిటీగా క‌నీస సాయం ప్ర‌క‌టించ‌క‌ పోగా.. కాస్త‌యినా అవేర్ నెస్ లో భాగంగా స్పందిచ‌కుండా ఉండిపోయాడ‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

దాదాపు టాలీవుడ్ సెల‌బ్రిటీలంతా క‌రోనా గురించి మాట్లాడారు. తోచిన స‌హాయం చేసారు. కానీ రౌడీస్టార్ మాత్రం ఇవేవీ ప‌ట్ట‌న‌ట్లే ఉన్నాడు. 2019 ది మోస్ట్ డిజైర‌బుల్ మ్యాన్ గా నిలిచాడు.. యువ‌త‌రానికి స్ఫూర్తిగా చెప్పుకున్నారు. అయినా ఇప్పుడు ఏమ‌య్యాడు? అంటూ అంతా టార్చ్ వేసి వెతుకుతున్నారు. క‌నీసం సోష‌ల్ మీడియాలో అయినా స్పందించ‌డేం? పాత‌ ట్వీట్లు త‌ప్ప మ‌రో కొత్త ట్వీట్ అత‌ని ఖాతాలో లేక‌పాయే. మ‌రి ఒక్క‌సారిగా ఇలా ఎందుకు సైలెంట్ అయిపోయాడన్న‌ది అత‌ని వ్య‌క్తిగ‌తం.

అయితే తాజాగా జూబ్లీహిల్స్ లో కొనుక్కున్న త‌న కొత్త‌ ఇంట్లో మాతృమూర్తి తో కలిసి ఎంతో ట్రెడిష‌న‌ల్ గా క‌నిపించాడు. తెలుపు రంగు ధ‌వ‌ళ‌ వ‌స్త్రాలు ధ‌రించి దిగిన ఓ ఫోటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతోంది. చాలా రోజుల త‌ర్వాత రౌడీ ఇలా క‌నిపించేస‌రికి అభిమానులు హ‌మ్మ‌య్య అనుకున్నారు. అయితే ఈ ఫోటో కూడా విజ‌య్ షేర్ చేయ‌లేదు. ఆయ‌న అభిమాని ఎవ‌రో షేర్ చేయ‌డం తో బ‌య‌ట‌కు వ‌చ్చింది. లేదంటే.. ఆ ఫోటో కూడా వ‌చ్చేది కాదేమో! ఇంత‌కీ ఆ ఫోటో ఎక్క‌డిది? అని పరిశీలిస్తే.. దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పిలుపు మేర‌కు బాస‌ట‌గా.. త‌న త‌ల్లి గారితో క‌లిసి లైట్లు ఆఫ్ చేసి దీపాలు వెలిగించిన స‌న్నివేశ‌మ‌దని అర్థ‌మ‌వుతోంది. సెల‌బ్రిటీలంతా దీపాలు వెలిగించి బోలెడంత ప్ర‌చారం పొందారు. కానీ దానికి కూడా విజ‌య్ ప్ర‌చారం కోరుకోలేదేమిటో!

అయినా మ‌రీ ఇంత‌గా స‌స్పెన్స్ మెయింటెన్ చేయ‌డానికి కార‌ణం ఏంటీ? అస‌లు రౌడీస్టార్ ఇంట‌ర్న‌ల్ ఫీల్ ఏమిటీ? ఇలా మౌనంగా ఉండ‌టం క్రేజీగా ఉంటుంద‌నా? లేక ఇదో టైపు ప్ర‌చారామా? అంటూ ర‌క‌ర‌కాల ఊహ‌గానాలు మొద‌ల‌య్యాయి. ఇటీవ‌లి కాలంలో విజ‌య్ న‌టించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద‌ బొల్తా కొడుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం విజ‌య్.... పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో `ఫైట‌ర్` మూవీలో న‌టిస్తున్నాడు. ముంబైలో చిత్రీక‌ర‌ణ సాగుతోంది. లాక్ డౌన్ నేప‌థ్యంలో షూటింగ్ కి బ్రేక్ ప‌డింది. ఇప్ప‌టికే ద‌ర్శ‌కుడు పూరి ఎంతో స్ఫూర్తివంత‌మైన వీడియోలతో ప్ర‌జ‌ల్ని అప్ర‌మత్తం చేశారు. ఆయ‌న గురువు ఆర్జీవీ సైతం త‌న‌దైన శైలిలో అంతో ఇంతో భ‌య‌పెట్టి అయినా మేలు చేశాడు. కానీ విజ‌య్ మాత్రం ఏదీ చేయ‌లేదెందుకో!!