Begin typing your search above and press return to search.

ఆ చోట దీపిక‌ను రౌండ‌ప్ చేశారు!

By:  Tupaki Desk   |   3 April 2019 10:07 PM IST
ఆ చోట దీపిక‌ను రౌండ‌ప్ చేశారు!
X
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక ప‌దుకొనే యాసిడ్ బాధితురాలు ల‌క్ష్మీ అగ‌ర్వాల్ పాత్ర‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. `చ‌పాక్` అనేది ఈ సినిమా టైటిల్‌. యాసిడ్ దాడికి గురైన సాధార‌ణ యువ‌తి ల‌క్ష్మీ అగ‌ర్వాల్ త‌న జీవితంలో సాగించిన పోరాటం నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. `రాజీ` ఫేం మేఘ‌న గుల్జార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇటీవ‌లే దీపిక ఫ‌స్ట్ లుక్ రిలీజైంది. ఈ లుక్ కి అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది.

యాసిడ్ బాధిత‌ యువ‌తి గా దీపిక మేక‌ప్ కోసం ప్ర‌త్యేకించి ప్రోస్థ‌టిక్స్ ని ఉప‌యోగిస్తున్నారు. మారిన దీపిక వేష‌ధార‌ణ అభిమానుల‌కు ఎంతో పెద్ద స‌ర్‌ ప్రైజింగ్ గా క‌నిపిస్తోంది. ప్ర‌పంచంలోనే గొప్ప సౌంద‌ర్య రాశి అయిన దీపిక‌ను ఇలాంటి వికృత రూపంలో చూడ‌డం ఇదే తొలిసారి. పాత్ర‌లో దీపిక ఇన్వాల్వ్‌ మెంట్ పైనా ఆస‌క్తిగా మాట్లాడుకుంటున్నారు. ప్ర‌స్తుతం న్యూ దిల్లీలో చిత్రీక‌ర‌ణ సాగుతోంది. ప‌ది రోజులుగా దీపిక‌పై కీల‌క స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ సాగుతోంది. వాస్త‌వంగా ఫ్యాబ్ ఇండియా అనే కార్పొరెట్ భ‌వంతి వ‌ద్ద ల‌క్ష్మీ అగ‌ర్వాల్ పై యాసిడ్ దాడి జ‌రిగింది. ల‌క్ష్మీ ఆ స‌మ‌యంలో ప‌సుపు రంగు కుర్తా ధ‌రించింది. సేమ్ సీన్ ని దీపిక‌పై నేడు దిల్లీలో చిత్రీక‌రించారు. ఈ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతున్న స్థ‌లానికి పెద్ద ఎత్తున అభిమానులు విరుచుకుప‌డ‌డంతో వారిని అదుపులోకి తేవ‌డం స‌మ‌స్య‌గా మారిందిట‌.

2005లో ల‌క్ష్మీ అగ‌ర్వాల్ పై యాసిడ్ దాడి జ‌రిగింది. ఆ స‌మ‌యంలో త‌న వ‌య‌సు 15. ఈ ఘ‌ట‌న‌లో ల‌క్ష్మీ ముఖం పాక్షికంగా కాలిపోయింది. ఘ‌ట‌న‌ అనంత‌రం ఆస్ప‌త్రిలో చికిత్స పొంది చివ‌రికి ఎలాగోలా ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. అనంత‌రం లోక‌ల్ మార్కెట్ లో యాసిడ్ విక్రయిస్తున్న మార్కెట్ వ‌ర్గాల‌పై అలుపెర‌గ‌ని పోరాటం సాగించారు. ఆ దాడికి కార‌ణాల‌పైనా తీవ్ర‌మైన పోరాటం చేసి చివ‌రికి కోర్టులో గెలుపొందారు. ఇలాంటి వాస్త‌విక సంఘ‌ట‌న‌ల్ని క‌థ‌గా రాసుకుని మేఘ‌న గుల్జార్ తెర‌పై ఆవిష్క‌రిస్తున్నారు. దీపిక లాంటి విల‌క్ష‌ణ న‌టి త‌న పాత్ర‌లో న‌టించ‌డంపై ల‌క్ష్మీ అగ‌ర్వాల్ సంతోషం వ్య‌క్తం చేశారు. దీపిక‌కు కాలిన ముఖాన్ని అమ‌ర్చేందుకు మేక‌ప్ ఆర్టిస్టులు తీసుకుంటున్న శ్ర‌ద్ధ‌ను ల‌క్ష్మీ అగ‌ర్వాల్ ప్ర‌శంసించారు. 2020 సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న `చ‌పాక్` చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు.