Begin typing your search above and press return to search.

నాన్న టైటిల్ తో నాగ్ రిస్క్?

By:  Tupaki Desk   |   4 July 2018 7:43 AM GMT
నాన్న టైటిల్ తో నాగ్ రిస్క్?
X
నాగార్జునకు ఒక ప్రత్యేకత ఉంది. నాన్న అక్కినేని నాగేశ్వర్ రావు అగ్ర హీరో అయినప్పటికీ ఆయన రిఫరెన్స్ కానీ సినిమా పేర్లను కానీ ఆఖరికి సూపర్ హిట్ సాంగ్స్ ని కానీ ఇప్పటి దాకా వాడుకోలేదు. ఎందుకు అని అడిగితే బాగా రాకపోతే చెడగొట్టినట్టు అవుతుంది కదా అని తప్పుకునేవాడు నాగ్. కానీ ప్రస్తుతం నానితో కలిసి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో చేస్తున్న మల్టీ స్టారర్ కోసం రాజీ పడతారా అంటే ఔనని అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. వాటి ప్రకారం దీనికి దేవదాస్ అనే టైటిల్ అనుకుంటున్నారట. ఇది ఎఎన్ఆర్ నటించిన మరపురాని గొప్ప ప్రేమ కథా చిత్రానికి ఉన్న పేరు. మరి కామెడీ ఎంటర్ టైనర్ గా అందులోనూ నాగ్ డాన్ గా నటిస్తున్న సినిమాకు ఈ టైటిల్ పెట్టడం అంటే పోలిక వస్తుందేమో అని ఆలోచిస్తున్నారు అక్కినేని అభిమానులు.

దాని రీమేక్ అయితే ఎటువంటి సమస్య లేదు. కానీ ఇది పూర్తి వ్యతిరేకమైన దిశలో వస్తున్న డిఫరెంట్ జానర్ మూవీ. అలాంటప్పుడు సూట్ అవ్వదు అని చెప్పలేం కానీ నాగ్ తండ్రి సినిమా టైటిల్ కాబట్టి పోలిక అయితే తప్పకుండా వస్తుంది. అయినా ఈ టైటిల్ వాడనిది కాదు. వైవిఎస్ చౌదరి చాలా ఏళ్ళ క్రితమే దేవదాసు పేరుతో రామ్-ఇలియానా జంటగా ఒక సూపర్ హిట్ కొట్టాడు. అప్పుడు ఈ సమస్య అనిపించలేదు. కారణం అది లవ్ స్టోరీ కావడంతో పాటు అక్కినేని కుటుంబానికి ఏ రకంగానూ సంబంధం లేని హీరో రామ్ చేసాడు కాబట్టి. కానీ అదే పేరుని నాగ్ వాడుకుంటే మాత్రం మంచి క్లాసిక్ పేరుని ఇలాంటి కామెడీ ఎంటర్ టైనర్ కు పెడతారా అనే కామెంట్స్ రావడం సహజం. ఇది అధికారికంగా చెప్పిన వార్త కానప్పటికీ దీని గురించిన ప్రచారం అయితే జోరుగా సాగుతోంది.

నాగ్ ఇప్పటి దాకా చేయని సాహసాన్ని దీనికి మాత్రం ఎందుకు చేస్తాడు అనేవారు లేకపోలేదు. వంద సినిమాల మార్కుకు చేరువలో ఉన్న నాగార్జున ఇప్పటి దాకా నాన్న సినిమా పేరు దేనిని వాడుకోలేదు. మరి దీనికి మాత్రం ఒప్పుకుంటాడా అనేది వెయిట్ చేసి చూడాలి. అన్నట్టు ఈ కథలో నాగ్ చేస్తున్న డాన్ పాత్ర పేరు దేవ్ కాగా డాక్టర్ గా నటిస్తున్న నాని పేరు దాస్. అందుకే ఇద్దరు హీరోలకు సెట్ అవుతుందని దేవ్ దాస్ అనుకుంటున్నారట. చూద్దాం ఫైనల్ గా ఏది ఫిక్స్ అవుతుందో.