Begin typing your search above and press return to search.

వార్నర్ ఏంటి మన తెలుగు సినిమాల మీద పడ్డాడు..!

By:  Tupaki Desk   |   10 May 2020 10:33 AM GMT
వార్నర్ ఏంటి మన తెలుగు సినిమాల మీద పడ్డాడు..!
X
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్‌ వార్నర్‌ గ్రౌండ్ లో దిగితే ఏ రేంజ్ లో విరుచుకుపడతాడో.. ఏ విధంగా వీరబాదుడు బాదుతూ విధ్వంసం సృష్టిస్తాడో మనందరికీ తెలిసిందే. ఐపీఎల్‌ లో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ గా వ్యవహరిస్తున్న వార్నర్‌ దెబ్బకి స్టేడియాలే చిన్నబోయిన సందర్భాలు మనం చాలానే చూసాం. ఇప్పుడు వార్నర్ అదే జోష్‌ ను టిక్‌ టాక్‌ లో కూడా చూపిస్తున్నాడు. కరోనా లాక్‌ డౌన్‌ తో ఇంటికే పరిమితమైన ఈ విధ్వంసకర బ్యాట్స్‌మన్ సోషల్ మీడియాతో కాలక్షేపం చేస్తున్నాడు. టిక్‌ టాక్‌ లోకి అడుగుపెట్టి వరుస వీడియోలతో ఫ్యాన్స్‌ ను ఖుషీ చేస్తున్నాడు. తెలుగు తమిళ పాటలకు డ్యాన్స్‌ చేస్తూ రోజుకో వీడియోతో అభిమానులను అలరిస్తున్నాడు. ఇంతకముందు తెలుగు సూపర్ హిట్ 'అల వైకుంఠపురంలో' సినిమాలోని 'బుట్టబొమ్మ' సాంగ్ కు సతీమణి క్యాండీస్‌ మరియు తన కూతురితో కలిసి స్టెప్పులేసాడు. దీనికి అల్లు అర్జున్ ప్రశంసలతో పాటు తెలుగు సినీ అభిమానుల మనసును దోచుకున్నాడు.

ఆ తర్వాత కమల్ హాసన్ సాంగ్‌ 'సన్న జాజి పడక' మ్యూజిక్ కి కూతురుతో కలిసి కాలు కదిపారు వార్నర్ దంపతులు. ఇప్పుడు తాజాగా మరో టిక్ టాక్ వీడియోతో వచ్చాడు డేవిడ్ వార్నర్. ఈసారి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలోని డైలాగ్ చెప్పి ఇరగదీసాడు. 'పోకిరి' సినిమాలో మహేష్ చెప్పిన 'ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను' అంటూ టిక్ టాక్ చేసాడు. ఇంస్టాగ్రామ్ లో ఈ వీడియోను పోస్టు చేస్తూ.. '' ఈ సినిమా పేరు కనుక్కోండి.. నేను అందరిని ట్రై చేశాను.. గుడ్ లక్'' అంటూ కామెంట్ జత చేసాడు. ఈ వీడియో చూసిన సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. అయితే కొంతమంది మాత్రం ఈ వార్నర్ ఏంటి మన తెలుగు సినిమాల మీద పడ్డాడు అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే వాస్తవానికి ఈ మధ్య బన్నీ సినిమాలోని పాటకి డ్యాన్స్ చేసిన వార్నర్ కి సోషల్ మీడియాలో సూపర్ స్టార్ ఫ్యాన్స్ మహేష్ సాంగ్స్ కి కూడా చేయమంటూ కామెంట్స్ రూపంలో రిక్వెస్ట్ చేసుకున్నారట.

ఎందుకంటే టాలీవుడ్ లో మహేష్ - బన్నీ ఫ్యాన్ వార్ గురించి మనందరికీ తెలిసిందే. మా వాడు మొగుడు అంటే మా వాడు రంకు మొగుడంటూ కయ్యానికి కాలు దువ్వుతూ ఉంటారు. ఎప్పుడు ఒకరి మీద ఒకరు ఆధిపత్య పోరు చూపించుకోడానికి ట్రై చేస్తున్నది మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో స్టార్ క్రికెటర్ వార్నర్ అల్లు అర్జున్ పాటకి స్టెప్పులేయడంతో అతను ఒక మెట్టు పైకి ఎక్కినట్లు ఆయన ఫ్యాన్స్ గొప్పగా చెప్పుకున్నారు. దీంతో మహేష్ ఫ్యాన్స్ వార్నర్ మీద పడ్డారు. మా హీరో వీడియో కూడా చేయమంటూ రిక్వెస్ట్ చేసారు. దీంతో వార్నర్ 'పోకిరి' డైలాగ్ తో టిక్ టాక్ చేసాడు. వార్నర్ పోస్ట్ చూసినా ఈ విషయం మనకి అర్థం అవుతుంది. #tollywood #requested #helpme అనే హ్యష్ ట్యాగ్స్ కూడా పెట్టాడు. దీనిని చూస్తేనే తెలుస్తోంది మన వాళ్ళు ఏ రేంజ్ లో ఆయన్ని వేడుకున్నారో అని. వాస్తవానికి 'బుట్ట బొమ్మ' సాంగ్ కూడా ఫ్యాన్స్ కోరిక మీదనే చేసినట్లు వార్నర్ కామెంట్ పెట్టాడు. ఏదేమైనా ఐపీఎల్‌ లో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న వార్నర్ ఇలా మన తెలుగు సినిమాల టిక్ టాక్ వీడియోలు చేయడంతో అందరూ తెగ మురిసిపోతున్నారు. ఇంకొన్ని వీడియోలు చేయాలంటూ వార్నర్‌ ను కామెంట్ల రూపంలో కోరుతున్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి